
టైమ్ ఉత్తమ ఆవిష్కరణల్లో ‘మామ్’
న్యూయార్క్: భారత్‌కు అంతర్జాతీయ కీర్తిని సంపాదించి పెట్టిన ‘మంగళ్‌యాన్ (మార్స్ ఆర్బిటార్ మిషన్-మామ్) మరో గౌరవాన్ని దక్కించుకుంది. 2014కుగాను టైమ్ మేగజైన్ ప్రకటించిన 25 అత్యుత్తమ ఆవిష్కరణల్లో మంగళ్‌యాన్ స్థానం సంపాదించింది. చరిత్రలోనే మొదటిసారిగా భారత్ తమ తొలి ప్రయత్నంలోనే అంగారకుడి వద్దకు విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపగలిగిందని టైమ్ ఈ సందర్భంగా ప్రశంసించింది.
‘తమ మొదటి ప్రయత్నంలోనే ఎవరూ అంగారకుడిని చేరుకోలేకపోయారు. అమెరికా, రష్యాతో పాటు యురోపియన్లు కూడా ఆ పని చేయలేకపోయారు. సెప్టెంబర్ 24న భారత్ ఆ ఘనతను సాధించింది. అద్భుతమైన మంగళ్‌యాన్ ఉపగ్రహం ఆ రోజున అరుణగ్రహం చుట్టూ కక్ష్యలో ప్రవేశించింది. అంగారకుడి వద్దకు విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.’ అని పేర్కొంది. కేవలం 450 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని సాధించడం అద్భుతమని టైమ్ వ్యాఖ్యానించింది.