
‘కారు’చీకట్లో దారి దీపం
లండన్: అసలే చీకటి...ఆపై రహదారిపై ప్రయాణం... చుట్టూ వీధిదీపాలు కూడా లేవు... అప్పుడు కారు కదపడమే కష్టం కదూ... ముందు ఎవరొస్తున్నారో తెలియదు.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోననే భయం.. దాంతో రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకుంటుంటాం...కానీ, ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఉండవు... కటికచీకట్లో కూడా జోరుగా కారులో షికారు చేసే రోజులు రానున్నాయి. రాత్రిపూట కూడా కారుకు 40 మీటర్ల దూరంలో ఎవరైనా ఉంటే డ్రైవింగ్‌సీట్‌లో ఉండేవారు గుర్తుపట్టే కొత్తటెక్నాలజీ కారు అందుబాటులోకి వచ్చింది.
స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు చీకట్లో కూడా కారుకు 40 మీటర్ల దూరంలో ఉండేవారిని గుర్తించే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. వీరు రూపొందించిన వ్యవస్థలో కారుకు ఇన్ఫ్రారెడ్ కెమెరాలు అమర్చి ఉంటాయి. ఇవి తమ ముందుండే వారిని (40 మీటర్లలోపు) గుర్తించి డ్రైవర్‌ను హెచ్చరించడమే కాదు ఆటోమేటిక్ సిస్టమ్‌తో కారును వెంటనే ఆపేస్తుంది కూడా.. భవిష్యత్తులో 40 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండేవారిని కూడా గుర్తించేలా ఈ టెక్నాలజీని అభివృద్ధి పరచనున్నట్లు పరిశోధనల్లో పాలుపంచుకుంటున్న డిజైనర్ డానియల్ ఒల్మెదా వెల్లడించారు.