చిన్నప్పుడు ఆటల పోటీల్లో నెగ్గితే ఏ గిఫ్ట్ ఇచ్చేవారు.. ఏ గ్లాసో.. స్టీల్ గిన్నెనో ఇచ్చేవారు. ఇప్పుడైతే కార్పొరేట్ చదువులు కాబట్టి ఓ షీల్డ్.. మెడల్ ఇస్తున్నారు. ఇంకా ఏం గిఫ్ట్‌లు ఇచ్చేవారు. ఓసారి గుర్తు తెచ్చుకోండి.. మహా అయితే ప్రైజ్‌మనీ ఇస్తారు. పెరూలోని జూలియాకా అనే పట్టణంలో మాత్రం ప్రపంచంలోనే ఎక్కడా కనీవినీ ఎరుగని బహుమతి అందజేస్తారు. అక్కడ ఏటా జరిగే ఫుట్‌సల్ ఫుట్‌బాల్ టోర్నీలో శవపేటికను గెలిచిన జట్టుకు ఇస్తారు. అది కూడా అలాంటిలాంటి పేటిక కాదండోయ్.. దాదాపు రూ.1 లక్ష విలువైన దాన్ని ఇస్తుంటారు.
రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి అంతకన్నా తక్కువ విలువైన శవపేటికను బహుమతిగా ఇస్తారు. ఈ పోటీల్లో దాదాపు 12 జట్లు హోరాహోరీగా పాల్గొని చివరకు శవపేటికను తీసుకెళ్తారు. జట్టు సభ్యులు భుజాలపై ఎత్తుకుని పాటలు పాడుకుంటూ ఆట మైదానం మొత్తం తిరుగుతుంటారు. అయితే పేటికను జట్టు సభ్యులు ఎలా పంచుకుంటారో తెలియదు.. బహుశా దాన్ని అమ్ముకుని వచ్చిన డబ్బును పంచుకుంటారేమో. పెరూలోని పునో ప్రాంతంలో శవపేటికల వ్యాపారం ఎక్కువగా జరుగుతుందట. అందుకే దానికి గుర్తుగా ఇలా బహుమతులుగా ఇస్తుంటారని ఆట నిర్వాహకులు చెబుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment