పాక్‌లో విష మద్యం తాగి 32 మంది మృతి
లాహోర్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో విషపూరిత మద్యం సేవించి 32 మంది మరణించారు. 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. టోబా టెక్ సింగ్ నగరంలోని ముబారకాబాద్ క్రైస్తవ కాలనీలో ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గత శనివారం వీరంతా మద్యాన్ని సేవించారు. మరుసటి రోజు ఉదయానికి కొందరు మరణించగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు.
ఘటనకు కారకులైన తండ్రీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తుకు విచారణ కమిటీని నియమించారు. పాక్‌లో ముస్లింలకు మద్యం అమ్మకం, వినియోగాలపై నిషేధం ఉండగా, మైనారిటీలు, విదేశీయులకు పలు కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. గత మార్చిలో హోలీ వేడుకల్లో భాగంగా కల్తీ మద్యాన్ని సేవించడంతో 45 మంది మరణించిన విషయం తెలిసిందే. వీరిలో 35 మంది హిందువులున్నారు.