ఫొటోలు చూడగానే ఏమనిపించింది.. ఏదో విషాదం సంభవించింది అనేగా.. అయితే.. ఇక్కడ చోటుచేసుకున్నది విషాదం కాదు.. వినోదం.. ఎందుకంటే.. ఇక్కడీ రైళ్లను కావాలనే గుద్దించేశారు!! 1890–1940 మధ్య కాలంలో అమెరికాలో ఈ తరహా ‘రైలు ప్రమాదాలు’ సూపర్‌హిట్. రెండు రైళ్లు ఒకదానికెదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొంటే.. దాన్ని చూడ్డానికి జనం వేలాదిగా తరలివచ్చేవారు. టికెట్ రూ.100 చొప్పున అమ్మేవారు.
జోసెఫ్ కనోలీ అనే ఆయన అయితే.. ఏకంగా 73 విజయవంతమైన షోలు చేశాడు. ఒక్కదానిలోనూ ఎవరికీ గాయాలు కాలేదట. ఈ రైళ్లు 60–70 కిలోమీటర్ల వేగంతో వచ్చి.. గుద్దుకునేవి. ఈ సమయంలో బోగీలు ఒకదానిపైకి మరొకటి ఎక్కేయకుండా వాటిని ఇనుప గొలుసులతో కట్టేవారు. బాయిలర్ పేలకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ఈ షోల కోసం పాత రైలు ఇంజిన్లను వాడేవారు. ట్రైన్ స్టార్ట్ చేసి డ్రైవర్లు దిగిపోయేవారు.
అవి గుద్దుకోగానే జనం కేరింతలు కొట్టేవారు.. వాటి దగ్గర ఫొటోలు తీసుకునేవారు. 1896లో టెక్సాస్‌లో జరిగిన ‘రైలు ప్రమాద’ షోలో మాత్రం బాయిలర్లు పేలిపోయాయి. ఇనుప ముక్కలు తగిలి ఇద్దరు చనిపోగా.. ఓ పత్రిక ఫొటోగ్రాఫర్ కన్నుపోయింది. అయినప్పటికీ.. వీటి క్రేజ్ తగ్గలేదు. మరింత పెరిగింది. తర్వాతి కాలంలో ఈ తరహా షోలు తగ్గుముఖం పట్టాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment