నీటి అడుగున వేటాడుతున్న బజౌ తెగ యువకుడు
జకార్త : నిమిషం పాటు ఊపిరి బిగపట్టడమే కష్టం. అలాంటిది ఏకంగా నీటి అడుగులో పది నిమిషాలు ఊపిరి బిగపట్టడం మాములు విషయం కాదు. ఇండోనేషియాలోని బజౌ గిరిజన తెగకు చెందిన మత్స్యకారులు నీటి అడుగున 13 నిమిషాల పాటు ఊపిరి బిగపడతారంట. ఈ విషయాన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు వెలుగులోకి తీసుకొచ్చారు. సూపర్ హ్యూమన్‌లుగా అభివర్ణిస్తూ ప్రఖ్యాత మాగ్జైన్ ‘జర్నల్ సెల్’ ఈ మేర ఓ కథనాన్ని ప్రచురించింది.
‘ఇండోనేషియాలోని దీవుల్లో వీళ్లు జీవిస్తుంటారు. చెక్కతో ప్రత్యేకంగా తయారు చేసిన కళ్లద్దాలతో సముద్రంలోకి దూకుతారు. సుమారు 230 అడుగుల వరకు వెళ్లి చేపలు పడట్టం వీరి ప్రత్యేకత. అలా సుమారు 13 నిమిషాల వరకు నీటి అడుగున ఉండగలుగుతారు పీహెచ్‌డీ విద్యార్థిని మెలిస్సా ఇలార్డో తెలిపారు. దీనికి కారణం వారి శరీరంలోని ప్లీహం అని ఆమె చెబుతున్నారు. ‘సాధారణంగా నీటి అడుగున ఉన్నప్పుడు శ్వాసక్రియలో ప్లీహం కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్రరక్తకణాలను రక్త ప్రసరణలోకి చేర్చుతుంది. తద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. బజౌ తెగ వారిలో ప్లీహం సాధారణ మానవుల్లో కంటే పెద్ద పరిమాణం(50 శాతం పెద్దదిగా) ఉంది. అందుకే వాళ్లు వాళ్లు అంత ఎక్కువ సేపు నీటి అడుగున ఉండగలుగుతున్నారు’ అని మెలిస్సా వివరించారు.
వెయ్యేళ్ల క్రితం బజౌ తెగ ప్రజలను సీ నమాడ్స్ అని పిలిచే వారు. దక్షిణాసియా సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టి జీవించేవారు. ప్రస్తుతం కొన్ని దీవుల్లో మాత్రమే కనిపిస్తున్నారు. తన పరిశోధనలో భాగంగా మెలిస్సా కొన్ని నెలలుగా ఇక్కడే నివసించి వాళ్ల జన్యు నమునాలను సేకరించి ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు ఈ వాదనను కొట్టేస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనల తర్వాతే ఓ అభిప్రాయానికి వస్తామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment