ఏడుపులు విన్న ట్రంప్ ఏం చేశాడంటే!
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్కు ఇటీవల చిన్నదే అయినా ఓ కఠిన పరీక్ష ఎదురైంది. వర్జీనియాలోని ఓ ఆడిటోరియంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో.. అతనికి సమీపంలో శిశువు ఏడుపులు వినిపించాయి. దీనిపై ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడిన ట్రంప్.. చివరికి ఆ చిన్నారిని బయటకు తీసుకెళ్లమని తల్లిని కోరాడు.
అంతర్జాతీయ అంశాలపై సీరియస్గా ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో తల్లి ఒడిలో ఉన్న ఓ శిశువు బిగ్గరగా ఏడవసాగింది. దీంతో మొదట .. ఆ ఏడుపులు తనకు వినిపిస్తున్నాయని, తనకు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టమని, చాలా అందమైన శిశువు అని ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు. అనంతరం.. చైనా తన కరెన్సీ విలువను తగ్గించడం గురించి ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో.. మరోసారి ఆ శివువు బిగ్గరగా ఏడుపు ప్రారంభించింది. దీంతో ఇక లాభం లేదనుకున్న ట్రంప్.. తాను ఇంతకు ముందు జోక్ చేశానని, ఆ శిశువును అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లమని తల్లికి సూచించాడు. ఇండియన్ అమెరికన్లు, ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన వారు ఎక్కువగా పాల్గొన్న ఈ ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ప్రవర్తనకు నవ్వుకున్నారు.