
జెరూసలెం: జెరూసలెం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై పాలస్తీనా రాజకీయ నాయకులు భగ్గుమన్నారు. ట్రంప్ నిర్ణయంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు మతయుద్ధాలకు పిలుపునివ్వవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ట్రంప్ చర్యతో ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతిచర్చల్లో మధ్యవర్తిగా ఉండే అర్హతను అమెరికా కోల్పోయిందని స్పష్టం చేశారు.
'ఉగ్రవాదులు మతయుద్ధాలకు దిగేందుకు సాయపడేలా ఈ చర్యలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతమంతా నష్టపోయే అవకాశముంది. ఇప్పటికే తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న ఇక్కడ ఎప్పటికీ ముగిసిపోని యుద్ధానికి ఇది దారితీయవచ్చు. ఈ యుద్ధానికి వ్యతిరేకంగా మేం ఇప్పటివరకు హెచ్చరిస్తూ వచ్చాం. ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరాం' అని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మౌద్ అబ్బాస్ దేశాన్ని ఉద్దేశించి టీవీలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.
ట్రంప్ తాజా చర్యతో ఇక శాంతిచర్చల్లో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించలేదని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ తేల్చిచెప్పింది. రెండు రాజ్యాల ఏర్పాటు సాధ్యంకాని రీతిలో ట్రంప్ విధ్వంసక నిర్ణయం తీసుకున్నారని ఆ సంస్థ సెక్రటరీ జనరల్, పాలస్తీనా చర్చల ప్రధాన ప్రతినిధి సాహెబ్ ఎరెకత్ అన్నారు. ట్రంప్ తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఇదని ఆయన సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఇరుపక్షాలను కూర్చోబెట్టి.. చర్చలు, సంప్రదింపులు జరపడం ద్వారా నిర్ణయం తీసుకోవడానికి బదులు ఏకపక్షంగా ట్రంప్ హుకుం జారీచేశారని, రెండు రాజ్యాల పరిష్కారాన్ని నాశనం చేసేలా ఇజ్రాయెల్ అధికారులు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.
ట్రంప్ నిర్ణయంపై ఇటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు దారితీస్తోంది. అమెరికా మిత్రపక్షమైన యూరప్‌తోపాటు ఐక్యరాజ్యసమితి, అరబ్ దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. మరోవైపు ట్రంప్ నిర్ణయంతో ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతిచర్చలకు తీవ్ర విఘాతం కలిగిందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment