ఇండియా, పాక్ విషయంలో రంగంలోకి ట్రంప్!
న్యూయార్క్: దాయాది పాకిస్థాన్, భారత్ మధ్య సమస్యలు కుదిర్చేందుకు అగ్రరాజ్యం అమెరికా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా అమెరికా వివాదాస్పద అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో రంగంలోకి దిగే యోచన చేస్తున్నట్లు సమాచారం. భారత్, పాక్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు ట్రంప్ జోక్యం చేసుకోనున్నట్లు అమెరికా తరుపున ఐక్యరాజ్యసమితి శాశ్వత రాయబారి నిక్కీ హాలే చెప్పారు. 'భారత్-పాక్ మధ్య సంబంధాల విషయంలో ట్రంప్ పరిపాలన వర్గానికి ఆందోళన ఉంది.
ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తే బాగుంటుందని, ఏ విధంగా ముందుకు వెళితే ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. ట్రంప్ పాలన వర్గం కచ్చితంగా సమస్యకు పరిష్కారాన్ని మధ్యవర్తిగా ఉండి సూచిస్తారని నేను అనుకుంటున్నాను' అని కూడా ఆమె పేర్కొన్నారు. ఇందులో అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న పెద్ద ఆశ్చర్యపోనవసరం కూడా లేదని అన్నారు.
ఏదో జరిగిందాక తాము ఆగే పరిస్థితిలో లేమని, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, సమస్యలు మరింత జఠిలంగా మారుతున్న నేపథ్యంలో వీలయినంత త్వరగా ట్రంప్ ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. తమ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యల విషయాల్లో పొరుగుదేశాల జోక్యాన్ని ఒప్పుకోబోమని ఇప్పటికే భారత్ కుండబద్ధలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏ విధంగా రెండు దేశాల విషయాల్లో ముందడుగు వేయనున్నారనే విషయం ఆసక్తిగా మారింది.