ఇదెక్కడి ‘ట్రంపు’ నోరు! | Trump’s bizarre, dangerous calls with the leaders of Mexico and Australia, explained | Sakshi
Sakshi News home page

ఇదెక్కడి ‘ట్రంపు’ నోరు!

Published Fri, Feb 3 2017 12:35 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ఇదెక్కడి ‘ట్రంపు’ నోరు! - Sakshi

ఇదెక్కడి ‘ట్రంపు’ నోరు!

ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌తో వాగ్వాదం
► మధ్యలోనే ఫోన్  పెట్టేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌
►  అత్యంత చెత్త ఫోన్‌ కాల్‌ ఇదేనని ట్రంప్‌ వ్యాఖ్య!

వాషింగ్టన్ /కాన్ బెర్రా: తాను చేసిందే చట్టంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పుడు తాను చెప్పినట్లు వినాల్సిందేనంటూ ప్రపంచానికి ప్రమాద సంకేతాలు పంపుతున్నారు. అందుకు నిదర్శనంగా అమెరికాకు మిత్రదేశమైన ఆస్ట్రేలియాతో తగువు పెట్టుకున్నారు. ఒబామా హయాంలో కుదుర్చుకున్న శరణార్థుల ఒప్పందంపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌తో వాగ్వాదానికి దిగి మధ్యలోనే ఫోన్  పెట్టేశారు. అధ్యక్షుడయ్యాక వరుసగా ప్రపంచదేశాల అధినేతలతో మాట్లాడుతున్న ట్రంప్‌... ఇంతవరకూ తాను మాట్లాడిన ఫోన్  కాల్స్‌లో ఇదే అత్యంత చెత్తదిగా పేర్కొన్నారని ‘వాషింగ్టన్  పోస్ట్‌’ తెలిపింది. టర్న్‌బుల్‌తో దాదాపు గంట సేపు మాట్లాడాలనుకున్న ట్రంప్‌ 25 నిమిషాలకే ఫోన్ కాల్‌ ముగించారని ఆ పత్రిక వెల్లడించింది.

గత శనివారం ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌కు ట్రంప్‌ ఫోన్  చేశారు. ఒబామాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆస్ట్రేలియా శరణార్థుల్ని అమెరికాలోకి అనుమతించాలని మాల్కం కోరగా... ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు. ఒప్పందంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం సాగినట్లు అమెరికా మీడియా పేర్కొంది. 2 వేల మంది శరణార్థుల్ని అమెరికా అంగీకరించడం చాలా చెత్త ఒప్పందమని ట్రంప్‌ మండిపడ్డారు. 2వేల మంది కాదని 1,250 మంది శరణార్థులేనని టర్నబుల్‌ పదే పదే ట్రంప్‌కు గుర్తు చేశారు. శరణార్థుల్లో ఒకరు మరో బోస్టన్  బాంబర్‌ అవుతారంటూ ఆరోపణలు చేశారు. అమెరికాకు శరణార్థుల రాకను తాత్కాలికంగా రద్దు చేసిన నేపథ్యం లో ఒబామా సర్కారు చేసుకున్న ఒప్పందం ఎలా అమలవుతుందని ట్రంప్‌ ప్రశ్నించారు.

ఇదొక చెత్త ఒప్పందం: ట్రంప్‌
అనంతరం ట్రంప్‌ ట్వీట్‌ చేస్తూ ‘ఒబామా సర్కారు వేలాది మంది శరణార్థుల్ని అక్రమంగా ఆస్ట్రేలియా నుంచి వచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ చెత్త ఒప్పందాన్ని నేను పరిశీలిస్తాను’ అన్నారు. టర్న్‌బుల్‌ మాత్రం ట్రంప్‌తో సంభాషణ గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. అమెరికా – ఆస్ట్రేలియాల మధ్య ఒప్పందం మేరకు పసిఫిక్‌ దేశాలైన నౌరు, పపువా న్యూగినియా సముద్ర తీరాల్లోని నిర్బంధ శిబిరాల్లో ఉంటున్న 1,250 మంది శరణార్థుల్ని అమెరికా అనుమతించాలి. ఈ శరణార్థుల్లో చాలామంది ఇటీవల ట్రంప్‌ నిషేధం విధించిన 7 దేశాలకు చెందిన వారు ఉన్నారు.

మత స్వేచ్ఛకు పాటుపడతాం
అమెరికాలో మత స్వేచ్ఛను కాపాడేందుకు తన సర్కారు సాధ్యమైనదంతా చేస్తుందని  ట్రంప్‌ అన్నారు. ‘అమెరికా ఎప్పటికీ సహనానికి ప్రతీకగా ఉండాలి. భద్రంగా ఉన్నామనే భావన అందరిలో ఉండాలి’ అని పేర్కొన్నారు. మతస్వేచ్ఛకు ఉగ్రవాదం ప్రధాన ముప్పని, దాన్ని అడ్డుకోవాల్సిందేనన్నారు.  ఇదిలాఉండగా, అమెరికా విదేశాంగ మంత్రిగా రెక్స్‌ టిల్లర్‌సన్  (64) ప్రమాణ స్వీకారం చేశారు. టిల్లర్‌సన్ నియామకాన్ని 56–43 ఓట్లతో సెనేట్‌ ఆమోదించింది.

ఒల్తైన జుట్టు వెనుక...
మీరెప్పుడైనా ట్రంప్‌ హెయిర్‌ స్టైల్‌ను క్షుణ్నంగా పరిశీలించారా... ఏడు పదుల వయసులోను జాలువారుతున్న వెంట్రుకలతో ఆకట్టుకునే కేశ సంపద ట్రంప్‌ సొంతం. ఈ వయసులోనూ అంత ఒత్తైన జుట్టు ఎలా సాధ్యమనే రహస్యాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడు బయటపెట్టారు. పొడవైన జుట్టు కోసం ట్రంప్‌ ప్రొస్టేట్‌ సంబంధిత మందులు (ఫినాస్టెరైడ్‌) వాడేవారంటూ.. 1980 నుంచి వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించిన హరొల్డ్‌ ఎన్  బోర్నస్టెయిన్  న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు తెలిపారు. ఫినాస్టెరైడ్‌ను మగవాళ్లలో బట్టతల నివారణకు కూడా వినియోగిస్తారు. అలాగే బుగ్గలు, నుదుటి భాగంలో ఎర్రటి దద్దుర్లు (రొజెసియా) తగ్గేందుకు యాంటీ బయాటిక్స్, రక్తం లోని కొలస్ట్రాల్‌తో పాటు కొవ్వు తగ్గేందు కు స్టాటిన్  వాడేవారని ఆయన చెప్పారు. గుండెపోటు ప్రమాదం తగ్గేందుకు రోజూ ‘బేబీ ఆస్పిరిన్ ’ తీసుకునేవారని, ఆరోగ్యం విషయంలో ట్రంప్‌ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవారని హరొల్డ్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement