వాషింగ్టన్ : సిరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా నరమేధానికి తెగబడిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని అమెరికా సేనలు మట్టుబెట్టిన విషయం విదితమే. పక్కా పథకం ప్రకారం ఇరాక్, టర్కీ, రష్యాల సహాయంతో బాగ్దాదీ జాడను కనిపెట్టిన అగ్రరాజ్య సైన్యం అతడిని చుట్టుముట్టడంతో ఉగ్రమూక నాయకుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తనతో పాటు తన ముగ్గురు పిల్లలను కూడా బాంబులతో పేల్చివేశాడు. బాగ్దాదీ చేతిలో దారుణ అత్యాచారానికి గురై హత్య చేయబడిన అమెరికా సామాజిక వేత్త కైలా ముల్లర్ పేరిట... అమెరికా చేపట్టిన ఈ రహస్య ఆపరేషన్‌లో సైన్యంతో పాటు సైనిక జాగిలాలు కూడా కీలక పాత్ర పోషించాయి. సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని పరిష గ్రామంలో తలదాచుకున్న బాగ్దాదీని వెంటాడాయి. అమెరికా ఆర్మీకి చెందిన 75వ రేంజర్ రెజిమెంట్ బలగాలతో పాటు కొన్ని శునకాలు కూడా బాగ్దాదీని వేటాడాయి. దీంతో దిక్కుతోచని బాగ్దాదీ తన ఇంటి లోపల గల రహస్య మార్గం గుండా పరుగులు తీస్తూ, కేకలు వేస్తూ శరీరానికి చుట్టుకున్న సూసైడ్ జాకెట్ పేల్చుకుని తనను తాను అంతం చేసుకున్నాడు.(చదవండి : క్రూరంగా అత్యాచారం చేశాడు.. అందుకే ఆ పేరు..)
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ తమ సైన్యం చేతిలో ఐసిస్ చీఫ్ కుక్కచావు చచ్చాడని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అంతేకాదు అతడిని వెంటాడంలో అమెరికా సైనిక కే9 శునకాలు కీలక పాత్ర పోషించాయని వెల్లడించారు. ఇక బాగ్దాదీని తరిమిన శునకం గాయపడటంతో దాని వివరాలను పెంటగాన్ గోప్యంగా ఉంచింది. కేవలం అది బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందినదని, మెరుపు వేగంతో పరిగెత్తి శత్రువులను వెంటాడగలదని మాత్రమే పేర్కొంది. అయితే ట్రంప్ మాత్రం తమ వీర శునకం గురించి మాట్లాడుతూ... ‘ మా కెనైన్.. కొంతమంది దానిని కుక్క అంటారు.. మరికొంత మంది అందమైన కుక్క అంటారు... ఇంకొంత మంది ప్రతిభావంతమైన కుక్క అంటారు... తను గాయపడింది. ప్రస్తుతం దానిని వెనక్కి తీసుకువచ్చాం’ అని పేర్కొన్నారు. అయితే మంగళవారం మాత్రం దాని పేరు చెప్పకుండా కేవలం ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘ ఆ అందమైన శునకం ఫొటో ఇది. ఐసిస్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని పట్టుకోవడంలో, అతడిని హతమార్చడంలో కీలక పాత్ర పోషించింది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రమంలో 2011లో ఒసామా బిన్ లాడెన్‌ను తరిమిన కైరో అడుగుజాడల్లో కెనైన్ నడిచి మరో ఉగ్రవాదిని హతం చేయడంలో కీలకంగా వ్యవహరించిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి : ఐసిస్ చీఫ్ బాగ్దాదీని పట్టించింది అతడే!)
We have declassified a picture of the wonderful dog (name not declassified) that did such a GREAT JOB in capturing and killing the Leader of ISIS, Abu Bakr al-Baghdadi! pic.twitter.com/PDMx9nZWvw
— Donald J. Trump (@realDonaldTrump) October 28, 2019
Comments
Please login to add a commentAdd a comment