
కత్తితో.. స్టెప్పు లేసిన ట్రంప్..!
సందర్భం ఏదైనా తన ప్రత్యేక హావభావాలతో ఆ కార్యక్రమాన్ని రక్తి కట్టించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా పర్యటనలో స్టెప్పు లేశారు. సౌదీ సంప్రదాయ నృత్యం 'స్వార్డ్ డాన్స్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాలు కదిపారు. అంతకుముందు మురబ్బా ప్యాలెస్‌లో ట్రంప్‌కు ఘనస్వాగతం లభించింది. అందులో భాగంగా జరిగిన వేడుకల్లో తమ సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు సౌదీ అరేబియన్లు. వారి ప్రదర్శనకు అనుగుణంగా వస్తున్న సంగీతానికి ట్రంప్ ముగ్ధుడయ్యారు. ఇది గమనించిన సౌదీ సిబ్బంది ట్రంప్ చుట్టూ చేరి నృత్యం చేసేందుకు ఆయన్ను తీసుకెళ్లారు.
వారిలో ఒకరి నుంచి కత్తి అందుకున్న ట్రంప్ ముఖంపై చిరునవ్వుతో నృత్యం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో కలిసి రెండు రోజుల సౌదీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అధ్యక్ష హోదాలో ట్రంప్ తొలిసారి పర్యటిస్తున్న దేశం సౌదీ అరేబియానే.