టర్కీలో సైనిక తిరుగుబాటు, 90మంది మృతి
అంకారా : టర్కీలో సైన్యం తిరుగుబాటు చేసింది. దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా మార్షల్ చట్టం అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. దేశంలో నియంతృత్వ పాలన, ఉగ్రవాదం కారణంగానే ఈ తిరుగుబాటు చేసినట్లు టర్కీ సైన్యం వెల్లడించింది. తిరుగుబాటులో భాగంగా రాజధాని అంకారా గగనతలంలో సైనిక విమానాలు, హెలికాప్టర్లతో సైన్యం పహారా కాస్తుంది. ప్రభుత్వ టీవీ, రేడియోను టర్కీ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది.
అయితే సైనిక తిరుగుబాటును విదేశీ పర్యటనలో ఉన్న టర్కీ దేశాధ్యక్షుడు ఎర్డోగన్ ఖండించారు. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి మద్దతు తెలపాలని ప్రజలకు ఎర్డోగన్ పిలుపు నిచ్చారు. ఈ తిరుగుబాటులో పాలుపంచుకున్న వారు త్వరలో భారీ ముల్యం చెల్లించక తప్పదని ఎర్డోగన్ హెచ్చరించారు. ఈ పరిస్థితిని త్వరలోనే అధిగమిస్తామని ఎర్డోగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్డోడన్కు మద్దతుగా ప్రజలు వీధుల్లోకి వచ్చి మద్దతు తెలిపారు. ఇస్తాంబుల్లోని ప్రఖ్యాత టక్మిమ్ కూడలి వద్ద సైనికులు, ప్రజల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా టర్కీ పోలీస్ హెడ్ క్వార్టర్స్పై హెలికాప్టర్ గన్ షిప్పుతో సైనికులు కాల్పులు జరిపా రు. ఈ కాల్పుల్లో 90మంది మరణించారు. టర్కీ పార్లమెంట్పై సైన్యం మూడు బాంబులను ప్రయోగించింది. దాంతో ఎంపీలు పార్లమెంట్ షెల్టర్లో తల దాచుకున్నారు. కీలక అధికారులను సైన్యం తన నిర్బంధంలోకి తీసుకుంది. అంకారా, ఇస్తాంబుల్ నగరాల్లో పలు చోట్ల భారీ పేలుడు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇస్తాంబుల్లోని స్థానిక ఎయిర్పోర్ట్ వద్ద భారీగా సైనికులు మోహరించారు. టర్కీ ఆర్మీ సీనియర్ అధికారి జనరల్ హుల్యుసి అకర్ను సైనికులు నిర్బంధించారు. టర్కీలో ఇప్పటి వరకు నాలుగు సార్లు 1960, 1971, 1980, 1993లో సైనిక తిరుగుబాటు జరిగింది.