యూఏఈ నిర్మించబోతున్న ‘భూ అంగారక’ గృహగోళాల నమూనా
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఓ కొత్త నగరాన్ని కట్టబోతున్నారు. పెట్రోలు, డబ్బులు బోలెడున్నాయి కదా.. ఒకటి కాకపోతే వంద కట్టుకోనీ మనకేమిటి అనుకుంటున్నారా? నిజమేకానీ.. ఇది చాలా స్పెషల్. వివరాలు తెలిస్తే మీరే అంటారు.. వావ్ అని! ముందుగా పేరు. ‘మార్స్ సైంటిఫిక్ సిటీ’. ఈ రోజు కాకపోతే ఇంకో వందేళ్లకైనా మనకు మరో ఇల్లు కాగలదని అనుకుంటున్న అంగారకుడిని పోలిన వాతావరణంతో నిర్మాణమవుతోంది ఈ నగరం. మొత్తం నిడివి 19 లక్షల చదరపు మీటర్లు. పెట్టే ఖర్చు 13.6 కోట్ల డాలర్లు.
పే....ద్ధ గోళాకారం వంటి నిర్మాణం లోపల ఉండే ఈ నగరంలో భవిష్యత్తులో అంగారకుడిపైకి చేరితే పంటలు ఎలా పండించాలి? నీళ్లు ఎలా సేకరించాలి అనే అంశాలన్నింటిపైనా పరిశోధనలు జరుగుతాయి. యూఏఈ ఇప్పటివరకూ సొంతంగా ఒక ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించలేదు కానీ.. అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా ఇంకో మూడేళ్లలోపు అంగారకుడిపైకి ‘హోప్‘ పేరుతో ఓ అంతరిక్ష నౌకను పంపనుంది. యూఏఈ దేశం ఏర్పడి 50 ఏళ్లు అయిన సందర్భంగా.. అంటే 2021 నుంచి ఈ నౌక మార్స్ చుట్టూ పరిభ్రమించడం మొదలుపెడుతుంది. అంతేకాకుండా ఇంకో వందేళ్లకైనా సరే.. అంగారకుడిపై తామే సొంతంగా నగరాన్ని కట్టుకోవాలన్న లక్ష్యంతో ఈ మార్స్ సైంటిఫిక్ సిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్