ఓ ట్వీట్.. ఉగ్రవాద దంపతులకు జీవిత ఖైదు
లండన్లో ఉగ్రవాద దాడికి కుట్రపన్నిన దంపతులకు జీవిత ఖైదు విధించారు. లండన్ రవాణ వ్యవస్థపై ఉగ్రవాదదాడి జరిగి పదేళ్లు కావస్తున్న సందర్భంగా మహ్మద్ రెహ్మాన్ (25), సనా అహ్మద్ ఖాన్ (24) ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు కుట్ర పన్నినట్టు కోర్టు నిర్ధారించింది. వీరిద్దరినీ దోషులుగా ప్రకటించిన కోర్టు రెహ్మాన్కు 27 ఏళ్లు, సనాకు 25 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించినట్టు బ్రిటీష్ మీడియా వెల్లడించింది.
రెహ్మాన్ ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేసిన ట్వీట్ల ఆధారంగా భద్రత అధికారులు గత మేలో ఈ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. లండన్లో బాంబు పేల్చడానికి తగిన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయని సలహా కోరుతూ ఓ ట్వీట్ చేశాడు. బాంబులను ఎలా పేల్చాలి, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ గురించి ఆన్లైన్లో సెర్చి చేసినట్టు అధికారులు కనుగొన్నారు. భద్రతాధికారులు రెహ్మాన్ను అరెస్ట్ చేశాక వారి ఇంట్లో సోదాలు చేశారు. బాంబు తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రెహ్మాన్, సనా ఇంటర్నెట్లో ఉగ్రవాద కార్యకలాపాల గురించి తెలుసుకునేవారని, సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని పంచుకునేవారని ఓ ఉన్నతాధికారి చెప్పారు.