
'అతని' కాపలా ఖర్చు రూ.94 కోట్లు..
లండన్: ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో శరణార్ధిగా ఉన్న వీకీలిక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే(43)ను కాపలా కాసేందుకు బ్రిటన్ ప్రభుత్వం పెద్దమెత్తంలో ఖర్చు చేస్తోంది. 2012లో అసాంజే లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయించినప్పటినుంచి ఇంతవరకు అయిన మెత్తం ఖర్చు దాదాపు 94 కోట్ల 60 లక్షల రూపాయలుగా తేలింది. స్వీడన్‌లో లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న అసాంజే దౌత్య కార్యాలయం బయటకు వస్తే అరెస్టు చేసేందుకు స్కాట్‌లాండ్ యార్డు పోలీసులు నిరంతర పహారా ఏర్పాటు చేశారు. గతేడాది అక్టోబరు నాటికి దీనికైన ఖర్చు రూ.85 కోట్లుగా స్కాట్‌లాండ్ యార్డ్ ధ్రువీకరించింది.
అసాంజే కాపలాకు రోజువారీ ఖర్చు రూ.9 లక్షల 50 వేలుగా ఎల్బీసీ రేడియో సమాచార చట్టం ద్వారా సేకరించింది. విదేశీ దౌత్య కార్యాలయాల రక్షణ కింద ఈ నిధులు పొందుతున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వం ఇరాక్ యుద్ధంలో వేలమంది మరణించినప్పుడు దర్యాప్తు కోసం చేసిన ఖర్చును మించి ఒక రాజకీయ శరణార్ధికోసం ఖర్చు చేయడం దిగ్భ్రాంతికరమని వీకీలిక్స్ ఆధికార ప్రతినిధి క్రిష్టీన్ రఫెన్సన్ విమర్శించారు.