జెనీవా : ప్రపంచవ్యాప్తంగా 47 కోట్ల మంది నిరుద్యోగులు, చిరుద్యోగులున్నారని, అర్హులకు సరైన ఉద్యోగం కల్పించకపోతే అది సామాజిక అశాంతికి దారితీస్తుందని ఐక్యరాజ్యసమితి విధాన నిర్ణేతలను హెచ్చరించింది. గత దశాబ్ధంతో పోలిస్తే ప్రపంచ నిరుద్యోగ రేటు నిలకడగానే సాగుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక పేర్కొంది. నిరుద్యోగరేటు 5.4 శాతం కొనసాగుతున్నా ఆర్థిక మందగమంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల సంఖ్య మాత్రం కుదించుకుపోతోందని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 2019లో 18.8 కోట్ల మంది నిరుద్యోగులుగా నమోదు చేయించుకోగా, ఈ ఏడాది వారి సంఖ్య 19.5 కోట్లకు ఎగబాకుతుందని ఐఎల్‌ఓ తన వార్షిక ప్రపంచ ఉపాధి..సామాజిక దృక్కోణం పేరిట విడుదలైన నివేదికలో పేర్కొంది.
మరోవైపు ప్రపంచవ్యాప‍్తంగా 28.5 కోట్ల మందికి అన్ని అర్హతలున్నా అరకొర వేతనాలతో చిరుద్యోగులగానే బతుకుతున్నారని తెలిపింది. ప్రపంచ కార్మిక శక్తిలో దాదాపు 50 కోట్ల మందికి సరైన వేతనాలు అందడం లేదని ఐఎల్‌ఓ చీఫ్ గై రైడర్ పేర్కొన్నారు. 2009 నుంచి 2019 మధ్య అంతర్జాతీయ స్ధాయిలో సమ్మెలు, ప్రదర్శనలు పెరిగాయని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో 60 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని వీరంతా చాలీచాలని జీతాలతో కనీస సాంఘిక రక్షణలు లేకుండా పనిలో నెట్టుకొస్తున్నారని ఐఎల్‌ఓ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment