ILO report
-
ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే..
గత కొన్ని రోజులకు ముందు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ 'నారాయణ మూర్తి' చేసిన వారానికి 70 గంటల పని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కొందరు ఈ వ్యాఖ్యలను సమర్దిస్తే.. మరి కొందరు వ్యతిరేకించారు. ఇప్పుడు ఏ దేశంలో ఎక్కువ పనిగంటలు ఉన్నాయనే వివరాలను 'ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్' వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం.. భారతదేశంలో ప్రతి ఉద్యోగి వారానికి సగటున 47.7 గంటలు పనిచేస్తాడు. ప్రపంచంలో ఎక్కువ కష్టపడే ఉద్యోగులలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నట్లు ఈ డేటా స్పష్టం చేస్తోంది. చైనాలోని ఉద్యోగులు వారానికి 46.1 గంటలు పనిచేస్తూ జాబితాలో రెండవ స్థానం పొందారు. ఫ్రాన్స్ ఉద్యోగులు వారానికి కేవలం 30.1 గంటలు మాత్రమే అని డేటా చెబుతోంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఇటీవల సూచించిన వారానికి 70 గంటల పని.. భారతదేశాన్ని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోటీపడేలా చేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్లు, జపనీయులు అదనపు పనిగంటలు చేయడం ప్రారంభించారని మూర్తి వెల్లడించారు. జిందాల్, భవిష్ అగర్వాల్ వంటి ప్రముఖులు ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్.. సుదీర్ఘ పని గంటలను గురించి ప్రస్తావించిన మొదటి వ్యక్తి నారాయణ మూర్తి కాదు, గతంలో ఒక సారి బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ శంతను దేశ్‌పాండే కూడా ఇదే విషయం మీద తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అతని మాటలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలవడంతో చివరకు క్షమాపణ చెప్పవలసి వచ్చింది. -
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 'ఏఐ'పై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన
రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని గత కొంతకాలంగా భయపడుతున్నారు. చాలా మంది నిపుణులు కూడా కృత్రిమ మేధ అనేక సమస్యలను తీసుకువస్తుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం అపోహ మాత్రమే అని ఐక్యరాజ్య సమితికి చెందిన 'ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్' (ILO) కొంత ఉపశమనం కలిగించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాలా రోజులు ముందు నుంచి ఉన్నప్పటికీ 'చాట్‌జీపీటీ' ఎంట్రీతో సంచలనంగా మారింది. అనతి కాలంలో చాలా కంపెనీలు దీని సాయంతోనే అభివృద్ధి పనులు వేగవంతం చేసుకున్నాయి. దీంతో తప్పకుండా ఉద్యోగాలు పోతాయని చాలామంది భయపడ్డారు. రానున్న రోజుల్లో లక్షల ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐకి సంబంధించి ఉద్యోగులకు శిక్షణ కూడా ఇస్తుండంతో ఇది మరింత భయాన్ని కల్పించింది. అయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలకు ఎలాంటి డోకా లేదని తేల్చి చెప్పింది. ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా! ఈ టెక్నాలజీ ఎప్పటికీ ఉద్యోగులను రీప్లేస్ చేసే అవకాశం లేదని వెళ్ళదీస్తూనే.. ఏఐ వల్ల భవిష్యత్ టెక్నాలజీ మరింత అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. కావున ఉద్యోగుల తమ ఉద్యోగాలను కోల్పోతామనే అపోహ విడిచిపెట్టాలని తెలిపింది. ఎంత గొప్ప టెక్నాలజీ వచ్చిన అవన్నీ కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది. -
పని చేయాలన్నా బలం ఏది?
కార్మిక శక్తి నుంచి చాలామంది భారతీయులు వైదొలుగుతున్నారు. పని చేయగల వయసు వారిలో 46 శాతం మాత్రమే పనిచేస్తున్నారు లేదా పని చేయాలనుకుంటున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతోంది. కారణం ఏమిటి? పేదలకు అందుబాటులో ఉన్న పనులను వారు శారీరకంగా చేయగల స్థితిలో లేరు. నాలుగింట మూడొంతుల ఉపాధి వ్యవసాయం, నిర్మాణ, వాణిజ్య రంగాలే కల్పిస్తున్నాయి. ఈ మూడు రంగాలూ పెద్దగా డబ్బులు చెల్లించడం లేదు. పైగా రెండు రంగాలైతే కార్మికుల వెన్ను విరిచేస్తున్నాయి. దాంతో కఠిన శ్రమ చేయడానికి అవసరమైన పోషణ వీరికి అందడం లేదు. కాబట్టి వీరు పని నుండి తప్పుకొంటున్నారు. మన మీడియా వర్ణిస్తున్న ‘ఉచితాలపై’ శాశ్వతంగా ఆధారపడుతున్నారు. ఇదొక విష వలయం! పేద దేశాల ప్రజలు వేతన శ్రమ కోసం వేసారి పోతున్నారు. చట్టబద్ధంగా పనిచేయ గల 15 సంవత్సరాల వయసు రాకముందే వారు తమ పిల్లలను పనికి పంపిస్తున్నారు. తక్కువ ఆదాయాలు గల దేశాల్లోని పని చేయగల జనాభాలో సగటున 66 శాతం మంది పనిచేస్తున్నారనీ, లేదా పని చేయాలని అనుకుంటున్నారనీ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) చెప్పింది. అధికాదాయ దేశాల్లో ఈ నిష్పత్తి 60 శాతం ఉంది. పేద ప్రజలు ఏ వయసులో ఉన్నా వారు పనిచేయాల్సి ఉంటుందనేది అర్థం చేసుకోదగినదే. అదే సంపన్నుల విషయానికి వస్తే వయసు మీరగానే శ్రామిక శక్తి నుంచి తప్పుకోగలరు. భారత్ విషయానికి వస్తే ఈ తర్కం మారిపోతుంది. భారతీయ శ్రామిక జనాభాలోని 46 శాతం మాత్రమే పని చేస్తున్నారు లేదా పని చేయాలనుకుంటున్నారు. ఇవి ఐఎల్ఓ గణాంకాలు. అదే సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) నుంచి మీరు గణాం కాలు తీసుకున్నట్లయితే, అవి షాక్ కలిగిస్తాయి. 2020 ఫిబ్రవరిలో అంటే కోవిడ్–19 మహమ్మారి మనపై దాడి చేయకముందు భార తీయ శ్రామిక జనాభాలో 44 శాతం మాత్రమే పని చేయాలను కుంటున్నారని ఈ డేటా చెప్పింది. 2022 అక్టోబర్ నాటికి ఇది 40 శాతానికి పడిపోయింది. అంటే పనిచేసే వయసు విభాగంలోకి వచ్చిన భారతీయుల్లో 60 శాతం మందికి పనిలేదు లేదా వారు పనిచేయాలని కోరుకోవడం లేదు. దీనికి అతి పెద్ద కారణం ఏమిటంటే, పని చేయగల వయసులో ఉన్న భారతీయ మహిళల్లో కొద్దిమంది మాత్రమే డబ్బు వచ్చే పని చేయగలుగుతున్నారు. 1990 నుంచి 2006 మధ్య కాలంలోని ఐఎల్ఓ డేటా 32 శాతం మహిళలు మాత్రమే శ్రామిక శక్తిలో పాల్గొంటున్నా రనీ, వీరు డబ్బు వచ్చే పని చేస్తుండటం లేదా అలాంటి పని చేయాలనుకుంటున్నారనీ చెబుతోంది. అదే 2019 నాటికి ఇది 22 శాతానికి పడిపోయింది. ఇక సిఎంఐఈ డేటా మరింత నిరాశాజనక మైన విషయాన్ని బయటపెట్టింది. 2020 ఫిబ్రవరిలో అంటే కోవిడ్ లాక్డౌన్లు రాకముందు పనిచేయగల వయసులో ఉన్న 12 శాతం మహిళలు మాత్రమే దేశంలో పనిచేస్తున్నారు లేదా పని చేయాలను కుంటున్నారు. 2022 అక్టోబర్ నాటికి ఇలాంటి వారి సంఖ్య 10 శాతానికి పడిపోయింది. అదే చైనాతో పోల్చి చూసినట్లయితే పనిచేసే వయసు ఉన్న 69 శాతం మంది మహిళలు అక్కడ కార్మిక శక్తిలో పాల్గొంటున్నారు. భారతదేశంలో అధోగతిలో ఉన్న మహిళా కార్మికశక్తి భాగస్వామ్య రేటు, పెరుగుతున్న మన ఐశ్వర్యంతో పోలిస్తే అనుషంగిక నష్టంలా కనిపిస్తోందని ఆర్థికవేత్తలు వివరిస్తున్నారు. ఇంటి బయట మహిళలు పనిచేయడం అంటేనే భారతీయులు మొహం చిట్లించుకుంటారు. కానీ డబ్బుకు కటకట అవుతున్న పరిస్థితుల్లో వారికి అంతకు మించిన అవకాశం మరొకటి లేదు. భారతీయులు రానురానూ దారిద్య్రం నుంచి బయటపడుతున్న కొద్దీ వారి మహిళలు పనిచేయడం ఆపివేసి ఇళ్లకు మరలిపోతున్నారు. ఐశ్వర్యం అనేది పేదలను కూడా సంస్కృతీ కరణ ప్రభావానికి గురి చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పేదలు కూడా ఆదాయ నిచ్చెన పైకి ఎక్కుతున్న కొద్దీ మహిళల పట్ల సాంప్రదాయిక భావజాలం వైపు వెళ్లిపోతున్నారు. సౌకర్యంగానే ఉందనిపిస్తున్న ఈ ధోరణిలో రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి: 2005–06లో కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యం గుర్తించదగినంత అధికంగా ఉన్నప్పుడు కూడా పిరమిడ్ దిగువ భాగంలో ఉన్న భారతీయ గృహాలు సంపన్నంగా మారాయనడానికి ఎలాంటి సాక్ష్యమూ లేదు. రెండు: కొద్దిమంది మహిళలు మాత్రమే వేతనం వచ్చే పనిని కోరుకుంటున్నారని అనుకుంటే, వారు సుల భంగా ఉద్యోగం సంపాదించగలగాలి. కానీ వాస్తవం దానికి వ్యతి రేకంగా ఉంది. దేశంలో పురుషుల నిరుద్యోగితా రేటు 8.6 శాతం ఉండగా, మహిళల్లో నిరుద్యోగితా రేటు మూడు రెట్లకంటే ఎక్కువగా 30 శాతం ఉందని సీఎంఐఈ అక్టోబర్ నెలకు ప్రకటించిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీని అర్థమేమిటంటే, భారత దేశంలో ప్రతి 100 మంది శ్రామిక మహిళల్లో 10 మంది మాత్రమే పనికోసం చూస్తున్నారు. ఇందులోనూ ఏడుగురికి మాత్రమే డబ్బు వచ్చే పని దొరుకుతోందన్నమాట. మరి 2019లో మగవారి పరిస్థితి ఏమిటి? కోవిడ్‌కి ముందు, పనిచేసే వయసులోని భారతీయ పురుషుల్లో 73 శాతం మంది కార్మిక శక్తిలో పాల్గొనేవారని అంతర్జాతీయ కార్మిక సంస్థల లెక్కలు సూచిం చాయి. దిగువ, మధ్య ఆదాయ దేశాల్లోని 74 శాతంతో పోలిస్తే ఇది కాసింత తక్కువే. 2019 మధ్యలో పురుషుల కార్మిక శక్తి భాగస్వామ్య రేటు గురించిన సీఎంఐఈ డేటా ప్రకారం కూడా ఇది 72 నుంచి 73 శాతం మధ్య ఉంటోంది. ఇది 2022 అక్టోబర్ నాటికి 66 శాతానికి పడిపోయింది. 2020 ఫిబ్రవరి నుంచి (కోవిడ్ లాక్డౌన్లకు ముందు) 2022 అక్టోబర్ మధ్యనాటికి భారత్‌లో పనిచేసే వయసులో ఉన్న పురుషుల జనాభా 4.6 కోట్లకు పెరిగింది. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు అదే స్థాయిలో ఉండివుంటే, మరో 3.3 కోట్లమంది పురుషులు కొత్తగా పని కోసం వెదుకుతూ ఉండాలి. కానీ ఈ సంఖ్య 13 లక్షలకు మాత్రమే పెరిగింది. ఫలితంగా 3.2 కోట్లమంది పనేచేసే వయసులోని పురు షులు కార్మిక శక్తి నుంచి వైదొలిగారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరణ ఏదంటే, భారతదేశంలోని పేదలకు అందుబాటులో ఉన్న ఉద్యోగాల తీరు చూస్తే వారు శారీరకంగా పనిచేయగల స్థితిలో లేరు. దేశంలోని అన్ని ఉద్యోగాల్లో నాలుగింట మూడొంతులు వ్యవసాయం, నిర్మాణరంగ, వాణిజ్య రంగాలే కల్పిస్తున్నాయి. ఈ మూడు రంగాలూ పెద్దగా డబ్బులు చెల్లిం చడం లేదు. వీటిలో రెండు రంగాలైతే కార్మికుల వెన్ను విరిచే స్తున్నాయి. ఎనిమిది గంటలు పనిచేసే రైతు 4,500 కేలరీలను నష్ట పోతుంటారనీ, అదే సమయం పనిచేసే నిర్మాణ కార్మికుడు 4,000 కేలరీలను కోల్పోతుంటాడనీ యూరప్ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక భారత్‌లో నిర్మాణ రంగం మరింత తీవ్ర శ్రమతో కూడుకున్నది కాబట్టి దీనికి మరింత శక్తి అవసరం. దాదాపు 16 శాతం భారతీయులు పోషకాహార లేమితో ఉన్నారని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) అంచనా. అంటే పని చేయగలిగే జనాభాలోని పేద ప్రజల్లో అధిక భాగం కఠిన శ్రమ చేయడానికి అవస రమైన కేలరీలలో సగం కూడా పొందలేదని దీని అర్థం. వారు రేషన్లు, ప్రభుత్వం అందించే ఉచితాలు, తమ గ్రామ కమ్యూనిటీ అందించే మద్దతుతో మనగలుగుతున్నారు. ఇదొక విష వలయం. ప్రభుత్వ రేషన్లు నిశ్చల జీవితానికి మద్దతు ఇచ్చేంతగా మాత్రమే పనికొస్తాయి. పేదలు తమ ప్రస్తుత పోషకాహార స్థాయికి తగిన పనులు పొందలేరు. కాబట్టి వారికి మరొక దారి లేదు. అందుకే మన మీడియా వర్ణిస్తున్న ‘ఉచితాలపై’ శాశ్వతంగా ఆధారపడుతున్నారు. మనం స్వాతంత్య్రం పొందినప్పుడు భారత్ ఊహించిన పంథాకు ఇది పూర్తిగా తిరోగమన దిశలో ఉంది. కఠిన శ్రమ నుంచి పరిశ్ర మల్లోని యాంత్రిక శ్రమ వైపు కార్మికులను తరలించడానికి బదులుగా ఈరోజు అత్యంత కఠినమైన పనితో కూడిన ఉపాధి అవకాశాలు మాత్రమే దొరుకుతున్నాయి. దీన్నుంచి బయటపడటానికి ఏకైక మార్గం ఏదంటే– ప్రభుత్వం తక్షణ లాభాలను త్యాగం చేసి అధిక ఉద్యోగావకాశాలు, మెరుగైన పని పరిస్థితులు, ఉపాధిని కల్పించే యాంత్రీకరణ వైపు మరలడమే. ఇది జరగనంతవరకూ భారత్ తన ప్రజల్లో మెజారిటీకి కేవలం జీవనాధార ఆర్థిక వ్యవస్థగా మాత్రమే ఉండిపోతుంది. అనింద్యో చక్రవర్తి, వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే.. మహిళలపైనే అధికం!
ఐక్యరాజ్యసమితి: పని ప్రదేశాల్లో దిగువస్థాయి సిబ్బందికిపై హింస, వేధింపులు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా మారాయని ఓ సర్వేలో తేలింది. యువత, వలసదారులు, రోజువారీ వేతన జీవులు, ముఖ్యంగా మహిళలే ఇందుకు బాధితులుగా మారుతున్నారని వెల్లడైంది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి చేపట్టిన మొట్టమొదటి సర్వే ఇది. ఐరాస అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో), లాయిడ్స్ రిజిస్టర్ ఫౌండేషన్, గాల్లప్ సంస్థ కలిసి గత ఏడాది చేపట్టిన ఈ సర్వే ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 121 దేశాల్లోని 75 వేల మంది సిబ్బందిపై సర్వే జరపగా 22% మందికి పైగా ఏదో ఒక రకమైన వేధింపులు, హింసకు గురవుతున్నట్లు తెలిపారని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు పని ప్రదేశంలో ఏదో ఒకవిధమైన వేధింపులకు గురవుతున్నట్లు తెలపగా, 6.3% మంది భౌతిక, మానసిక, లైంగిక హింసను, వేధింపుల బారినపడ్డారు. 17.9% మంది మాత్రం ఉద్యోగం చేసుకునే చోట ఏదో ఒక రూపంలో వేధింపులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఉపాధి పొందే చోట భౌతికంగా హింస, వేధింపులను ఎదుర్కొంటున్నట్లు 8.5% మంది పేర్కొనగా వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. ‘పని ప్రదేశాల్లో వేధింపులు ప్రమాదకరమైన అంశం. దీనివల్ల వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ఆదాయ నష్టం వాటిల్లి, వారి కెరీర్ దెబ్బతింటోంది’అని సర్వే అభిప్రాయపడింది. ప్రభావవంతమైన చట్టాలు, విధానాలను రూపొందించి ఈ సమస్యను పరిష్కరించవచ్చునని పేర్కొంది. ఇదీ చదవండి: ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష -
4 నెలల్లో 11.2 కోట్ల ఉద్యోగాలు ఊడాయ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల పునరుద్ధరణకు వివిధ రకాలైన ప్రపంచ సంక్షోభాలు పెనుముప్పుగా మారాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘వరల్డ్ ఆఫ్ వర్క్ ’’ అనే అంశంపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో ప్రపంచ దేశాల్లో పని గంటలు కరోనా సంక్షోభానికి ముందుతో (2019 నాలుగో క్వార్టర్) పోల్చి చూస్తే 3.8శాతం తక్కువగా నమోదయ్యాయని పేర్కొంది. దీనిని బట్టి చూస్తే 11.2 కోట్ల మధ్య ఉద్యోగాలు కోల్పోయి ఉండవచ్చునని అంచనా వేసింది. పని గంటల్లో జెండర్ గ్యాప్ పని గంటల్లో స్త్రీ, పురుష అంతరాలు బాగా పెరిగిపోతున్నాయని అభివృద్ధి చెందిన దేశాల కంటే అల్పాదాయ దేశాల్లో ఈ అంతరాలు ఎక్కువగా ఉన్నాయని ఐఎల్ఒ నివేదిక వెల్లడించింది. భారత్‌లో మహిళలు చేసే పనిగంటలు బాగా తగ్గిపోయాయని పేర్కొంది. కరోనా సంక్షోభానికి ముందు పని చేసే ప్రతి 100 మంది మహిళల్లో సగటున 12.3 మంది మహిళలు కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయారు. అదే విధంగా ప్రతీ 100 మంది పురుషుల్లో 7.5 మందికి ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ కార్మిక సంస్థకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. దీనిని బట్టే భారత్‌లో స్త్రీ, పురుష అంతరాలు ఎంతలా ఉన్నాయో తెలుస్తోందని ఆ అధికారి వివరించారు. ధనిక దేశాల్లో గతంతో పోల్చి చూస్తే పని గంటలు పెరిగితే అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో తగ్గిపోతున్నాయంటూ ఐఎల్ఓ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో స్త్రీ, పురుషుల మద్య అంతరాలు తొలగిపోవడానికి మరో 30 ఏళ్లు పడుతుందని ఐఎల్ఒ తెలిపింది. ఇక భారత్‌లో మహిళలకు గౌరవప్రదమైన ఉద్యోగాలు, సరైన జీతాలు లేకపోవడంతో ఈ అంతరాలు పెరిగిపోతున్నాయని దేశంలోని ట్రేడ్ యూనియన్లు విశ్లేషించాయి. ఉద్యోగాల కల్పనకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మహిళలకు సామాజిక భద్రత లేకపోవడం వల్ల కూడా ఈ అంతరాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నాయి. పని గంటలు తగ్గిపోవడానికి కారణాలివే..! పని గంటలు తగ్గిపోవడానికి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఎన్నో కారణాలను ఈ నివేదిక ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం, ముఖ్య ంగా చమురు, ఆహార ధాన్యాల ధరల పెరుగు దల, ఆర్థికసంక్షోభాలు, రుణ భారం, అంతర్జా తీయ సప్లయ్ చైన్‌లో అవరోధాలు, ఉక్రెయిన్‌పై రష్యా దాడుల ప్రభావం వంటివెన్నో పని గంటల్లో తగ్గించేశాయని ఐఎల్ఓ నివేదిక స్పష్టం చేసింది. చైనాలో ఈ ఏడాది కరోనా విజృంభణతో విధించిన లాక్డౌన్ల కారణంగానే 86% పని గంటల్లో ప్రభావం కనిపించిందని ఆ నివేదిక వెల్లడించింది. -
పలకాబలపం వదిలి.. పలుగూపారా..
జెనీవా: కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు విలవిల్లాడుతు న్నారు. కడుపు నింపుకునే మార్గం లేక పలక బలపం బదులుగా పలుగు పార చేతపడుతున్నారు. ఫ్యాక్టరీల్లో చేరుతూ బాల కార్మికులుగా మారుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య చాలా తగ్గుముఖం పట్టింది. కానీ కోవిడ్ మహమ్మారి,లాక్డౌన్ కారణంగా వారి సంఖ్య పెరిగిపోతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో), ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ అధ్యయనంలో తేలింది. కోవిడ్ కారణంగా ఈ ఒక్క ఏడాదే ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకి పడిపోయారు. దీంతో ఆ కుటుంబాలన్నీ తమ పిల్లల్ని బలవంతంగా పనుల్లో పెడుతున్నారు. ఐఎల్వో ప్రకారం పేదరికం ఒక్క శాతం పెరిగితే, బాలకార్మికులు 0.7% పెరుగుతారు. భారత్‌లో 20% డ్రాపవుట్లు కరోనా వైరస్ బట్టబయలు కాక ముందే భారత్‌లో 5.6 కోట్ల మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారు. వారిలో 1.1 కోట్ల మంది వరకు వ్యవసాయ క్షేత్రంలోనూ, ఫ్యాక్టరీల్లోనూ పనిచేస్తున్నారు. ఇక కరోనా వైరస్ సోకిన తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైందని మొదటిసారి బడిలోకి చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గి పోతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన బాలల హక్కుల కార్యకర్త రమ్య సుబ్రమణియన్ వెల్లడించారు. ఇళ్లల్లోనే ఉంటూ అగ్గిపెట్టెల తయారీ, ఇళ్లల్లో పనికి కుదురుతూ ఉండడంతో కరోనా సంక్షోభ సమయంలో కొత్తగా ఎందరు స్కూలు డ్రాపవుట్లు ఉన్నారో కచ్చితమైన సంఖ్య చెప్పడం కష్టమని ఆమె చెప్పారు. ప్రతీ అయిదుగురిలో ఒక విద్యార్థి స్కూలు నుంచి డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది. పూర్తి స్థాయిలో మార్కెట్ పుంజుకొని నిర్మాణ రంగం, రైల్వేలు ఇతర ఫ్యాక్టరీలు తెరుచుకుంటే భారత్‌లో దాదాపుగా 20% డ్రాపవుట్లు పెరుగుతాయని ఆ అధ్యయనం వెల్లడించింది. -
2.5 కోట్ల ఉద్యోగాలకు కోత
జెనీవా: కరోనా వైరస్‌ను తక్షణమే నియంత్రించలేకపోతే ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) హెచ్చరించింది. 1930 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరోసారి తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఐఎల్ఒ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రభావంతో ప్రభుత్వాలు, బ్యాంకులు సంస్కరణలు చేపట్టడానికి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటాయని ఆ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ విస్తరించకుండా వివిధ దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. సగం మందికి పైగా ఇల్లు కదిలి బయటకు రావడం లేదు. దీంతో ఉత్పాదకత పడిపోయింది. ఈ పరిణామంతో వివిధ దేశాలు సంస్థలను నడపలేక ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. అమెరికా, యూరప్‌లలో నిరుద్యోగం రేటు రెండు అంకెలు దాటేసిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ కార్మిక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ► అమెరికా గత దశాబ్దకాలంలో కనీవినీ ఎరుగని నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. కరోనా విజృంభణ తర్వాత 7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆర్థిక నిపుణులు అంచనా వేసిన దాని కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువ. ► యూరప్‌లో గత రెండు వారాల్లోనే 10 లక్షల మంది తమకు బతుకు గడవడమే కష్టంగా ఉందని, తమ సంక్షేమం కూడా చూడాలంటూ బ్రిటన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. బ్రిటన్‌లో ఉన్న పెద్ద, చిన్న కంపెనీలన్నీ గత వారం రోజుల్లోనే 27% సిబ్బందిని తగ్గించారు. ► స్పెయిన్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా 14% నిరుద్యోగ రేటు నమోదైంది. ► రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆస్ట్రియాలో తొలిసారిగా నిరుద్యోగం 12 శాతానికి ఎగబాకింది. ► జర్మనీలో గంట పనికి వేతనం ఇచ్చే విధానం అమల్లో ఉంది. దీంతో కంపెనీలు ఉద్యోగుల పని గంటల్ని రికార్డు స్థాయిలో తగ్గించాయి. దేశంలో ఇంచుమించుగా 4,70,000 కంపెనీలు జర్మనీ ప్రభుత్వానికి వేతన మద్దతు కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి. ► ఫ్రాన్స్‌లో కూడా వివిధ వ్యాపార కంపెనీలు జీతం చెల్లించలేక ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నాయి. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికుల్లో 20% మందికి జీతాలు చెల్లించే పరిస్థితి లేదని ప్రభుత్వమే సాయపడాలని కోరాయి ► థాయ్‌లాండ్‌లో 2.3 కోట్ల మంది (దాదాపుగా మూడో వంతు జనాభా) ప్రభుత్వం ఇచ్చే నగదు సాయానికి దరఖాస్తులు చేసుకున్నారు. ► చైనాలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నప్పటికీ రెండు నెలలు కరోనా సృష్టించిన కల్లోలంతో దాదాపుగా 80 లక్షల మంది ఉపాధి కోల్పోయారని అంచనా. -
50 కోట్లకు చేరువలో నిరుద్యోగులు
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా 47 కోట్ల మంది నిరుద్యోగులు, చిరుద్యోగులున్నారని, అర్హులకు సరైన ఉద్యోగం కల్పించకపోతే అది సామాజిక అశాంతికి దారితీస్తుందని ఐక్యరాజ్యసమితి విధాన నిర్ణేతలను హెచ్చరించింది. గత దశాబ్ధంతో పోలిస్తే ప్రపంచ నిరుద్యోగ రేటు నిలకడగానే సాగుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నివేదిక పేర్కొంది. నిరుద్యోగరేటు 5.4 శాతం కొనసాగుతున్నా ఆర్థిక మందగమంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల సంఖ్య మాత్రం కుదించుకుపోతోందని ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక 2019లో 18.8 కోట్ల మంది నిరుద్యోగులుగా నమోదు చేయించుకోగా, ఈ ఏడాది వారి సంఖ్య 19.5 కోట్లకు ఎగబాకుతుందని ఐఎల్ఓ తన వార్షిక ప్రపంచ ఉపాధి..సామాజిక దృక్కోణం పేరిట విడుదలైన నివేదికలో పేర్కొంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 28.5 కోట్ల మందికి అన్ని అర్హతలున్నా అరకొర వేతనాలతో చిరుద్యోగులగానే బతుకుతున్నారని తెలిపింది. ప్రపంచ కార్మిక శక్తిలో దాదాపు 50 కోట్ల మందికి సరైన వేతనాలు అందడం లేదని ఐఎల్ఓ చీఫ్ గై రైడర్ పేర్కొన్నారు. 2009 నుంచి 2019 మధ్య అంతర్జాతీయ స్ధాయిలో సమ్మెలు, ప్రదర్శనలు పెరిగాయని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో 60 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని వీరంతా చాలీచాలని జీతాలతో కనీస సాంఘిక రక్షణలు లేకుండా పనిలో నెట్టుకొస్తున్నారని ఐఎల్ఓ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. చదవండి : మానవాభివృద్ధి సూచీలో భారత్ @ 129 -
అత్యధిక వేతనాలు పొందింది వారే!
న్యూఢిల్లీ : మీ అమ్మాయి ఏం ఉద్యోగం చేస్తుంది, మీ అబ్బాయి ఏం పనిచేస్తున్నాడు. జీతం ఎంత ఇస్తున్నారేంటి? ఇలా చుట్టుపక్కల వారి ప్రశ్నలు అన్నీఇన్నీ కావు. ఎంత సంపాదిస్తున్నావేంటి? అనుకుంటూ పక్కింటి వాళ్లు, ఎదురింటోళ్లు వేసే ప్రశ్నలు చాలా మందికి పెద్ద తలనొప్పి. అయితే భారత్‌లో కొన్ని వృత్తులు చేపట్టేవారికి మాత్రమే వేతనాలు అత్యధికంగా ఉన్నాయంట. అవి ఎవరికో తెలుసా? చట్ట సభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్లు. వీరికి మాత్రమే సగటు రోజూ వారీ చెల్లించే వేతనాలు 1993-94 నుంచి 2011-12 వరకు రెండింతలు అయ్యాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) ఇండియా వేతన రిపోర్టు పేర్కొంది. అన్ని కేటగిరీల వృద్ధిలో చట్ట సభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్లు మాత్రమే తమ వేతనాలను 98 శాతం పెంచుకున్నారని తెలిపింది. అదేవిధంగా నిపుణుల వేతనాలు 90 శాతం పెరిగినట్టు రిపోర్టు పేర్కొంది. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ డేటాను పరిశీలించిన తర్వాత, ఐఎల్ఓ ఈ రిపోర్టును విడుదల చేసింది. మరోవైపు స్పెక్ట్రమ్, ప్లాంట్, మిషన్ ఆపరేటర్లు మాత్రమే గత రెండు దశాబ్దాలుగా అత్యంత తక్కువ వేతనాలను పొందుతున్నారని రిపోర్టు వెల్లడించింది. వీరి వేతనాలు కేవలం 44 శాతం మాత్రమే పెరిగాయని తెలిపింది. మొత్తంగా వేతనాల పెంపు గత 18 ఏళ్లలో సగటున 93 శాతం ఉందని తెలిపింది. అత్యధికంగా వేతనం చెల్లించే ఉద్యోగానికి, తక్కువ వేతనం చెల్లించే ఉద్యోగానికి తేడాను కూడా రిపోర్టు వివరించింది. 1993-94లో వీటి మధ్య తేడా 7.2 శాతముంటే, 2004-05లో 10.7 శాతానికి పెరిగిందని, అయితే 2011-12లో అది 7.6 శాతానికి తగ్గినట్టు పేర్కొంది. తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగుల రోజువారీ వేతనాలు 2004-05 నుంచి 2011-12 మధ్యలో 3.7 శాతం పెరిగినట్టు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో వేతనాలు స్థిరంగా కొనసాగుతున్నాయని చెప్పింది. పే కమిషన్ కేవలం ప్రభుత్వ రంగ రంగాల్లో వేతనాల పెంపును మాత్రమే కాక, ప్రైవేట్ రంగపు వేతనాలపై కూడా ప్రభావం చూపినట్టు రిపోర్టు నివేదించింది. -
భారత్‌లో నిరుద్యోగం పెరగొచ్చు..!
ఐఎల్ఓ నివేదిక జెనీవా: భారత్‌లో 2017–18 మధ్యకాలంలో నిరుద్యోగం స్వల్పంగా పెరగొచ్చనే అంచనాలు వెలువడ్డాయి. ఉపాధి కల్పనలో స్తబ్దత నెలకొనవచ్చని యూఎన్ లేబర్ రిపోర్ట్ పేర్కొంటోంది. ‘మేం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాం. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, కొత్తవారికి నాణ్యమైన ఉపాధి కల్పన, సామాజిక సమానత్వం వంటి సవాళ్లు ఉన్నాయి’ అని ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గుయ్ రైడర్ తెలిపారు. గతేడాది చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభాలు ఈ ఏడాదిలో శ్రామిక మార్కెట్లను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. అలాగే వర్ధమాన దేశాల్లో దిగజారుతోన్న శ్రామిక మార్కెట్ పరిస్థితులు కూడా ఈ ఏడాది నిరుద్యోగ రేటు పెరుగుదలకు కారణంగా నిలుస్తాయని తెలిపారు. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) తాజాగా 2017 వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషియల్ ఔట్లుక్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. ⇔ ఆర్థిక వృద్ధి ధోరణులు ఉద్యోగ కల్పనకు అనువుగా లేవు. ఈ ఏడాది నిరుద్యోగం పెరగొచ్చు. సామాజిక అసమానతలు కొనసాగే అవకాశముంది. ⇔ భారత్‌లో 2017, 2018లో ఉపాధి కల్పన పుంజుకోకపోవచ్చు. నిరుద్యోగులు ఈ ఏడాది 1.77 కోట్ల నుంచి 1.78 కోట్లకు, వచ్చే ఏడాది 1.8 కోట్లకు పెరగొచ్చని అంచనా. శాతాల వారీగా చూస్తే.. 2017–18లో నిరుద్యోగ రేటు 3.4 శాతంగా కొనసాగుతుంది. ⇔ గతేడాది దేశంలో ఉపాధి కల్పన ఒక మాదిరిగా ఉంది. దక్షిణాసియా ప్రాంతంలో జరిగిన మొత్తం ఉపాధి సృష్టిలో (1.34 కోట్ల ఉద్యోగాలు) అధిక భాగం భారత్‌దే. ⇔ కార్మిక సిబ్బంది పెరుగుదలతో స్వల్పకాలంలో అంతర్జాతీయ నిరుద్యోగ స్థాయిలు కూడా అధికంగా ఉండొచ్చు. అంతర్జాతీయ నిరుద్యోగ రేటు 2017లో 5.8%కి పెరగొచ్చని అంచనా. ఇది గతేడాది 5.7 శాతంగా ఉంది. ⇔ 2017లో వర్ధమాన దేశాల్లో నిరుద్యోగం పెరిగితే (5.6% నుంచి 5.7%కి), అభివృద్ధి చెందిన దేశాల్లో తగ్గుతుందని (6.3% నుంచి 6.2%కి) అంచనాలున్నాయి.