న్యూఢిల్లీ : మీ అమ్మాయి ఏం ఉద్యోగం చేస్తుంది, మీ అబ్బాయి ఏం పనిచేస్తున్నాడు. జీతం ఎంత ఇస్తున్నారేంటి? ఇలా చుట్టుపక్కల వారి ప్రశ్నలు అన్నీఇన్నీ కావు. ఎంత సంపాదిస్తున్నావేంటి? అనుకుంటూ పక్కింటి వాళ్లు, ఎదురింటోళ్లు వేసే ప్రశ్నలు చాలా మందికి పెద్ద తలనొప్పి. అయితే భారత్‌లో కొన్ని వృత్తులు చేపట్టేవారికి మాత్రమే వేతనాలు అత్యధికంగా ఉన్నాయంట. అవి ఎవరికో తెలుసా? చట్ట సభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్లు. వీరికి మాత్రమే సగటు రోజూ వారీ చెల్లించే వేతనాలు 1993-94 నుంచి 2011-12 వరకు రెండింతలు అయ్యాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) ఇండియా వేతన రిపోర్టు పేర్కొంది. అన్ని కేటగిరీల వృద్ధిలో చట్ట సభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్లు మాత్రమే తమ వేతనాలను 98 శాతం పెంచుకున్నారని తెలిపింది. అదేవిధంగా నిపుణుల వేతనాలు 90 శాతం పెరిగినట్టు రిపోర్టు పేర్కొంది. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ డేటాను పరిశీలించిన తర్వాత, ఐఎల్‌ఓ ఈ రిపోర్టును విడుదల చేసింది.
మరోవైపు స్పెక్ట్రమ్, ప్లాంట్, మిషన్ ఆపరేటర్లు మాత్రమే గత రెండు దశాబ్దాలుగా అత్యంత తక్కువ వేతనాలను పొందుతున్నారని రిపోర్టు వెల్లడించింది. వీరి వేతనాలు కేవలం 44 శాతం మాత్రమే పెరిగాయని తెలిపింది. మొత్తంగా వేతనాల పెంపు గత 18 ఏళ్లలో సగటున 93 శాతం ఉందని తెలిపింది. అత్యధికంగా వేతనం చెల్లించే ఉద్యోగానికి, తక్కువ వేతనం చెల్లించే ఉద్యోగానికి తేడాను కూడా రిపోర్టు వివరించింది. 1993-94లో వీటి మధ్య తేడా 7.2 శాతముంటే, 2004-05లో 10.7 శాతానికి పెరిగిందని, అయితే 2011-12లో అది 7.6 శాతానికి తగ్గినట్టు పేర్కొంది. తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగుల రోజువారీ వేతనాలు 2004-05 నుంచి 2011-12 మధ్యలో 3.7 శాతం పెరిగినట్టు వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో వేతనాలు స్థిరంగా కొనసాగుతున్నాయని చెప్పింది. పే కమిషన్ కేవలం ప్రభుత్వ రంగ రంగాల్లో వేతనాల పెంపును మాత్రమే కాక, ప్రైవేట్ రంగపు వేతనాలపై కూడా ప్రభావం చూపినట్టు రిపోర్టు నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment