‘అణ్వస్త్ర రహిత’ తీర్మానానికి భారత్ నో | UN vote urges Israel to renounce nuclear arms | Sakshi
Sakshi News home page

‘అణ్వస్త్ర రహిత’ తీర్మానానికి భారత్ నో

Published Thu, Dec 4 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

‘అణ్వస్త్ర రహిత’ తీర్మానానికి భారత్ నో

‘అణ్వస్త్ర రహిత’ తీర్మానానికి భారత్ నో

ఐక్యరాజ్యసమితి: ఏవిధమైన నిబంధనలూ లేకుండా అణ్వస్త్ర రహిత దేశంగా ఉండటానికి వెంటనే అంగీకరించడంపై ఐక్యరాజ్యసమితి సాధారణసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ మేరకు ఐరాసలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి వ్యతిరేకంగా భారత్‌తో పాటు పాకిస్తాన్, అమెరికా తదితర దేశాలు ఓటు వేశాయి. తమ అణు సదుపాయాలను ఐఏఈఏ భద్రతా ప్రమాణాలకు లోబడి ఉంచడాన్ని కూడా వ్యతిరేకించాయి. అణ్వస్త్ర నిరాయుధీకరణను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా మంగళవారం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని 169 దేశాలు వ్యతిరేకించగా, 7 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. చైనా, భూటాన్‌తో పాటు ఐదు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
 
 ఈ ముసాయిదా తీర్మానంలోని పలు అంశాలకు విడివిడిగా ఓటింగ్ నిర్వహించారు. 9వ పేరాలోని అణ్వస్త్ర నిరాయుధీకరణలో భాగంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని, అలాగే ఐఏఈఏకు లోబడి ఉండటాన్ని అంగీకరించాల్సిందిగా భారత్, ఇజ్రాయెల్, పాకిస్తాన్ దేశాలకు విజ్ఞప్తి చేసే తీర్మానానికి వ్యతిరేకంగా రికార్డు సంఖ్యలో 165 ఓట్లు వచ్చాయి. 2015 నాటికి విజయవంతంగా నిర్వహించాల్సిన ఎన్‌పీటీ సమీక్ష సదస్సుకు సంబంధించి పీఠికలోని 24వ పేరాను కూడా భారత్, ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేకించాయి. అయితే దీనికి 166 ఓట్లు అనుకూలంగా రావడంతో ఈ నిబంధన కొనసాగనుంది. ప్రాంతీయ, ఉపప్రాంతీయ స్థాయిలో సంప్రదాయ ఆయుధ నియంత్రణ నిబంధనపై భారత్ ఒక్కటి మాత్రమే వ్యతిరేకంగా ఓటేసింది. ఇక ఎన్‌పీటీ విశ్వజనీనతపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అణ్వస్త్ర రహిత దేశంగా ఎన్‌పీటీలో చేరడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. కాగా, భారత్‌తో వివాదాస్పద అణు జవాబుదారీ అంశాన్ని పరిష్కరించుకుంటామని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement