ఐక్యరాజ్య సమితి: అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో 1.4 కోట్ల మందికి తినడానికి తిండి కూడా దొరకదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇప్పటికే కరోనా వైరస్‌తో కుదేలైపోయిన ఆ దేశంలో తాజాగా నెలకొన్న సంక్షోభంతో ప్రజలపై తీవ్రమైన ఆర్థిక, సామాజిక ప్రభావం కనిపిస్తుందని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్స్‌కి చెందిన అఫ్గాన్ డైరెక్టర్ మేరి ఎలన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 40 శాతానికి పైగా పంటలు సరిగా పండలేదని, నిల్వ ఉన్న ఆహార ధాన్యాలు నాశనమయ్యాయని తెలిపారు.
తాలిబన్ల రాకతో వేలాది మంది నిరాశ్రయులు అవుతున్నారని వారికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నా కటకటగానే ఉందన్నారు. యూఎన్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆమె మే నెలలో 40 లక్షల మంది ఆకలిని తీర్చామని, వచ్చే కొద్ది నెలల్లో 90 లక్షల మంది కడుపు నింపాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునైనా ఈ ఆకలి సంక్షోభాన్ని నివారించాలంటే, 20 కోట్ల అమెరికా డాలర్లు తక్షణావసరమని మేరి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment