
మోసుల్‌లో 900 మంది ఉగ్రవాదుల హతం
అర్బిల్(ఇరాక్): మోసుల్ నగరం స్వాధీనం కోసం జరుగుతున్న పోరులో ఇంతవరకూ 900 మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారని ఐక్యరాజ్యసమితి గురువారం వెల్లడించింది. మరోవైపు ఇరాకీ దళాలు నగరం దక్షిణ, తూర్పు, ఉత్తర ప్రాంతం వైపు దూసుకుపోతున్నాయని పేర్కొంది. ఇరాకీ, కుర్దీష్ బలగాలకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు గగనతల దాడులతో సాయం చేస్తున్నాయని తెలిపింది.
మోసుల్‌లో 3,500 నుంచి 5 వేల మంది, సరిహద్దుల్లో మరో 2 వేల మంది ఐసిస్ ఉగ్రవాదులు ఉండవచ్చని గతంలో అమెరికా నిర్ధ్ధారించింది. వీరిలో దాదాపు 800 నుంచి 900 వరకూ మరణించారని అమెరికా సైనికాధికారి జోసెఫ్ వోటెల్ చెప్పారు. మరోవైపు నగరం నుంచి పారిపోయి వస్తోన్న వేలాది మందితో మోసుల్ సరిహద్దుల్లోని శిబిరాలు కిక్కిరిసిపోయాయి. అక్టోబర్ 17న మోసుల్ స్వాధీనం కోసం ప్రారంభమైనప్పటి నుంచీ ఇంతవరకూ 11,700 మంది పారిపోయి వచ్చారని ఇరాకీ మంత్రి వెల్లడించారు. ఇరాకీ దళాలు మోసుల్ సమీపిస్తోన్న కొద్ది తరలివస్తోన్న ప్రజల సంఖ్య పెరిగిందని చెప్పారు.