పాకిస్తాన్‌కు అమెరికా భారీ షాక్ | US Bans Pakistan International Airlines Flights Over Pilot Concerns | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు అమెరికా భారీ షాక్

Published Fri, Jul 10 2020 11:42 AM | Last Updated on Fri, Jul 10 2020 4:55 PM

US Bans Pakistan International Airlines Flights Over Pilot Concerns - Sakshi

వాషింగ్ట‌న్ : పాకిస్తాన్‌కు అమెరికా భారీ షాకిచ్చింది. ఆ దేశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలపై  నిషేదం విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. న‌కిలీ స‌ర్టిఫికెట్ల‌తో పాకిస్తానీ పైల‌ట్లు విమానాలు న‌డుపుతున్న కార‌ణంగా  ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అమెరికా ర‌వాణా శాఖ వెల్ల‌డించింది. ప్రయాణికుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో మే 22న పీఐఏ జెట్‌ విమానం కూలడంతో 97 మంది మరణించారు. అంతేకాకుండా పైల‌ట్ల అర్హ‌త‌ల‌పై ప‌లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో విచార‌ణ చేప‌ట్ట‌గా నకిలీ స‌ర్టిఫికేట్‌తో ఉద్యోగం సంపాదించార‌ని తేలింది. ఇప్ప‌టికే పాకిస్తాన్ పైల‌ట్ల విద్యార్హ‌త‌ల‌పై ఫెడ‌ర‌ల్ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో తాజాగా అమెరికా విధించిన నిషేధం ప్రాధాన్యం సంత‌రించుకుంది. (చైనాపై మరిన్ని ఆంక్షలు: అమెరికా)

పాకిస్తాన్‌ పైలట్లలో మూడో వంతు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించినట్లు నిర్ధార‌ణ అయ్యింది. ఇదే విష‌యాన్ని రాయిటర్స్  డిపార్ట్‌మెంట్  సైతం నివేదించింది. దీంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌పై ఆరునెల‌ల పాటు నిషేధం విధిస్తూ యూరోపియ‌న్ యూనియ‌న్ ఏవియేష‌న్ సేఫ్టీ ఏజెన్సీ ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక పాక్ ఎయిర్‌లైన్స్‌పై అమెరికా విధించిన నిషేధాన్ని పాక్ జియో న్యూస్ సైతం ధ్రువీకరించింది. ఇప్ప‌టికే పాక్‌ ప్ర‌భుత్వం దీనికి సంబంధించి దిద్దుబాటు చ‌ర్య‌లకు సిద్ధ‌మైంద‌ని పేర్కొంది. (కరోనా కన్నా ప్రమాదకరం.. జాగ్రత్త: చైనా)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement