Pakistan airline
-
నా డ్యూటీ ముగిసింది!..ఎమర్జెన్సీ ల్యాడింగ్ తర్వాత పైలెట్ ఝలక్
విమానాలను వాతావరణ పరిస్థితుల రీత్యా లేక సాంకేతిక లోపం కారణంగానో ఒక్కోసారి అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వారికి హోటల్ వసతి కూడా ఏర్పాటు చేయడమో లేక మరో విమానంలో పంపించడమో జరుగుతుంది. అయితే ఇక్కడోక పైలెట్ మాత్రం అత్యవసర ల్యాండిగ్ తర్వాత తన డ్యూటీ ముగిసిందంటూ ...విమానాన్ని కొనసాగించాడానికి నిరాకరించాడు. అసలు విషయంలోకెళ్తే...రియాద్ నుండి ఇస్లామాబాద్‌కు వెళ్లాల్సిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) ప్రతికూల వాతావరణం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత పైలెట్ తన షిఫ్ట్ అయిపోయిందని చెప్పి విమానాన్ని కొనసాగించడానికి నిరాకరించాడు. అంతే ప్రయాణికులు ఆగ్రహంతో నిరసనలు చేయడం ప్రారంభించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ మేరకు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు దమ్మామ్ విమానాశ్రయ భద్రతాధికారులను రంగంలోకి దిగింది. ఈ మేరకు చిక్కుకుపోయిన ప్రయాణీకులకు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌కు చేరేవరకు హోటల్లోనే వసతి కల్పించారు. అయితే విమాన భద్రత దృష్ట్యా పైలెట్ విశ్రాంతి తీసుకోవాలని, పైగా ప్రయాణికులందరూ ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకునేంతవరకు వారికి హోటళ్లలో అన్నిరకాల వసతులు ఏర్పాటు చేశాం అని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి మీడియాకి తెలిపారు. (చదవండి: ఆ వ్యక్తి 67 ఏళ్లుగా స్నానమే చేయలేదట!. అతని ఆహారం ఏమిటో తెలుసా?) -
తాలిబన్ల అతి.. అఫ్గనిస్తాన్‌కు పాక్ షాక్
ఆఫ్ఘనిస్తాన్ మిత్రరాజ్యంగా ఉన్న పాకిస్థాన్.. ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చింది. తాలిబన్ల అతిజోక్యంతో విసుగొచ్చి.. అఫ్గన్‌కు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ధరల్ని తగ్గించే ప్రసక్తే లేదని పేర్కొంటూ.. ఈ మేరకు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. దీంతో అఫ్గన్‌కు ప్రస్తుతం నడుస్తున్న ఏకైక విదేశీ విమాన సర్వీస్ కూడా నిలిచిపోయినట్లు అయ్యింది. కారణం.. తాలిబన్ల దురాక్రమణకు ముందు(ఆగస్టు 15 వరకు) కాబూల్-ఇస్లామాబాద్ మధ్య విమాన ఛార్జీ టికెట్ ధర 120-150 డాలర్ల మధ్య ఉండేది. కానీ ఇప్పుడది 2500 డాలర్లకు చేరుకుని మంటపుట్టిస్తోంది. ఈ తరుణంలో టికెట్ ధరల్ని తగ్గించాలని, లేదంటే విమాన సర్వీసులను నిలిపివేస్తామని తాలిబన్ ప్రభుత్వం పాక్‌ను హెచ్చరించింది. ఇందుకు కౌంటర్‌గానే పాక్ తన సర్వీసులు నిలిపివేసి తాలిబన్లకు ధీటుగా బదులిచ్చింది. తమ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నా.. తాలిబన్లను ఇంతకాలం ఓపికగా భరిస్తూ వస్తున్నామని చెబుతోంది పీఐఏ. అయితే ఇప్పుడు మునుపటి ధరలతో విమాన సర్వీసులు నడపాలన్నది తాలిబన్ల తాజా ఆదేశం. కానీ, బీమా సంస్థలు కాబూల్‌ను యుద్ధ ప్రాంతంగా పరిగణిస్తున్నందున బీమా ప్రీమియం ధరలు భారీగా పెరిగాయని, అందుకనే టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని పాక్ చెబుతోంది. ఇంతకాలం తాము మానవతా దృక్పత కోణంలోనే విమాన సర్వీసులు నడిపామని, కానీ, ఇక మీదట టికెట్ ధరలను తగ్గించలేమని పేర్కొంటూ అఫ్గనిస్తాన్‌కు విమాన సర్వీసులను రద్దు చేసింది పీఐఏ. చదవండి: పాక్ జిమ్మిక్కు.. తాలిబన్లకే టోకరా! -
పాకిస్తాన్‌కు భారీ షాక్..!
న్యూఢిల్లీ: తమ దేశంలో ఉన్న 860 మంది పైలట్లలో దాదాపు 262 మంది బోగస్ పైలట్లేనన్న ప్రకటన పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. లైసెన్స్ కుంభకోణం కారణంగా దాదాపు 188 దేశాల్లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) రాకపోకలపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏవో) ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిన పైలట్ లైసెన్సులు జారీ చేసిన నేపథ్యంలో సంస్థ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా పైలట్ శిక్షణ, లైసెన్సింగ్ జారీ ప్రక్రియ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు లేవంటూ ఐసీఏవో, నవంబరు 3న పాకిస్తాన్ ఏవియేషన్ అథారిటీకి లేఖ రాసింది. ఈ విషయం గురించి అనేకమార్లు హెచ్చరించినప్పటికీ పాక్ తీరు మారడం లేదని, కాబట్టి పాకిస్తాన్ విమానాలు, పైలట్లపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ విషయం గురించి పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్(పీఏఎల్‌పీఏ) అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ఇదే గనుక నిజమైతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. పాక్ పౌరవిమాన రంగం కుప్పకూలిపోతుంది. గత ఆర్నెళ్లుగా ఈ విషయం గురించి మేం అధికారుల దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నాం. కానీ వారు పట్టించుకోలేదు. నిర్లక్ష్య వైఖరి కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లైసెన్స్ స్కామ్ కారణంగా యూరోపియన్ యూనియన్ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ(ఈఏఎస్ఏ) ఇప్పటికే పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. పాక్ ఎయిర్‌లైన్స్ విమానాలను ఈయూ సభ్య దేశాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని పేర్కొంటూ జూలైలో నిషేధం విధించింది. ఇక ఇప్పుడు ఏకంగా 188 దేశాలకు వీటి రాకపోకలు నిషేధించేందుకు ఐసీఏవో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.(చదవండి: పాక్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: భారత్) కాగా పాకిస్తాన్‌లోని కరాచీలో ఈ ఏడాది మే 22న జనావాసాల్లో విమానం కుప్పకూలిన విషయం విదితమే. ఈ దుర్ఘటనలో 97 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ క్రమంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా దర్యాప్తు ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు.. ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను పార్లమెంటుకు సమర్పించిన పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్.. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, తప్పంతా పైలట్‌దేనంటూ ప్రకటన చేశారు. అదే విధంగా ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టిన పాక్ ప్రభుత్వం.. తమ దేశంలో సుమారు 262 మంది బోగస్ పైలట్లు ఉన్నారని తేల్చింది. వీరంతా వేరొకరితో పరీక్ష రాయించి విధుల్లో చేరినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో పీఐఏపై నిషేధం విధిస్తూ ఈఏఎస్ఏ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
పాకిస్తాన్‌కు అమెరికా భారీ షాక్
వాషింగ్టన్ : పాకిస్తాన్‌కు అమెరికా భారీ షాకిచ్చింది. ఆ దేశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ సర్టిఫికెట్లతో పాకిస్తానీ పైలట్లు విమానాలు నడుపుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రవాణా శాఖ వెల్లడించింది. ప్రయాణికుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో మే 22న పీఐఏ జెట్ విమానం కూలడంతో 97 మంది మరణించారు. అంతేకాకుండా పైలట్ల అర్హతలపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విచారణ చేపట్టగా నకిలీ సర్టిఫికేట్‌తో ఉద్యోగం సంపాదించారని తేలింది. ఇప్పటికే పాకిస్తాన్ పైలట్ల విద్యార్హతలపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) పలు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా అమెరికా విధించిన నిషేధం ప్రాధాన్యం సంతరించుకుంది. (చైనాపై మరిన్ని ఆంక్షలు: అమెరికా) పాకిస్తాన్ పైలట్లలో మూడో వంతు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించినట్లు నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని రాయిటర్స్ డిపార్ట్మెంట్ సైతం నివేదించింది. దీంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌పై ఆరునెలల పాటు నిషేధం విధిస్తూ యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక పాక్ ఎయిర్‌లైన్స్‌పై అమెరికా విధించిన నిషేధాన్ని పాక్ జియో న్యూస్ సైతం ధ్రువీకరించింది. ఇప్పటికే పాక్ ప్రభుత్వం దీనికి సంబంధించి దిద్దుబాటు చర్యలకు సిద్ధమైందని పేర్కొంది. (కరోనా కన్నా ప్రమాదకరం.. జాగ్రత్త: చైనా) -
పాక్ ఎయిర్‌లైన్స్‌కు ఈయూ షాక్!
పారిస్: యూరోపియన్ యూనియన్ ఎయిర్ సేఫ్టీ ఏజెన్సీ(ఈఏఎస్ఏ) పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చింది. ఆరు నెలల పాటు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) విమానాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈయూ సభ్య దేశాల్లో(27)కి పీఐఏ విమానాలను అనుమతించబోమని.. జూలై 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇక ఈ విషయంపై మంగళవారం స్పందించిన పీఐఏ.. ‘‘ఈయూ సభ్య దేశాల్లోకి ఆర్నెళ్ల పాటు పీఐఏ విమానాలకు అనుమతిని ఈఏఎస్ఏ నిషేధించింది. జూలై 1, 2020 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. పీఐఏ ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే ఈ నిషేధాన్ని ఎత్తివేస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొంది. (సరిహద్దులు తెరిచిన ఈయూ) కాగా పాకిస్తాన్‌లోని కరాచీలో మే 22న జనావాసాల్లో విమానం కుప్పకూలిన ఘటనలో 97 మంది దుర్మరణం పాలైన విషయం విదితమే. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా దర్యాప్తు ప్రారంభించిన ప్రభుత్వం.. ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను పార్లమెంటుకు సమర్పించిన పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్.. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, తప్పంతా పైలట్‌దేనని పేర్కొన్నారు. (ఆ భయం వల్లే విమానం కుప్పకూలింది!) ఇక ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం.. దేశంలో ఉన్న 860 మంది పైలట్లలో దాదాపు 262 మంది బోగస్ పైలట్లేనని తేల్చింది. వీరంతా వేరొకరితో పరీక్ష రాయించి విధుల్లో చేరినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈఏఎస్ఏ.. పీఐఏ విమానాలపై నిషేధం విధించడం గమనార్హం. కాగా ఈఏఎస్ఏ తాజా నిర్ణయంతో పాక్ ఎయిర్‌లైన్స్‌లో ఈయూ దేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న వారు తమ ప్రయాణాన్ని ఆర్నెళ్లపాటు వాయిదా వేసుకోవచ్చని.. లేని పక్షంలో టికెట్ డబ్బు రీఫండ్ చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉన్నట్లు స్థానిక మీడియా డాన్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. జూలై 1వ తేదీనుంచి 15 దేశాల సరిహద్దులను మళ్లీ తెరుస్తున్నట్లు ఈయూ ప్రకటించిన విషయం తెలిసిందే. (పాక్‌లో 30 శాతం బోగస్ పైలట్లు) EASA has suspended PIA's permission to operate to EU member states for 6 months w.e.f July 1, 2020: 0000Hrs UTC. PIA is in touch with EASA to allay their concerns and hopes that the suspension will be revoked with our CBMs soon. — PIA (@Official_PIA) June 30, 2020 -
ఔను నిజం! విమానం ఎగిరేముందు..!
ఇటీవల పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్-42 విమానం కూలిపోయి.. 47మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనతో పాక్ ఎయిర్‌లైన్స్ అధికారులు భయపడ్డారో.. లేక మూఢనమ్మకాన్ని నమ్మితే తప్పేముందని అనుకున్నారోగానీ, వారు చేసిన ఓ చర్య మాత్రం నెటిజన్లను విస్మయపరుస్తోంది. ఏటీఆర్-42 విమానం కూలిపోయిన అనంతరం ఇటీవల ఏటీఆర్ సిరీస్‌కు చెందిన విమానం తొలిసారి ప్రయాణిస్తున్న సందర్భంగా వారు ఓ వింత చర్యకు పాల్పడ్డారు. ఓ నల్లటి మేకను ఇస్లామాబాద్‌లోని విమానాశ్రయానికి తీసుకొచ్చి.. ఎగరడానికి సిద్ధంగా ఉన్న విమానం ముందు దానిని బలి ఇచ్చారు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన అధికారులు స్వయంగా ఈ తంతులో పాల్గొన్నారు. వారు మేకను విమానం ముందు పడుకోబెట్టి..పీక కోసి రక్తతర్పణం చేసిన తర్వాతే.. పైలట్లు విమానాన్ని నడిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వెలుగుచూడటం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. మూఢనమ్మకాల పేరిట సాక్షాత్తు అధికారులు, పైలట్లే ఒక మూగజీవాన్ని బలివ్వడం మూర్ఖత్వానికి నిలువుటద్దమని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. మూగజీవాల్ని బలివ్వడం వంటి చర్యలు మానుకొని విమాన ప్రయాణాల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని పాక్ ఎయిర్‌లైన్స్‌కు పలువురు సూచిస్తున్నారు. 'ఇది జోక్ కాదు. తన విమానాల రక్షణ కోసం పాకిస్థాన్ తీసుకొంటున్న సరికొత్త భద్రతాచర్యలివే' అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.