పాకిస్తాన్‌కు భారీ షాక్‌..! | Pakistan Airlines May Get Ban From 188 Countries On Licensing Issue | Sakshi
Sakshi News home page

188 దేశాలు: పాక్‌ ఎయిర్‌లైన్స్‌పై నిషేధం!

Published Mon, Nov 9 2020 5:51 PM | Last Updated on Mon, Nov 9 2020 7:52 PM

Pakistan Airlines May Get Ban From 188 Countries On Licensing Issue - Sakshi

పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం(కర్టెసీ: పీఐఏ)

న్యూఢిల్లీ: తమ దేశంలో ఉన్న 860 మంది పైలట్లలో దాదాపు 262 మంది బోగస్‌ పైలట్లేనన్న ప్రకటన పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. లైసెన్స్‌ కుంభకోణం కారణంగా దాదాపు 188 దేశాల్లో పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ) రాకపోకలపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌(ఐసీఏవో) ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిన పైలట్‌ లైసెన్సులు జారీ చేసిన నేపథ్యంలో సంస్థ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా పైలట్‌ శిక్షణ, లైసెన్సింగ్‌ జారీ ప్రక్రియ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు లేవంటూ ఐసీఏవో, నవంబరు 3న పాకిస్తాన్‌ ఏవియేషన్‌ అథారిటీకి లేఖ రాసింది. ఈ విషయం గురించి అనేకమార్లు హెచ్చరించినప్పటికీ పాక్‌ తీరు మారడం లేదని, కాబట్టి పాకిస్తాన్‌ విమానాలు, పైలట్లపై నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. 

ఈ విషయం గురించి పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్స్‌ అసోసియేషన్‌(పీఏఎల్‌పీఏ) అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘ఇదే గనుక నిజమైతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. పాక్‌ పౌరవిమాన రంగం కుప్పకూలిపోతుంది. గత ఆర్నెళ్లుగా ఈ విషయం గురించి మేం అధికారుల దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నాం. కానీ వారు పట్టించుకోలేదు. నిర్లక్ష్య వైఖరి కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ విషయంలో జోక్యం చేసుకుని, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లైసెన్స్‌ స్కామ్‌ కారణంగా యూరోపియన్‌ యూనియన్‌ ఎయిర్‌ సేఫ్టీ ఏజెన్సీ(ఈఏఎస్‌ఏ) ఇప్పటికే పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. పాక్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలను ఈయూ సభ్య దేశాల్లోకి అనుమతించే ప్రసక్తే లేదని పేర్కొంటూ జూలైలో నిషేధం విధించింది. ఇక ఇప్పుడు ఏకంగా 188 దేశాలకు వీటి రాకపోకలు నిషేధించేందుకు ఐసీఏవో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.(చదవండి: పాక్‌ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: భారత్‌)

కాగా పాకిస్తాన్‌లోని కరాచీలో ఈ ఏడాది మే 22న జనావాసాల్లో విమానం కుప్పకూలిన విషయం విదితమే. ఈ దుర్ఘటనలో 97 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ క్రమంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా దర్యాప్తు ప్రారంభించిన ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కారు.. ప్రమాదానికి పైలట్‌ నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను పార్లమెంటుకు సమర్పించిన పాక్‌ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్‌ ఖాన్‌.. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, తప్పంతా పైలట్‌దేనంటూ ప్రకటన చేశారు. అదే విధంగా ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టిన పాక్‌ ప్రభుత్వం.. తమ దేశంలో సుమారు 262 మంది బోగస్‌ పైలట్లు ఉన్నారని తేల్చింది. వీరంతా వేరొకరితో పరీక్ష రాయించి విధుల్లో చేరినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో పీఐఏపై నిషేధం విధిస్తూ ఈఏఎస్‌ఏ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement