పాక్‌ ఎయిర్‌లైన్స్‌కు ఈయూ షాక్‌! | EU Bans Pakistan International Airlines Flying to Europe For 6 Months | Sakshi
Sakshi News home page

పాక్‌ ఎయిర్‌లైన్స్‌పై ఈయూ నిషేధం!

Published Wed, Jul 1 2020 5:01 PM | Last Updated on Wed, Jul 1 2020 6:31 PM

EU Bans Pakistan International Airlines Flying to Europe For 6 Months - Sakshi

పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం(కర్టెసీ: పీఐఏ)

పారిస్‌: యూరోపియన్‌ యూనియన్‌ ఎయిర్‌ సేఫ్టీ ఏజెన్సీ(ఈఏఎస్‌ఏ) పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చింది. ఆరు నెలల పాటు పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ) విమానాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈయూ సభ్య దేశాల్లో(27)కి పీఐఏ విమానాలను అనుమతించబోమని.. జూలై 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇక ఈ విషయంపై మంగళవారం స్పందించిన పీఐఏ.. ‘‘ఈయూ సభ్య దేశాల్లోకి ఆర్నెళ్ల పాటు పీఐఏ విమానాలకు అనుమతిని ఈఏఎస్‌ఏ నిషేధించింది. జూలై 1, 2020 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. పీఐఏ ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతోంది. త్వరలోనే ఈ నిషేధాన్ని ఎత్తివేస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొంది. (సరిహద్దులు తెరిచిన ఈయూ)

కాగా పాకిస్తాన్‌లోని కరాచీలో మే 22న జనావాసాల్లో విమానం కుప్పకూలిన ఘటనలో 97 మంది దుర్మరణం పాలైన విషయం విదితమే. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా దర్యాప్తు ప్రారంభించిన ప్రభుత్వం.. ప్రమాదానికి పైలట్‌ నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను పార్లమెంటుకు సమర్పించిన పాక్‌ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వార్‌ ఖాన్‌.. విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, తప్పంతా పైలట్‌దేనని పేర్కొన్నారు. (ఆ భయం వల్లే విమానం కుప్పకూలింది!)

ఇక ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం.. దేశంలో ఉన్న 860 మంది పైలట్లలో దాదాపు 262 మంది బోగస్‌ పైలట్లేనని తేల్చింది. వీరంతా వేరొకరితో పరీక్ష రాయించి విధుల్లో చేరినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈఏఎస్‌ఏ.. పీఐఏ విమానాలపై నిషేధం విధించడం గమనార్హం. కాగా ఈఏఎస్‌ఏ తాజా నిర్ణయంతో పాక్‌ ఎయిర్‌లైన్స్‌లో ఈయూ దేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేసుకున్న వారు తమ ప్రయాణాన్ని ఆర్నెళ్లపాటు వాయిదా వేసుకోవచ్చని.. లేని పక్షంలో టికెట్‌ డబ్బు రీఫండ్‌ చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉన్నట్లు స్థానిక మీడియా డాన్‌ పేర్కొంది. ఇదిలా ఉండగా.. జూలై 1వ తేదీనుంచి 15 దేశాల సరిహద్దులను మళ్లీ తెరుస్తున్నట్లు ఈయూ ప్రకటించిన విషయం తెలిసిందే. (పాక్‌లో 30 శాతం బోగ‌స్‌ పైల‌ట్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement