రాజౌరీలో ప్రధాని మోదీతో షేక్‌హ్యాండ్ కోసం ఎగబడుతున్న సైనికులు
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిపై తక్షణ చర్యలు అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యులతో సోమవారం మోదీ మాట్లాడారు. ‘ఉగ్రవాదంపై పోరుకు సన్నిహిత అంతర్జాతీయ సహకారం కీలకం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, ప్రేరేపించడంతోపాటు దానిని ఒక దేశీయ విధానంగా మార్చుకున్న దేశాలపై తక్షణ చర్యలు అవసరం. దీనిని ఏమాత్రం ఉపేక్షించరాదు’అని పరోక్షంగా పాకిస్తాన్‌నుద్దేశించి పేర్కొన్నారు.
కశ్మీర్‌లో పర్యటించడం ద్వారా జమ్మూ, కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల సాంస్కృతిక, మతపరమైన వైవిధ్యంతోపాటు అక్కడ జరుగుతున్న అభివృద్ధి, పాలనపరమైన అంశాలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈయూతో సముచిత, సమతుల్య వాణిజ్య, పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకునేందుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందన్నారు. సులభతర వాణిజ్యం ర్యాంకింగ్స్‌లో 2014తో పోలిస్తే భారత్ ఎంతో మెరుగైందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..జమ్మూకశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదం ఫలితంగా ఉత్పన్నమైన పరిస్థితిని ఈయూ ప్రతినిధి బృందానికి వివరించారు. ఈయూ బృందం నేడు కశ్మీర్‌లో పర్యటించి, ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడిన పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకోనుంది.
పార్లమెంట్‌కు అవమానకరం: కాంగ్రెస్
కశ్మీర్‌లో పర్యటించకుండా, అక్కడి ప్రజలతో మాట్లాడకుండా దేశంలోని రాజకీయ పార్టీల నేతలను నిర్బంధించిన ప్రభుత్వం..ఈయూ బృందానికి అనుమతి ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర అవమానకరమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ప్రభుత్వ నిర్ణయం భారత ఎంపీల హక్కులకు భంగకరమని తెలిపారు. కశ్మీర్ అంతర్గత విషయమని చెప్పే ప్రభుత్వం ఈయూకు స్వాగతం పలికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు.
జవాన్లతో మోదీ దీపావళి
జమ్మూ: దీపావళి వేడుకలను ప్రధాని మోదీ ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని దేశ సరిహద్దుల సమీపంలో జవాన్లతో కలిసి జరుపుకున్నారు. ఆదివారం ఉదయం ఎల్‌వోసీకి సమీపంలోని రాజౌరి ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన అక్కడున్న వెయ్యిమంది సైనికులకు పండగ శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లు పంచారు. సైనికుల మాదిరిగా ఆర్మీ జాకెట్ ధరించిన ఆయన జవాన్లతో రెండు గంటలపాటు గడిపారని అధికారులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎంతో కఠిన తరమైన నిర్ణయాలను సైతం ధైర్యసాహసాలతోనే అమలు చేయగలిగామని ఈ సందర్భంగా అన్నారు. దీపావళి పండగను కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారని, అందుకే, తన కుటుంబంలాంటి జవాన్లతో గడిపేందుకే ఇక్కడి వచ్చానన్నారు. అమర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని వెంట ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ ఉన్నారు. 2014లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి మోదీ ఏటా సరిహద్దుల్లో జవాన్లతో గడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment