
పెన్సిల్వేనియా : మన బ్యాంకు అకౌంట్లో ఓ కోటి రూపాయలు జమ అయినట్లు మొబైల్‌కు మెసేజ్ వస్తే ఏం చేస్తాం. కలా ...నిజామా అనుకుంటూ.. ఒకటికి పదిసార్లు అనుకుంటాం. ఒకవేళ అకౌంట్లో ఉన్న ఆ డబ్బులను ఖర్చు చేస్తే తర్వాత ఏం సమస్య వస్తుందో అని ఆలోచిస్తూ తేల్చుకోలేకపోతాం. లేదా బ్యాంకుకు పరిగెత్తి అసలు విషయం తెలుసుకుంటాం. అయితే అమెరికాలోని ఓ జంట మాత్రం తమ అకౌంట్‌లో పడిన డబ్బు మొత్తాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టేసింది. తీరా బ్యాంకు అధికారులు జరిగిన పొరపాటనును గుర్తించి ఆ డబ్బులు తిరిగి ఇవ్వమంటే మాత్రం... అంతే నింపాదిగా ఏం చేసుకుంటారో చేసుకోండి అని చేతులు ఎత్తేసింది.
పెన్సిల్వేనియాకు చెందిన రాబర్ట్, టిఫనీ విలియమ్స్ అనే జంటకు ఓ ఫైన్ మార్నింగ్ బ్యాంకు ఖాతాలో లక్షా ఇరవైవేల డాలర్లు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో వారు ఎంచక్కా ఖర్చు చేయడం మొదలెట్టేశారు. విలాసవంతమైన జీవితం గడుపుతూ విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ అంత మొత్తాన్ని కేవలం 17 రోజుల్లోనే ఖర్చు చేసేశారు. తమ ‘సంపాదన’లో కొంత భాగాన్ని కష్టాలలో ఉన్న తమ మిత్రులకి కూడా ఇచ్చేశారు. అయితే బ్యాంకు అడిట్ సమయంలో భారీ మొత్తంలో డబ్బులు తేడా రావడంతో తీరిగ్గా మేల్కొన్న బ్యాంకు మిస్సైన అమౌంట్ కోసం విచారణ మొదలు పెట్టగా అసలు విషయం బయటపడింది.
ఆ డబ్బు తిరిగివ్వమని బ్యాంకు అధికారులు ప్రశ్నిస్తే అకౌంట్‌లో ఎంత ఉందో అంతే తీసుకోండి అని ఎదురు సమాధానం ఇచ్చారంట. సరే అకౌంట్‌లో ఏమన్నా ఉందా అంటే అప్పటికే మొత్తం ఉడ్చేసి ఖాళీగా ఉంచారంట. ఏం చేయాలో పాలుపోని బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో దిగి వచ్చిన జంట ఎలాగొలా చెల్లిస్తాం అని అప్పటికప్పుడు సర్దిచెప్పినా.. అంత మొత్తం చెల్లించే స్తోమత తమకు లేదని కోర్టుకు విన్నవించుకుంది. కోర్టు వారికి ఒక్కొక్కరికి 25000 డాలర్లు జరిమానా విధిస్తూ బెయిల్ మూంజూరు చేసింది. మరి బెయిల్ కోసమైనా ఏమైనా మిగుల్చుకున్నారో? లేదో? మరి.
Comments
Please login to add a commentAdd a comment