
ట్రంప్ ప్రభావం ఎలా ఉంటుంది?
స్వేచ్ఛా వాణిజ్యం నుంచి ఉపసంహరణ ♦ స్వీయ ప్రయోజనాలకు పెద్దపీట
► దేశంలో పన్నుల తగ్గింపు, వలసల నియంత్రణతోనూ ఇబ్బందులే
► అలా జరిగితే అమెరికా వాణిజ్య అనిశ్చితి, ఆర్థిక మాంద్యం
► భారత ఐటీ రంగం, నిపుణులకు ప్రతికూలం.. రక్షణ రంగంలో ఓకే
సాక్షి, నేషనల్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందటంతో.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నుంచి అమెరికా నెమ్మదిగా ఉపసంహరించుకోవడంతో పాటు.. నిబంధనల ప్రకారం నమోదు చేసుకోని వలసలపై కొరడా ఝళిపించే అవకాశం ఉంటుంది కాబట్టి.. అగ్ర రాజ్యంలో సమీప భవిష్యత్తులో వాణిజ్య అనిశ్చితి పెరుగుతుందని, ఆర్థికవృద్ధి నెమ్మదిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే.. పన్నుల తగ్గింపు వంటి చర్యలు వృద్ధికి దోహదం చేస్తాయని చెప్తున్నారు. మొత్తంగా ట్రంప్ హయాంలో అమెరికా వార్షిక వృద్ధి రేటు 1.75 శాతంగా ఉంటుందని.. ఏటా 4 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
పన్నుల తగ్గింపు...
ఇళ్ల మీద, వ్యాపారాల మీద పన్నులను తగ్గిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. మొత్తం ఏడు స్లాబులుగా ఉన్న ఆదాయ పన్ను రేట్లను మూడు స్లాబులలోకి కుదించాలని.. పన్నును 25 శాతానికి తగ్గించాలనేది ట్రంప్ ప్రతిపాదన. దీనివల్ల అందరికీ రేట్లు తగ్గుతాయి. అతి తక్కువ ఆదాయం ఉన్న వారిపై పన్ను ఉండదు. అలాగే కార్పొరేట్ పన్నును కూడా 35 శాతం నుండి 15 శాతానికి తగ్గిస్తానని కూడా ట్రంప్ హామీ ఇచ్చారు. పన్నుల తగ్గింపువల్ల అమెరికా వచ్చే పదేళ్లలో 9.5 ట్రిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోతుంది. ఈ ఆదాయ నష్టాన్ని పన్ను విధానాల్లో లోపాలను సవరించడం ద్వారా భర్తీ చేసుకోవచ్చునని ట్రంప్ అంటున్నారు. కానీ.. అందులో ఎక్కువ భాగాన్ని అప్పులతో భర్తీ చేయాల్సి ఉన్నందున వడ్డీ రేట్లు పెరిగి, రుణాల స్వీకరణ దెబ్బతిని మాంద్యం రావొచ్చని నిపుణులంటున్నారు.
వలసల నియంత్రణ...
మెక్సికో నుంచి వలసలను తగ్గించడానికి సరిహద్దులో గోడ కట్టిస్తానని, దానికి అయ్యే ఖర్చును ఆ దేశమే భరిస్తుందన్నది ట్రంప్ ఎన్నికల హామీల్లో చాలా ప్రముఖమైనది. ప్రస్తుత వలస చట్టాలను అమలు చేస్తానని, కోటికి పైగా ఉన్న అక్రమ వలసదారులను పంపిచేస్తానని ట్రంప్ సూచించారు. వీరిని వెనక్కు పంపిస్తే కార్మిక శక్తి గణనీయంగా తగ్గిపోతుందని, దానివల్ల జీడీపీ వృద్ధి రేటు పడిపోతుందని నిపుణులు చెప్తున్నారు.
ప్రపంచంతో వ్యాపారం...
ప్రపంచ దేశాలతో వాణిజ్యంలో స్వదేశీ ప్రయోజనాలకు పెద్దపీట వేసే ‘రక్షణ విధానాల‘కు ట్రంప్ మళ్లీ ఊపిరిపోశారు. ఇటువంటి రక్షణ విధానాలతో ఏ ఆర్థిక భాగస్వామ్య దేశంతోనైనా వాణిజ్య యుద్ధం తలెత్తితే అది అమెరికాలో మాంద్యానికి దారితీస్తుందని, షేర్ల ధరలు, ప్రభుత్వ రాబడులు పడిపోతాయని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అలాగే.. వివిధ భద్రత అంశాల విషయంలో నాటో ద్వారా వచ్చే అమెరికా సాయం తగ్గిపోతే యూరోపియన్ యూనియన్ రక్షణ సామర్థ్యం పెంచుకోవాల్సి వస్తుందని, అందుకోసం వ్యయం పెంచాల్సి వస్తుందని.. ఈయూ తూర్పు సరిహద్దుల్లో అనిశ్చితి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత్‌పైన... అమెరికాలో డెమొక్రటిక్ అభ్యర్థి కన్నా రిపబ్లికన్ అధ్యక్షుడు ఉంటే.. భారత్‌కు ఎక్కువ మంచిదని గత అనుభవాలు చెప్తున్నాయి.
విదేశీ వాణిజ్య ఒప్పందాలన్నింటినీ సమీక్షిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అదే జరిగితే భారత్‌తో ఒప్పందాలపైనా ప్రభావం ఉంటుంది.
హెచ్1బి వీసా కార్యక్రమం ‘అన్యాయమ’ని, దానిని రద్దు చేస్తానని ట్రంప్ ప్రచారంలో ప్రకటించారు. ఇదే జరిగితే భారత్‌కు చెందిన టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ సంస్థలు దెబ్బతింటాయి.
భారతదేశం నుండి అమెరికాకు ఉద్యోగాలను తిరిగి తీసుకురావడం అంటే.. భారతదేశం నుంచి అమెరికాకు వచ్చే వలసలపై మరింత కఠినమైన నిబంధనలు విధించటమే.
అమెరికాలో కార్పొరేట్ పన్నును ప్రస్తుతమున్న 35 శాతం నుండి 15 శాతానికి తగ్గిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. దీనిని అమలు చేస్తే.. ఫోర్డ్, జనరల్ మోటార్స్, మైక్రోసాఫ్ట్‌వంటి సంస్థలు అమెరికాకు వెళ్లిపోవచ్చు.
చైనాను వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్‌ను ఉగ్రవాదులకు స్థావరంగా అభివర్ణించిన ట్రంప్ హయాంలో.. భారత్ - అమెరికాల మధ్య రక్షణ బంధం మరింత బలపడే అవకాశముంది. ఆ రంగంలో వాణిజ్య ఒప్పందాలు పెరగవచ్చు.