
అమెరికాలో సంక్షోభం: పడిపోయిన క్రూడాయిల్ ధర
అమెరికాలో తలెత్తిన అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ప్రభావం ఆయిల్ మార్కెట్పై పడింది.
వాషింగ్టన్/ముంబై: అమెరికాలో తలెత్తిన అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ప్రభావం ఆయిల్ మార్కెట్పై పడింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 101 డాలర్లకు పడిపోయింది. అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మూసేయాలని వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదేశించిన విషయం తెలిసిందే. బడ్జెట్ బిల్లు సెనేట్లో ఆమోదం పొందకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్ సమయానికి స్పందించి, అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా రేపటికి సంతకం చేస్తారో లేదో ఇంకా తెలియదని, అందువల్ల ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాయాలయన్నింటినీ మూసివేయాలని వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ సిల్వియా బర్వెల్ ఒక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ వీలైనంత త్వరగా స్పందించి, తాత్కాలికంగానైనా ఓ బడ్జెట్ను ఆమోదించాలని, అప్పుడు మిగిలిన ఆర్థిక సంవత్సరానికి కావల్సిన బడ్జెట్ను కొంత సమయం తీసుకున్న తర్వాత ఆమోదించుకోవచ్చని, దానివల్ల ప్రభుత్వ సేవలన్నింటినీ త్వరగా పునరుద్ధరించే అవకాశం ఉంటుందని లేనిపక్షంలో తీవ్ర ప్రభావం కలిగే ప్రమాదముందని బర్వెల్ అన్నారు. గడిచిన 17 సంవత్సరాల్లో అమెరికా ప్రభుత్వానికి ఈ పరిస్థితి రావడం ఇదే మొట్టమొదటిసారి. చిట్టచివరిసారిగా 1996లో క్లింటన్ ప్రభుత్వానికి, రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్కు మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కూడా బడ్జెట్ ఆమోదం పొందలేదు.
ఇదిలా ఉండగా, రిపబ్లికన్లు మరీ తీవ్రవాదుల్లా వ్యవహరించి సొంత అమెరికన్లనే బందీలుగా చేశారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిప్పులుగక్కారు. ప్రభుత్వాన్ని బెదిరించడానికి బడ్జెట్ను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. చిట్టచివరి నిమిషంలో కూడా తాము రాజీ పడేందుకు ప్రయత్నించినా, వాళ్లు మాత్రం వినిపించుకోలేదని చెప్పారు. ఆరోగ్య బీమా సంస్కరణల బిల్లు మీద సంతకం పెట్టకుండా ఒబామాను అడ్డుకోవాలని రిపబ్లికన్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందువల్లే వాళ్లు బడ్జెట్ బిల్లును సైతం ఆమోదించకుండా అడ్డుపడ్డారు.
దీని ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎలాగోలా రిపబ్లికన్లకు - ఒబామా సర్కారుకు మధ్య ఒప్పందం కుదరని పక్షంలో ఈనెల రెండో వారానికల్లా అమెరికా పూర్తిగా దివాలా తీసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం పనిచేయాలంటే కాంగ్రెస్ సహకరించాలని, బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలంటే బడ్జెట్ ఉండాలని ఒబామా అన్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా రిపబ్లికన్ హౌస్ స్పీకర్ జాన్ బోనర్ తదితర నాయకులతో వేరువేరుగా ఫోన్లో మాట్లాడారు. అయినా ఫలితం లేదు. ఈ ప్రభావం ఆయిల్ మార్కెట్పై పడి క్రూడ్ ఆయిల్ ధర పడిపోయింది. బంగారం ధరలపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక ముందు ముందు ఈ ప్రభావం వల్ల ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయో వేచి చూడాలి.