
వాషింగ్టన్: యెమెన్‌లో అమెరికా భద్రతా దళాలు జరిపిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో అల్ కాయిదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) కీలక నేత ఖాసిం అల్ రిమీ (46) హతమ య్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ధ్రువీకరించారు. రిమీ మరణంతో అరేబియన్ ద్వీపకల్పంలో అల్‌కాయిదా మరింత బలహీనపడుతుందని, దీంతో జాతీయ భద్రతకు ఉగ్రవాద గ్రూపుల నుంచి ముప్పు తప్పుతుందని పేర్కొన్నారు. తన ఆదేశాల మేరకు యెమెన్‌లోని అమెరికా దళాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ ఆపరేషన్ ఎప్పుడు, ఎలా నిర్వహించారో వెల్లడించలేదు.
రిమీ 1990 ల్లో అల్‌కాయిదాలో చేరాడని, అఫ్గానిస్తాన్‌లో ఒసామా బిన్ లాడెన్ కోసం పని చేశాడని ట్రంప్ తెలిపారు. రిమీ నేతృత్వంలో అల్‌కాయిదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఏక్యూఏపీ) గ్రూపు యెమెన్‌లోని సాధారణ పౌరులపై హింసాకాండ జరిపిందని పేర్కొన్నారు. రిమీ మరణంతో అమెరికా ఆశలు, ఆశయాలు భద్రంగా ఉన్నాయన్నారు. అమెరికాకు హాని తలపెట్టాలని చూసే ఉగ్రవాదులను ఏరిపారేసి అమెరికన్ పౌరులను కాపాడుకుంటామన్నారు. కాగా, డిసెంబర్ 6న ఫ్లోరిడాలోని అమెరికా నావల్ బేస్‌లో జరిగిన కాల్పులకు రిమీ నేతృత్వంలోని గ్రూపు తమదే బాధ్యత అని ప్రకటించింది.
ఈ ఘటనలో ఓ సౌదీ వాయుసేన అధికారి ముగ్గురు అమెరికా నావికులను చంపాడు. రిమీకి సంబంధించిన సమాచారం ఇచ్చినవారికి కోటి డాలర్లు (10 మిలియన్ డాలర్లు) ఇస్తామని అమెరికా గతంలో ప్రకటించింది. అల్‌కాయిదాకు అల్‌జవహరి వారసుడు రిమీ అనుకుంటారు. గత కొన్ని నెలల్లో అమెరికా చేపట్టిన మూడో పెద్ద ఆపరేషన్ ఇది. గతేడాది అక్టోబర్‌లో ఐసిస్ నేత బగ్దాదీని, ఈ ఏడాది జనవరిలో ఇరానియన్ జనరల్ సులేమానీని అమెరికా దళాలు హతం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment