ఉగ్రవాద సంస్థను వెనకేసుకురావడమేంటి..
న్యూయార్క్: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వాని అమర వీరుడని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కొనియాడడాన్ని తప్పుపట్టే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సెప్టెంబర్ 21న జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభా సమావేశాల్లో బుర్హాన్ వానిని షరీఫ్ కీర్తించడాన్ని అమెరికా చట్టసభ సభ్యులు టెడ్ పోయ్ మండిపడ్డారు. హింసను ప్రేరేపించడమే లక్ష్యంగా చేసుకున్న ఓ ఉగ్రవాద సంస్థను పాక్ ప్రధాని వెనకేసుకురావడానికి ఐక్యరాజ్యసమితిని వేదికగా చేసుకోవడం నిరాశ కలిగించిందని టెడ్ పోయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
మరోవైపు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్థాన్ ను పరిగణించాలా? అంటూ వైట్ హౌస్ అధికారిక వెబ్ సైట్ లో ఉంచిన ఆన్ లైన్ పిటిషన్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. నెల రోజుల్లో లక్ష మంది అభిప్రాయాలను సేకరించాలన్న టార్గెట్ తో వైట్ హౌస్ సెప్టెంబర్ 21న సదరు పిటిషన్ ను వెబ్ సైట్ లో పెట్టగా..కేవలం ఏడురోజుల్లోనే (బుదవారం రాత్రి వరకు) 2 లక్షల 65 వేలమందికి పైగా నెటిజన్లు తమ మద్దతును ప్రకటించడంతో వైట్ హౌస్ వెబ్సైట్లో మోస్ట్ పాపులర్ ఆక్టివ్ పిటిషన్గా నిలిచింది.
ఉరీ ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ను టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని అమెరికా చట్టసభకు చెందిన ఇద్దరు సభ్యులు రిపబ్లికన్ పార్టీకి చెందిన టెడ్ పోయ్, డెమొక్రెటిక్ పార్టీకి చెందిన డానా రోహ్రబచెర్ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదంపై వేసిన కాంగ్రెస్ కమిటీలో వీరిద్దరూ కీలక సభ్యులు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో అమెరికా, భారత్ తో పాటు అనేక దేశాల ప్రజలు కూడా పాల్గొంటున్నారు.
అక్టోబర్ 21 వరకూ ఈ ప్రజాభిప్రాయాలను సేకరిస్తారు. గతంలో కూడా అనేక అంశాలపై వైట్ హౌస్ ప్రజాభిప్రాయాలను సేకరించడం సంప్రదాయంగా వస్తోంది.
Disappointed to see the Pakistan PM use the @UN to praise a militant group that uses violence to promote its cause. https://t.co/FDsWOY7fhB
— Ted Poe (@JudgeTedPoe) September 28, 2016