పోలీస్ చీఫ్ ఉద్యోగం ఊడింది
చికాగో: అమెరికాలో నల్లజాతి యువకుడిని తెల్లజాతి పోలీస్ అధికారి కాల్చి చంపిన ఘటనలో చికాగో పోలీస్ ఉన్నతాధికారి గ్యారీ మెక్ క్యాథీపై వేటు పడింది. ఘటన జరిగి 13 నెలలు గడిచినా కేసు విచారణ ఓ కొలిక్కి రాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన్ను తొలగిస్తూ.. చికాగో మేయర్ ర్యామ్ ఇమాన్యుయల్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. నల్లజాతి యువకుడిపై కాల్పులకు సంబంధించిన ఓ వీడియో ఇటీవల బహిర్గతమైంది. ఆ వీడియోలో తెల్లజాతి పోలీస్ ఆఫీసర్ వాన్ డైక్.. నల్లజాతి టీనేజీ యువకుడు మెక్ డొనాల్డ్ పై 16 రౌండ్లు కాల్పులు జరిపినట్లు కనిపించింది. ఈ వీడియోతో ఆగ్రహానికి లోనైన నల్ల జాతీయులు.. ఘటన జరిగి 13 నెలలు గడిచినా నిందితుడిని శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని చికాగోలో గత వారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో కేసు విచారణలో జరిగిన జాప్యం తనను తీవ్ర అసహనానికి గురి చేసిందని పేర్కొన్న మేయర్.. పోలీస్ ఉన్నతాధికారిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు. అలాగే పోలీసు శిక్షణ, పనితీరును పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరిగేలా ఈ కమిటీ పనిచేస్తుందని ఇమాన్యుయల్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయన.. ఇలాంటి ఘటనలపై తీసుకునే చర్యలకు ఇది ప్రారంభం మాత్రమే అని చెప్పారు. కాగా కాల్పులకు పాల్పడిన పోలీస్ ఆఫీసర్ వాన్ డైక్ సోమవారం 1.5 మిలియన్ డాలర్ల పూచీకత్తుతో బెయిల్పై విడుదలయ్యాడు.