శ్రీనివాసన్‌కు దక్కలేదు
అమెరికా సుప్రీం జడ్జిగా మెర్రిక్ గార్లాండ్
వాషింగ్టన్: అమెరికా సుప్రీం కోర్టు జడ్జిగా మెర్రిక్ గార్లాండ్ (63)ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేశా రు. చివరి నిమిషం వరకు భారత సంతతికి చెందిన శ్రీ శ్రీనివాసన్‌కే ఒబామా అవకాశం కల్పిస్తారని భావించినా అది జరగలేదు. వైట్‌హౌజ్‌లోని రోజ్ గార్డెన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మెర్రిక్ పేరును ఒబామా ప్రటిం చారు. ‘గార్లాండ్ సుప్రీం కోర్టుకు నైతికత, గొప్పదనం, పారదర్శకత తీసుకు రాగల సమర్థుడు’ అని ఒబామా ప్రశంసించారు. చివరి వరకు శ్రీనివాసన్ పేరునే ప్రకటించే అవకాశం కనిపించింది. అయితే.. ఎన్నికల సంవత్సరం కావడంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సెనేట్ రిపబ్లికన్లు ఒబామాను హెచ్చరించారు.
వచ్చే అధ్యక్షుడు 9 మంది సభ్యుల ధర్మాసనం నుంచి ఒకరిని ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఒబామా, డెమోక్రాట్లు మాత్రం.. మరో పది నెలల సమయం ఉన్నందున ఈ విషయాన్ని అప్పుడు ఆలోచించుకోవచ్చని భావించారు. చివరి వరకు జరిగిన తర్జన భర్జనల అనంతరం గార్లాండ్ పేరును ప్రకటించినట్లు తెలిసింది. క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్‌కు యూస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ చీఫ్ జస్టిస్‌గా నియమితులైన గార్లాండ్.. హార్వర్డ్ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. సుప్రీం కోర్టు నామినీల చరిత్రలోనే ఫెడరల్ చట్టాలపై విస్తృత అనుభవం ఉన్న వ్యక్తి గార్లాండ్ అని వైట్‌హౌజ్ కొనియాడింది. గత నెలలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంటోనిన్ హఠాన్మరణంతో ఈ పదవి ఖాళీ అయింది.