ఇరాక్‌.. లిబియా.. ఇక సిరియా...! | USA eyes on syria after iraq and libya | Sakshi
Sakshi News home page

ఇరాక్‌.. లిబియా.. ఇక సిరియా...!

Published Mon, Apr 10 2017 8:26 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

ఇరాక్‌.. లిబియా.. ఇక సిరియా...! - Sakshi

ఇరాక్‌.. లిబియా.. ఇక సిరియా...!

అసద్‌ సర్కారు కూలిపోతే, సిరియాలో అరాచకమే?

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
రసాయన ఆయుధాలతో ఇద్లీబ్‌ రాష్ట్రంలో సొంత ప్రజలనే హతమార్చారనే కారణంపై సిరియాపై అమెరికా జరిపిన క్షిపణి దాడులు చివరికి అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పదవీచ్యుతికి దారి తీస్తాయా అనే అనుమానం వస్తోంది. అమెరికా విదేశాంగ శాఖలో కీలక పాత్ర పోషించే నేతల మాటలు వింటే ఇది నిజమే అనిపిస్తోంది. దాదాపు 17 ఏళ్లుగా ఈ అరబ్‌ దేశాన్ని పాలిస్తున్న అసద్‌ ఒకవేళ పదవి నుంచి దిగిపోతే.. ఆ దేశంలో ఇరాక్, లిబియా పరిణామాలు పునరావృతమౌతాయనే భయాందోళనలు పట్టిపీడిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌ (జూనియర్‌ బుష్‌) హయాంలో 2003లో సరైన ప్రత్యామ్నాయం లేకుండా సద్దాం హుస్సేన్‌ సర్కారును బలప్రయోగంతో కూల్చివేశాక ఇరాక్‌లో ఆరంభమైన అంతర్యుద్ధానికి ఇంతవరకు తెరపడలేదు. తర్వాత అమెరికాలో అధికారంలోకి వచ్చిన ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా హయాంలో 2011లో అప్పటి లిబియా నేత కల్నల్‌ గఢాపీ ప్రభుత్వాన్ని అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య కూటమి అధికారం నుంచి తొలగించాక కూడా అంతకన్నా ఎక్కువ అరాచకం చెలరేగింది. ఇంకా అక్కడి మంటలు చల్లారలేదు. ఇలా తమకు ఎదురు నిలిచిన ఇద్దరు అరబ్‌ పాలకులను అధికారం నుంచి కూలదోశాక ఈ శూన్యంలోకి అంతకన్నా దుర్మార్గమైన పాలకులే గద్దెలెక్కారు. ప్రజలు ఎడతెగని దురాగతాలకు బలవుతూనే ఉన్నారు.

అసద్‌ను కూలదోస్తే సిరియాను ఐసిన్‌కు అప్పగించినట్టేనా?
ఓ పక్క తిరుగుబాటుదారులతో, మరోపక్క ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులతో పోరాడుతూ ఆరేళ్లుగా అధికారం నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్న అసద్‌ను పదవీచ్యుతుడిని చేస్తే సిరియా పూర్తిగా ఐసిస్‌ చేతుల్లోకి వెళ్లిపోతుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇద్లీబ్‌లో విషవాయువు దాడి జరిగి దాదాపు 90 మంది మరణించక మందువరకూ అసద్‌ను తొలగించి, సిరియాలో ప్రభుత్వాన్ని మార్చాలనే ఆలోచన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కారుకు లేదు. రసాయన దాడి జరిగాక ఒక్కసారిగా అమెరికా ఆలోచనా తీరు మారిపోయింది. ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో అమెరికా రాయబారి నికీ హేలీ ఆదివారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. ‘‘ సిరియాలో మేం అనుకుంటున్నట్టు ప్రభుత్వం మారడం అనివార్యంగా జరుగుతుంది. అక్కడి అన్ని పక్షాలూ ఇదే కోరుకుంటున్నాయి. అసద్‌ను వదవీచ్యుతుని చేయడం ఒక్కడే అమెరికాకు ప్రధానం కాదు. అయితే, అసద్‌ అధికారంలో ఉండగా సిరియాలో శాంతి పునరుద్ధరణ సాధ్యం కాదు’’అని సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తేల్చిచెప్పారు.

మూడు ప్రధాన పక్షాలు.. మూడు లక్ష్యాలు
అసద్‌ నేతృత్వంలోని బాత్‌ పార్టీ సర్కారుపై 2011 నుంచి పోరు సాగిస్తున్న మూడు పక్షాల్లో రెండు ఇస్లాం పేరుతో అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా(ఐసిస్‌)కు ఒకప్పటి ఖలీఫా తరహా ఇస్లామిక్‌ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం కాగా, వారితో విభేదించే ముస్లిం ఛాందసవాదులు దేశంలో షరియా ప్రాతిపదికన నడిచే పాలన తీసుకురావాలని భావిస్తున్నారు. గతంలో అసద్‌ సైన్యం నుంచి బయటికొచ్చి ఫ్రీ సిరియా ఆర్మీ (ఎఫ్‌ఎస్‌ఏ) పేరిట పోరాడుతున్న దళాలు అసద్‌ అనంతర సిరియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి, అసద్‌ పాలన అంతమొందించే విషయమై తుది నిర్ణయం తీసుకోవాలని పశ్చిమాసియా నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇరాక్‌ ప్రజలను సామూహికంగా అంతమొందించే రసాయన ఆయుధాలు తయారు చేయిస్తున్నారనే అభియోగం స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణలో పూర్తిగా రుజువుకాకుండానే  2003లో సద్దాం హుస్సేన్‌ ప్రభుత్వాన్ని అమెరికా తన సంకీర్ణ దళాల సాయంతో కూలదోసింది.

అధ్యక్షుడు ఒబామా 2011 చివర్లో 42 ఏళ్ల గఢాఫీ పాలనకు అదే పద్ధతిలో చరమగీతం పాడడానికి అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హిలరీ క్లింటన్‌ గట్టిగా పట్టుబట్టి విజయం సాధించారు. తర్వాత లిబియాలో అనేక గ్రూపుల నేతలు దేశాన్ని పంచుకుని గఢాఫీ కన్నా దుర్మార్గమైన విధానాలతో ప్రజలను పీల్చిపిప్పిచేస్తున్నారు. సద్దాం, గఢాపీలకు సరైన ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా 14 ఏళ్ల క్రితం ఇరాక్‌లో, ఆరేళ్ల కిందట లిబియాలో వారిని అధికారం నుంచి కూలదోసి అమెరికా అక్కడి ప్రజలకు ఎనలేని హాని చేసింది. మళ్లీ అవే పరిణామాలు పునరావృతమౌతాయనే భయంతో కోటీ 70 లక్షల జనాభా ఉన్న సిరియాలో పది శాతమున్న క్రైస్తవులు, ఇతర మైనారిటీ ముస్లిం వర్గాలు వణికిపోతున్నాయి. ఇరాక్‌లో ఇప్పటికే అనేక అల్పసంఖ్యాక ముస్లిం(కుర్దులు, ద్రూజ్‌లు)లపై ఐసిస్‌ సాగించిన మారణకాండను పశ్చిమాసియా అరబ్బులు ఇంకా మరవలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement