ఉత్తరాన వేగుచుక్క.. విద్యాదేవీ
భారతదేశానికి ఉత్తరాన.. ఆకాశాన్ని తాకుతున్నట్లనిపించే హిమాలయాలు. వాటి పాదాల చెత దాదాపు 1.5 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన నేపాల్. ఆ దేశ భూభాగం మొత్తంలో వ్యవసాయానికి పనికొచ్చే భూమి కేవలం 20 శాతం! జనాభా చూస్తే దాదాపు 3 కోట్లు! అందరికీ అన్ని సౌకర్యాల మాట అటుంచితే, కనీసం తిండిగింజలైనా దొరకని పరిస్థితి. మరోవైపు ప్రజల్ని పీక్కుతినే రాజరికం. ఏళ్లుగా అనుభవించిన పీడన నుంచి విప్లవం జనించింది. ఆ ఎరుపులో నుంచి వికసించిన వేగుచుక్కే.. విద్యాదేవీ భండారి!
2006లో విజయవంతమైన నేపాల్ విప్లవోద్యమంలో కీలక పాత్రధారి విద్యాదేవీ భండారి. మహిళా గెరిల్లాల దళాలను నడిపించడం దగ్గర్నుంచి మహిళా రైతు కూలీలకు హక్కులకు పాఠాలు నూరిపోయడం వరకు అన్ని బాధ్యతలు ఆమెవే. భర్త మదన్ భండారీ.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యునిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) కార్యదర్శి. 1993లో ఆయన అనుమానాస్పద రీతిలో మరణించారు. భర్త మరణంతో కుంగిపోకుండా.. ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసింది విద్యాదేవి. (నిజానికి విద్యార్థి దశలోనే ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఆమె.. మదన్ భండారీతో పెళ్లి తర్వాత కొన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.)ఇప్పటి సందర్భం.. నేపాల్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా విద్యాదేవీ భండారి ఎన్నిక కావడం.
కఠ్మాండులోని నేపాల్ పార్లమెంట్ భవనంలో బుధవారం నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన విద్యాదేవీ.. ఆ దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు. సమీప ప్రత్యర్థి నేపాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖుల్ బహదూర్ గురుంగ్ పై 100కుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత సెప్టెంబర్ లో నూతన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్న నేపాల్ కు.. నెల లోగా కొత్త అధ్యక్షుణ్ని ఎన్నుకోవడం అనివార్యమైంది. ఈ పదవికి ఎన్నికయ్యేంతవరకు విద్యాదేవీ.. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూఎంఎల్)కు ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. రాచరికం అంతమైన తర్వాత 2008లో జరిగిన మొట్టమొదటి ప్రజాస్వమ్యయిత ఎన్నికల్లో నేపాల్ అధ్యక్షుడిగా రామ్ భరణ్ యాదవ్ ఎన్నికయిన సంగతి తెలిసిందే.