డబ్బు కోసం ఎంత పని చేసింది!
హనోయ్: బీమా సొమ్ము కోసం వియత్నాంలో ఓ మహిళ ఎవరూ చేయని పని చేసింది. ఆమె చేసిన దుష్కృత్యం బట్టబయలై ఆమె చిక్కుల్లో పడిందని అధికారిక మీడియా వెల్లడించింది. రైలు ప్రమాదంలో తన ఎడమ చేయి, కాలు తెగిపోయాయని 'ఎట్టీఎన్' అనే 30 ఏళ్ల మహిళ బీమా సంస్థను ఆశ్రయించింది. రైలు ప్రమాదం నుంచి 'డీ' అనే స్నేహితుడు కాపాడని తెలిపింది. తనకు పరిహారంగా దాదాపు కోటిన్నర రూపాయలు ఇవ్వాలని బీమా సంస్థను కోరింది.
అయితే బీమా సొమ్ము కోసం ఆమే తన చేయి, కాలు తీయించేసుకుందని తెలిసి అంతా అవాక్కయ్యారు. తన స్నేహితుడికి రూ.లక్షన్నర ఇస్తానని ఆశ చూపి ఈ అఘాయిత్యం చేయించుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. హనోయ్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఆమె చేయి, కాలు అతికించే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. డబ్బు కోసం సిగ్గుమాలిన పనికి పాల్పడిన 'ఎట్టీఎన్' చేయి, కాలు కోల్పోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం మోసాలకు పాల్పడేవారికి ఈ ఉదంతం హెచ్చరికగా నిలుస్తుందని అన్నారు.