Hanoi
-
నదిపై కుప్పకూలిన బ్రిడ్జి.. ఎనిమిది మంది గల్లంతు
హనోయ్: వియత్నాంలో ఎర్ర నదిపై ఉన్న 30 ఏళ్ల నాటి వంతెన కుప్ప కూలింది. ఉత్తర ప్రావిన్సు ఫుథోలో సోమవారం(సెప్టెంబర్9) ఈ ఘటన జరిగింది. బ్రిడ్జి కుప్పకూలిన సమయంలో దానిపై ప్రయాణిస్తున్న 8 మంది నదిలో పడి గల్లంతయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ఎర్ర నదిపై ఉన్న మిగిలిన వంతెనల మీద రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని చోట్ల పూర్తిగా నిషేధించారు.ట్రాఫిక్ ఆపేసిన వాటిలో రాజధాని హనోయ్‌లోని చోంగ్డోంగ్ బ్రిడ్జి కూడా ఉంది. భారీ తుపాను యాగీ బీభత్సం వల్లే వంతెన కూలినట్లు అధికారులు తెలిపారు. తుపాను ధాటికి మొత్తం 58 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి.. నిప్పులు చిమ్మే డ్రోన్ డ్రాగన్ -
వియత్నాంలో ఘోర అగ్ని ప్రమాదం
హనోయి: వియత్నాం రాజధాని నగరం హనోయి ఘోర అగ్నిప్రమాదానికి నిలయంగా మారింది. హనోయిలో మంగళవారం రాత్రి తొమ్మిది అంతస్తుల భవంతి పార్కింగ్ ప్రాంతంలో మొదలైన అగి్నకీలలు వెనువెంటనే భవనం మొత్తాన్నీ చుట్టేశాయి. అత్యవసరంగా బయటపడే మార్గం ఈ భవనానికి లేదు. దీంతో తప్పించుకునే మార్గం కానరాక ఏకంగా 56 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. 37 మంది గాయపడ్డారు. 150 కుటుంబాలు నివసిస్తున్న ఈ భవనం ఇరుకైన దారిలో నిర్మించారు. దీంతో మంటలు ఆర్పే అగి్నమాపక సిబ్బంది భవనం దాకా చేరుకోలేకపోయారు. ఇరుకైన మార్గం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. మంటలు అంటుకుంటాయనే భయంతో కొందరు భవనం మీద నుంచి కిందకు దూకారు. ఇలా గాయపడిన వారిని హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. పొగపీల్చడంతో ఇబ్బందులు పడుతున్న వారికీ చికిత్సచేస్తున్నారు. -
Viral: వామ్మో.. పది అడుగుల పామును ఇట్టే పట్టేసింది!
హనోయి(వియత్నాం): మామూలుగా పాము కనిపిస్తే ఏం చేస్తాం? దూరంగా పరిగెడుతాం..సాధారణంగా పామును చూస్తే ఎవరికైనా భయమే.. కొంతమంది అయితే పామును చూడటంతోనే భయంతో వణికిపోతారు. ఇక కళ్ల ముందే పాము కనిపించిందంటే వాళ్లకు గుండె ఆగినంత పనవుతుంది. కానీ ఇక్కడ ఇదిగో ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న వియత్నాం లేడీ మాత్రం 10 అడుగుల పామును ఇట్టే పట్టేసింది. అంతటితో అయిపోలేదండోయ్. పాము ఆమె శరీరం చుట్టూ చుట్టుకుంటున్నా అదరలేదు..బెదరలేదు. ఆ పామును అట్టే పట్టుకుని దూరంగా నడుచుకుంటూ వెళ్తుంది. ఈ సంఘటన మే 21, 2021 న వియత్నాంలో జరిగింది. పామును పట్టుకునే మహిళ ముఖం కనిపించడం లేదు గానీ, ఆమె చేసిన సాహసం చూసిన నెటిజన్లు నోళ్లు వెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ...‘‘ నేను పాములను ప్రేమిస్తాను. ఇలాంటి సాహసం చేయాలనుకుంటున్నాను. కానీ నాకు ఇంకా అందుకు కావాల్సినంత ధైర్యం లేదు. ” అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజన్ “ఓ! నేను ఎప్పటికీ చేయలేను!! ” అంటూ రాసుకొచ్చారు. (చదవండి: వయసు డెబ్బై ఆరు.. ఈ విషయంలో యమ హుషారు!) -
‘శిఖరాగ్ర’ వైఫల్యం
మొండి వైఖరిని ప్రదర్శించే అలవాటున్న ఇద్దరు దేశాధినేతలు శాంతి చర్చలకు సిద్ధపడినప్పుడు ఆ చర్చల వల్ల అద్భుతాలేవో జరుగుతాయని ఎవరూ ఆశించరు. అందరూ అనుకున్నట్టే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య వియత్నాం రాజ ధాని హనోయ్‌లో బుధ, గురువారాల్లో జరిగిన రెండురోజుల శిఖరాగ్ర సదస్సు ఒప్పందాలేమీ లేకుండానే ముగిశాయి. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ట్రంప్ చెప్పినా, కిమ్‌వైపు నుంచి అటువంటి అభిప్రాయం వినబడలేదు. వాస్తవానికి అధినేతలిద్దరూ చర్చలు ముగించాక కలిసి భోజనం చేసి, ఆ తర్వాత ఒప్పందంపై అందరి సమక్షంలో సంతకాలు చేయాల్సి ఉంది. కానీ భేటీ రెండు గంటల్లోపే అర్ధంతరంగా ముగిసింది. అసలు ఈ శిఖరాగ్ర సదస్సుకు హనోయ్‌ను ఎంపిక చేయడంలో అమెరికాకు ఉన్న ఉద్దేశం వేరు...దాన్ని కిమ్ అవగాహన చేసుకున్న తీరు వేరు. ఒకప్పుడు తమను బద్ధశత్రువుగా పరిగణించిన కమ్యూనిస్టు వియత్నాం, తాము చెప్పినట్టు వినడం మొదలెట్టాక ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో ప్రత్యక్షంగా చూపాలని ట్రంప్ భావించారు. కానీ తమపై యుద్ధభేరి మోగించి దురాక్రమించడానికి ప్రయత్నించిన అమెరికాను తుదికంటా ఎదుర్కొని విజయం సాధించిన వియత్నాంను మాత్రమే కిమ్ చూడదల్చుకున్నట్టు న్నారు. అయితే ఈ శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని నిజంగా ఆశిస్తే అమెరికా చేయాల్సిం దెంతో ఉంది. ముఖ్యంగా అది తన సహజసిద్ధమైన పెత్తందారీ పోకడల్ని మార్చుకోవాలి. ఈ శిఖ రాగ్ర సదస్సు సమయంలోనే అది వెనిజులాతో కయ్యం పెట్టుకుంది. అక్కడ తనను తాను దేశా ధ్యక్షుడిగా ప్రకటించుకున్న జువాన్ గైదోకు తక్షణం బాధ్యతలు అప్పగించాలని ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురోను బెదిరిస్తోంది. మరోపక్క క్యూబాపై కూడా అది విరుచుకుపడుతోంది. 59 ఏళ్లపాటు క్యూబాపై అమెరికా అత్యంత దారుణమైన ఆంక్షలు విధించింది. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు 1960లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ ప్రభుత్వం రూపొందించిన కఠినమైన నిబంధనలు అమలు చేస్తామని తాజాగా ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అవి నిజానికి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైనవి. క్యూబాలో విప్లవానంతరం ఆ దేశానికి చెందిన పౌరులు తమ ఆస్తుల్ని, వ్యాపారాలను వదిలిపెట్టి అమెరికా పరారైనప్పుడు వాటిని ఫైడల్ కాస్ట్రో ప్రభుత్వం జాతీయం చేసింది. అలా స్వాధీనం చేసుకున్న ఆస్తులకు పరిహారం చెల్లిస్తామని కూడా ప్రకటించింది. అలాం టివారంతా అనంతరకాలంలో అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్నారు. వారంతా క్యూబాపై అమె రికా న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు వేయడానికి వీలు కల్పించే నిబంధనల్ని ఐసెన్‌హోవర్ ప్రభుత్వం రూపొందించింది. న్యాయస్థానాలు ఆ వ్యాజ్యాల్లో బాధితులకు అనుకూలంగా తీర్పిస్తే... ఆ పరి హారం చెల్లించడం క్యూబాకు తలకుమించిన భారమవుతుంది. అది పూర్తిగా దివాళా తీస్తుంది. ఒక పక్క కిమ్‌తో శాంతి చర్చలు జరుపుతూ వేరే దేశాలను ఇష్టానుసారం బెదిరించే చర్యకు పూనుకో వడం వల్ల అమెరికా చిత్తశుద్ధిని కిమ్ శంకించే అవకాశం ఉండదా? ఇప్పుడు హనోయ్ శిఖరాగ్ర సమావేశం విఫలం కావడానికి ట్రంప్, కిమ్‌లు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. యాంగ్‌బియాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని, అందుకు ప్రతిఫలంగా తమపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తేయాలని కిమ్ కోరినట్టు అమెరికా ప్రభుత్వం చెబుతోంది. అక్క డున్న రెండో అణుకేంద్రాన్ని సైతం ధ్వంసం చేస్తేనే ఆంక్షలు సంపూర్ణంగా ఎత్తేస్తామని తాము చెప్ప డంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని ట్రంప్ అంటున్నారు. అయితే ఉత్తర కొరియా కథనం వేరేలా ఉంది. అమెరికా అమలు చేస్తున్న 11 ఆంక్షల్లో అయిదింటిని మాత్రమే రద్దు చేయమని అడిగామంటున్నది. ఆ అయిదూ అత్యంత కీలకమైనవని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రెండు దేశాల అధినేతల మధ్య చర్చలు ప్రారంభం కావడానికి ముందు ఆ దేశాల దౌత్యవేత్తలు సమావేశమవుతారు. ఎజెండా ఖరారు చేస్తారు. అవతలి పక్షం తమనుంచి కోరుకుంటున్నదే మిటో... తాము అటునుంచి ఆశిస్తున్నదేమిటో రెండు దేశాల దౌత్యవేత్తలూ పరస్పరం చెప్పుకుం టారు. ఏ ఏ అంశాల విషయంలో తాము సుముఖంగా ఉన్నామో, వేటిని తిరస్కరిస్తున్నామో ముందే అవతలి పక్షానికి తేటతెల్లం చేస్తారు. ఆ తర్వాతే అధినేతల శిఖరాగ్ర చర్చలు జరుగుతాయి. అంతా ముందే నిర్ణయించుకుంటారు గనుక ఒప్పందాలపై సంతకాలవుతాయి. కానీ హనోయ్ శిఖరాగ్ర సదస్సుకు ముందు అటు అమెరికా, ఇటు ఉత్తర కొరియా ఇలాంటి కసరత్తులు జరిపిన దాఖలాలు లేవు. పైగా కిమ్‌తో ట్రంప్ తన సలహాదారులెవరూ లేకుండా ఏకాంతంగా చర్చించారు. వారిద్దరితోపాటు కేవలం ఉత్తర కొరియా దుబాసి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కిమ్‌తో మాత్రమే కాదు... ఏ దేశాధినేతతో చర్చించినా ట్రంప్ ఈ మాదిరే వ్యవహరి స్తున్నారు. గతంలో పుతిన్‌తో చర్చించినప్పుడు సైతం ట్రంప్ తన సలహాదారులను దూరం పెట్టారు. ఇప్పుడు ట్రంప్, కిమ్‌లు మాత్రమే చర్చలు సాగించారు గనుక వాటిపై ఇద్దరిలో ఎవరి కథనం నిజమో చెప్పడం కష్టం. అయితే ఈ చర్చల పర్వం ఇంతటితో ముగియలేదని, భవిష్యత్తులో కూడా ఇవి కొనసాగుతాయని అమెరికా అంటున్నది. కానీ ఉత్తర కొరియా వైఖరేమిటో ఇంకా తెలి యవలసి ఉంది. ఇప్పట్లో అయితే ఇవి ఉండబోవని స్పష్టంగా చెప్పవచ్చు. చర్చలు జరిపే పక్షాలు ఇచ్చిపుచ్చుకునే వైఖరితో ఉండాలి. పెత్తందారీ పోకడలకు స్వస్తి చెప్పాలి. అవతలివారిలో విశ్వాసం నింపాలి తప్ప అనుమానాలు కలిగించకూడదు. కానీ మొదటినుంచీ అమెరికా వ్యవహార శైలి ఇందుకు భిన్నంగా ఉంది. ఎంతసేపూ ఉత్తర కొరియా నుంచి ఆశించడం తప్ప, తన వంతు చేయా ల్సిందేమిటో గుర్తించడంలేదు. చేయడం లేదు. సరిగదా అత్యాశకు పోతోంది. ఈ పోకడ రాగల రోజుల్లో ఉత్తర కొరియాను మరింత మొండి వైఖరి దిశగా తీసుకెళ్తుంది తప్ప సత్ఫలితాలనీయదని అమెరికా గ్రహించడం మంచిది. -
హనోయ్‌లో ట్రంప్–కిమ్
హనోయ్: కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చే దిశగా మరో ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లు రెండోసారి భేటీ అయ్యారు. వియత్నాంలోని హనోయ్ నగరంలో ఉన్న సోఫీటెల్ లెజెండ్ మెట్రోపోల్ హోటల్లో ఈ నేతలిద్దరూ బుధవారం మీడియా సమక్షంలో కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈసారి సదస్సులో గొప్ప ఫలితాన్ని సాధిస్తామని ఆశాభావంతో ఉన్నాను. దీన్ని ప్రతీఒక్కరూ తప్పకుండా స్వాగతిస్తారు’అని తెలిపారు. అనంతరం ట్రంప్ స్పందిస్తూ..‘గతంలో జరిగి న చర్చలతో పోల్చుకుంటే ఈ భేటీలో మెరుగైన ఫలితాలను సాధిస్తాం‘అని అభిప్రాయపడ్డారు. సింగపూర్‌లోని క్యాపెల్లా హోటల్లో 2018, జూన్ 12న ట్రంప్–కిమ్ తొలిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉ.కొరియా పూర్తిస్థాయిలో అణ్వాయుధాలను త్యజించాలని ట్రంప్ కోరారు. అయితే అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపివేసేందుకు కిమ్ ప్రభుత్వం అంగీకరించింది. మీడియా సిబ్బందికి నో ఎంట్రీ.. హనోయ్‌లోని మెట్రోపోల్ హోటల్లో బుధవారం మీడియాతో మాట్లాడిన తర్వాత ట్రంప్–కిమ్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నేతలిద్దరూ డిన్నర్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ట్రంప్ వెంట మీడియా ప్రతినిధులు వెళ్లేందుకు వైట్‌హౌస్ అధికారులు అనుమతించలేదు. ఈ విషయమై వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్ స్పందిస్తూ.. ఈ సమావేశం సున్నితత్వం నేపథ్యంలోనే మీడియా సిబ్బందికి పరిమితులు విధించామని వివరణ ఇచ్చారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ దిశగా ట్రంప్–కిమ్ భేటీ కీలక ముందడుగు అవుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. కాగా, అమెరికా, ఉ.కొరియా ప్రతినిధి బృందాలు నేడు మరోసారి సమావేశమై అణ్వస్త్రాలను త్యజించడంపై మరోసారి చర్చలు జరుపుతున్నాయి. -
తుపాను బీభత్సం.. 27 మంది మృతి
హనాయ్ : వియత్నాంలో దామ్రే తుపాను బీభత్సం సృష్టిస్తోంది. 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో 27 మందికి పైగా మృతి చెందారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీయడంతో 40 వేల ఇళ్లు నేలమట్టమైనట్లు సమాచారం. తుపాను తీవ్రత మరింత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎపెక్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల నేతలు వియత్నాం వెళ్లనున్న తరుణంలో ఈ విపత్తు జరగడంతో పలు దేశాల అధినేతలు ఆలోచనలో పడ్డారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వియత్నాం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తుపాను ధాటికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు అంధకారంలో మగ్గిపోయారని ఉన్నతాధికారులు వివరించారు. -
డబ్బు కోసం ఎంత పని చేసింది!
హనోయ్: బీమా సొమ్ము కోసం వియత్నాంలో ఓ మహిళ ఎవరూ చేయని పని చేసింది. ఆమె చేసిన దుష్కృత్యం బట్టబయలై ఆమె చిక్కుల్లో పడిందని అధికారిక మీడియా వెల్లడించింది. రైలు ప్రమాదంలో తన ఎడమ చేయి, కాలు తెగిపోయాయని 'ఎట్టీఎన్' అనే 30 ఏళ్ల మహిళ బీమా సంస్థను ఆశ్రయించింది. రైలు ప్రమాదం నుంచి 'డీ' అనే స్నేహితుడు కాపాడని తెలిపింది. తనకు పరిహారంగా దాదాపు కోటిన్నర రూపాయలు ఇవ్వాలని బీమా సంస్థను కోరింది. అయితే బీమా సొమ్ము కోసం ఆమే తన చేయి, కాలు తీయించేసుకుందని తెలిసి అంతా అవాక్కయ్యారు. తన స్నేహితుడికి రూ.లక్షన్నర ఇస్తానని ఆశ చూపి ఈ అఘాయిత్యం చేయించుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. హనోయ్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. ఆమె చేయి, కాలు అతికించే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. డబ్బు కోసం సిగ్గుమాలిన పనికి పాల్పడిన 'ఎట్టీఎన్' చేయి, కాలు కోల్పోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం మోసాలకు పాల్పడేవారికి ఈ ఉదంతం హెచ్చరికగా నిలుస్తుందని అన్నారు.