‘శిఖరాగ్ర’ వైఫల్యం | Editorial On Donald Trump And Kim Jong Un Meeting Hanoi Summit | Sakshi
Sakshi News home page

‘శిఖరాగ్ర’ వైఫల్యం

Published Sat, Mar 2 2019 1:02 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

Editorial On Donald Trump And Kim Jong Un Meeting Hanoi Summit - Sakshi

మొండి వైఖరిని ప్రదర్శించే అలవాటున్న ఇద్దరు దేశాధినేతలు శాంతి చర్చలకు సిద్ధపడినప్పుడు ఆ చర్చల వల్ల అద్భుతాలేవో జరుగుతాయని ఎవరూ ఆశించరు. అందరూ అనుకున్నట్టే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల మధ్య వియత్నాం రాజ ధాని హనోయ్‌లో బుధ, గురువారాల్లో జరిగిన రెండురోజుల శిఖరాగ్ర సదస్సు ఒప్పందాలేమీ లేకుండానే ముగిశాయి. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ట్రంప్‌ చెప్పినా, కిమ్‌వైపు నుంచి అటువంటి అభిప్రాయం వినబడలేదు. వాస్తవానికి అధినేతలిద్దరూ చర్చలు ముగించాక కలిసి భోజనం చేసి, ఆ తర్వాత ఒప్పందంపై అందరి సమక్షంలో సంతకాలు చేయాల్సి ఉంది. కానీ భేటీ రెండు గంటల్లోపే అర్ధంతరంగా ముగిసింది.

అసలు ఈ శిఖరాగ్ర సదస్సుకు హనోయ్‌ను ఎంపిక చేయడంలో అమెరికాకు ఉన్న ఉద్దేశం వేరు...దాన్ని కిమ్‌ అవగాహన చేసుకున్న తీరు వేరు. ఒకప్పుడు తమను బద్ధశత్రువుగా పరిగణించిన కమ్యూనిస్టు వియత్నాం, తాము చెప్పినట్టు వినడం మొదలెట్టాక ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో ప్రత్యక్షంగా చూపాలని ట్రంప్‌ భావించారు. కానీ తమపై యుద్ధభేరి మోగించి దురాక్రమించడానికి ప్రయత్నించిన అమెరికాను తుదికంటా ఎదుర్కొని విజయం సాధించిన వియత్నాంను మాత్రమే కిమ్‌ చూడదల్చుకున్నట్టు న్నారు. అయితే ఈ శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని నిజంగా ఆశిస్తే అమెరికా చేయాల్సిం దెంతో ఉంది. ముఖ్యంగా అది తన సహజసిద్ధమైన పెత్తందారీ పోకడల్ని మార్చుకోవాలి. ఈ శిఖ రాగ్ర సదస్సు సమయంలోనే అది వెనిజులాతో కయ్యం పెట్టుకుంది. అక్కడ తనను తాను దేశా ధ్యక్షుడిగా ప్రకటించుకున్న జువాన్‌ గైదోకు తక్షణం బాధ్యతలు అప్పగించాలని ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్‌ మదురోను బెదిరిస్తోంది.

మరోపక్క క్యూబాపై కూడా అది విరుచుకుపడుతోంది. 59 ఏళ్లపాటు క్యూబాపై అమెరికా అత్యంత దారుణమైన ఆంక్షలు విధించింది. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు 1960లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్‌ ప్రభుత్వం రూపొందించిన కఠినమైన నిబంధనలు అమలు చేస్తామని తాజాగా ట్రంప్‌ హెచ్చరిస్తున్నారు. అవి నిజానికి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైనవి. క్యూబాలో విప్లవానంతరం ఆ దేశానికి చెందిన పౌరులు తమ ఆస్తుల్ని, వ్యాపారాలను వదిలిపెట్టి అమెరికా పరారైనప్పుడు వాటిని ఫైడల్‌ కాస్ట్రో ప్రభుత్వం జాతీయం చేసింది. అలా స్వాధీనం చేసుకున్న ఆస్తులకు పరిహారం చెల్లిస్తామని కూడా ప్రకటించింది. అలాం టివారంతా అనంతరకాలంలో అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్నారు.

వారంతా క్యూబాపై అమె రికా న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు వేయడానికి వీలు కల్పించే నిబంధనల్ని ఐసెన్‌హోవర్‌ ప్రభుత్వం రూపొందించింది. న్యాయస్థానాలు ఆ వ్యాజ్యాల్లో బాధితులకు అనుకూలంగా తీర్పిస్తే... ఆ పరి హారం చెల్లించడం క్యూబాకు తలకుమించిన భారమవుతుంది. అది పూర్తిగా దివాళా తీస్తుంది. ఒక పక్క కిమ్‌తో శాంతి చర్చలు జరుపుతూ వేరే దేశాలను ఇష్టానుసారం బెదిరించే చర్యకు పూనుకో వడం వల్ల అమెరికా చిత్తశుద్ధిని కిమ్‌ శంకించే అవకాశం ఉండదా?

ఇప్పుడు హనోయ్‌ శిఖరాగ్ర సమావేశం విఫలం కావడానికి ట్రంప్, కిమ్‌లు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. యాంగ్‌బియాన్‌ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని, అందుకు ప్రతిఫలంగా తమపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తేయాలని కిమ్‌ కోరినట్టు అమెరికా ప్రభుత్వం చెబుతోంది. అక్క డున్న రెండో అణుకేంద్రాన్ని సైతం ధ్వంసం చేస్తేనే ఆంక్షలు సంపూర్ణంగా ఎత్తేస్తామని తాము చెప్ప డంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని ట్రంప్‌ అంటున్నారు. అయితే ఉత్తర కొరియా కథనం వేరేలా ఉంది. అమెరికా అమలు చేస్తున్న 11 ఆంక్షల్లో అయిదింటిని మాత్రమే రద్దు చేయమని అడిగామంటున్నది. ఆ అయిదూ అత్యంత కీలకమైనవని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా రెండు దేశాల అధినేతల మధ్య చర్చలు ప్రారంభం కావడానికి ముందు ఆ దేశాల దౌత్యవేత్తలు సమావేశమవుతారు. ఎజెండా ఖరారు చేస్తారు. అవతలి పక్షం తమనుంచి కోరుకుంటున్నదే మిటో... తాము అటునుంచి ఆశిస్తున్నదేమిటో రెండు దేశాల దౌత్యవేత్తలూ పరస్పరం చెప్పుకుం టారు. ఏ ఏ అంశాల విషయంలో తాము సుముఖంగా ఉన్నామో, వేటిని తిరస్కరిస్తున్నామో ముందే అవతలి పక్షానికి తేటతెల్లం చేస్తారు. ఆ తర్వాతే అధినేతల శిఖరాగ్ర చర్చలు జరుగుతాయి. అంతా ముందే నిర్ణయించుకుంటారు గనుక ఒప్పందాలపై సంతకాలవుతాయి.

కానీ హనోయ్‌ శిఖరాగ్ర సదస్సుకు ముందు అటు అమెరికా, ఇటు ఉత్తర కొరియా ఇలాంటి కసరత్తులు జరిపిన దాఖలాలు లేవు. పైగా కిమ్‌తో ట్రంప్‌ తన సలహాదారులెవరూ లేకుండా ఏకాంతంగా చర్చించారు. వారిద్దరితోపాటు కేవలం ఉత్తర కొరియా దుబాసి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కిమ్‌తో మాత్రమే కాదు... ఏ దేశాధినేతతో చర్చించినా ట్రంప్‌ ఈ మాదిరే వ్యవహరి స్తున్నారు. గతంలో పుతిన్‌తో చర్చించినప్పుడు సైతం ట్రంప్‌ తన సలహాదారులను దూరం పెట్టారు. ఇప్పుడు ట్రంప్, కిమ్‌లు మాత్రమే చర్చలు సాగించారు గనుక వాటిపై ఇద్దరిలో ఎవరి కథనం నిజమో చెప్పడం కష్టం. అయితే ఈ చర్చల పర్వం ఇంతటితో ముగియలేదని, భవిష్యత్తులో కూడా ఇవి కొనసాగుతాయని అమెరికా అంటున్నది.

కానీ ఉత్తర కొరియా వైఖరేమిటో ఇంకా తెలి యవలసి ఉంది. ఇప్పట్లో అయితే ఇవి ఉండబోవని స్పష్టంగా చెప్పవచ్చు. చర్చలు జరిపే పక్షాలు ఇచ్చిపుచ్చుకునే వైఖరితో ఉండాలి. పెత్తందారీ పోకడలకు స్వస్తి చెప్పాలి. అవతలివారిలో విశ్వాసం నింపాలి తప్ప అనుమానాలు కలిగించకూడదు. కానీ మొదటినుంచీ అమెరికా వ్యవహార శైలి ఇందుకు భిన్నంగా ఉంది. ఎంతసేపూ ఉత్తర కొరియా నుంచి ఆశించడం తప్ప, తన వంతు చేయా ల్సిందేమిటో గుర్తించడంలేదు. చేయడం లేదు. సరిగదా అత్యాశకు పోతోంది. ఈ పోకడ రాగల రోజుల్లో ఉత్తర కొరియాను మరింత మొండి వైఖరి దిశగా తీసుకెళ్తుంది తప్ప సత్ఫలితాలనీయదని అమెరికా గ్రహించడం మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement