హనోయ్‌లో సమావేశమైన ఉత్తర కొరియా అధినేత కిమ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్
హనోయ్: కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితంగా మార్చే దిశగా మరో ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లు రెండోసారి భేటీ అయ్యారు. వియత్నాంలోని హనోయ్ నగరంలో ఉన్న సోఫీటెల్ లెజెండ్ మెట్రోపోల్ హోటల్‌లో ఈ నేతలిద్దరూ బుధవారం మీడియా సమక్షంలో కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరకొరియా అధినేత కిమ్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈసారి సదస్సులో గొప్ప ఫలితాన్ని సాధిస్తామని ఆశాభావంతో ఉన్నాను. దీన్ని ప్రతీఒక్కరూ తప్పకుండా స్వాగతిస్తారు’అని తెలిపారు. అనంతరం ట్రంప్ స్పందిస్తూ..‘గతంలో జరిగి న చర్చలతో పోల్చుకుంటే ఈ భేటీలో మెరుగైన ఫలితాలను సాధిస్తాం‘అని అభిప్రాయపడ్డారు. సింగపూర్‌లోని క్యాపెల్లా హోటల్‌లో 2018, జూన్ 12న ట్రంప్–కిమ్ తొలిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉ.కొరియా పూర్తిస్థాయిలో అణ్వాయుధాలను త్యజించాలని ట్రంప్ కోరారు. అయితే అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపివేసేందుకు కిమ్ ప్రభుత్వం అంగీకరించింది.
మీడియా సిబ్బందికి నో ఎంట్రీ..
హనోయ్‌లోని మెట్రోపోల్ హోటల్‌లో బుధవారం మీడియాతో మాట్లాడిన తర్వాత ట్రంప్–కిమ్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నేతలిద్దరూ డిన్నర్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ట్రంప్ వెంట మీడియా ప్రతినిధులు వెళ్లేందుకు వైట్‌హౌస్ అధికారులు అనుమతించలేదు. ఈ విషయమై వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్ స్పందిస్తూ.. ఈ సమావేశం సున్నితత్వం నేపథ్యంలోనే మీడియా సిబ్బందికి పరిమితులు విధించామని వివరణ ఇచ్చారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ దిశగా ట్రంప్–కిమ్ భేటీ కీలక ముందడుగు అవుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అభిప్రాయపడ్డారు. కాగా, అమెరికా, ఉ.కొరియా ప్రతినిధి బృందాలు నేడు మరోసారి సమావేశమై అణ్వస్త్రాలను త్యజించడంపై మరోసారి చర్చలు జరుపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment