కాలిఫోర్నియా : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో జనాలంతా ఇళ్లకే పరిమితమవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీంతో జంతువులు ఇప్పుడు మాదే రాజ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. రోడ్ల మీత స్వేచ్చగా విహరిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని సాంజోస్ ప్రాంతంలో కాపరి లేకుండానే రెండు వందల గొర్రెలు ఒక ఇంట్లోని ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకొని యధేచ్చగా రోడ్డు మీదకు చేరుకున్నాయి. రోడ్డు మొత్తం మాదే అన్నట్లుగా భావించి ఆనందంగా వీధులన్ని తిరగసాగాయి. అంతేగాక కాపరి ఎటు తీసుకెళితే అటు వెళ్లే గొర్రెల మంద ప్రస్తుతం అతను లేకపోవడంతో ఇళ్ల పక్కన ఉండే రకరకాల పూల చెట్లు, ఆకర్షణీయంగా ఉన్న గడ్డిని మేయడానికి ప్రయత్నించాయి. ఇక గొర్రెల మంద చూసిన చుట్టుపక్కల వాళ్లు అవన్నీ తప్పిపోకుండా ఒక డైరెక్షన్‌లో వెళ్లేలా అదమాయించడం వీడియోలో కనిపిస్తుంది. జాచ్ రోలాండ్స్ అనే వ్యక్తి ఇదంతా వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు. ఇక వీడియో చివర్లో ఒక కుక‍్క కూడా ఈ గొర్రెల మందతో జాయిన్ అయి వాటితో పాటు వీధులన్ని తిరగడం విశేషం.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు 7లక్షల మంది వీక్షించగా, 18వేల లైకులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment