
కొండ దిగలేక వెనక్కి మళ్లిన జలపాతం
లండన్: కొండ దిగే జలపాతాల గురించి విన్నాంకానీ, కొండ ఎక్కే జలపాతాన్ని గురించి ఎప్పుడైనా విన్నామా.. సాధారణంగా వాటర్ పాల్స్ అంటే ఎత్తైన కొండ ప్రాంతం నుంచి నురగలు కక్కుతూ కిందపడుతున్న నీటి దృశ్యం మదిలో మెదులుతుంది. కానీ, అలాకాకుండా కిందపడే నీరు కాస్త కిందికి చేరకుండానే తిరిగి వెనక్కి వెళ్లి కొండపైకి ఎక్కడాన్ని ఊహించుకోగలమా.. సరిగ్గా బ్రిటన్లో అదే జరిగింది. ఎంతో వేగంగా కొండ నుంచి జాలువారుతున్న ఒక్కసారిగా తన మార్గాన్ని వెనక్కి మరల్చుకొని అదే వేగంతో కొండమీదకు ఎక్కింది. ఇలా ఎందుకు జరిగిందని అనుకుంటున్నారా..
మరేం లేదు గత కొద్ది రోజులుగా బ్రిటన్ లోని పీక్ అనే జిల్లాలో పెనుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వీటి ప్రభావానికి ఆయా ప్రాంతాలకు చెందిన పౌరులంతా తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. భారీ స్థాయిలో వరదలు కూడా వస్తున్నాయి. ఈ సందర్భంగా అక్కడి పరిసర ప్రాంతాలకు అతి కష్టం మీద వీడియో కెమెరాతో బలంగా వీస్తున్న గాలుల మధ్యనే వెళ్లిన ఓ వ్యక్తికి అద్భుత దృశ్యం కనిపించింది. బలంగా వీస్తున్న గాలులకారణంగా ఓ జలపాతం వద్ద కిందకు పడాల్సిన నీరు కాస్త.. వేగంగా వెనక్కి మళ్లీ తిరిగి కొండపైకి చేరుతూ దర్శనమిచ్చింది. అంతే ఆ వీడియోను రికార్డు చేసి ఆన్ లైన్లో పెట్టగా ఇప్పుడది హల్ చల్ చేస్తోంది.