వాషింగ్టన్/హూస్టన్: అమెరికాలోని టెక్సాస్, లూసియానా రాష్ట్రాల్లో హార్వీ తుపాను వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు 14 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.90 వేల కోట్లు) విడుదల చేయాల్సిందిగా శ్వేతసౌధం వర్గాలు అమెరికా కాంగ్రెస్‌ను కోరాయి. హార్వీ వల్ల కనీవినీ ఎరుగని వరద అనేక ప్రాంతాలను ముంచెత్తిందనీ, ప్రజల జీవితాలు తలకిందులయ్యాయనీ, లక్షకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని తెలుపుతూ శ్వేతసౌధం బడ్జెట్ చీఫ్ మిక్ ముల్వనీ కాంగ్రెస్‌కు ఓ లేఖ రాశారు.
43,500 మంది వరద బాధితులు ఇంకా శిబిరాల్లోనే ఉన్నారనీ, లక్షలాది మంది ఇంటి మరమ్మతులకు సహాయం కోరుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, హార్వీ తుపాను ప్రభావితులకు మద్దతుగా ఈ ఆదివారాన్ని (సెప్టెంబరు 3) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ ప్రార్థనా దినంగా ప్రకటించారు. హార్వీ తుపాను కారణంగా దాదాపు 50 మంది మృతి చెందారు. వేల కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది.
కార్పొరేట్ల విరాళం 170 మిలియన్ డాలర్లు
వరద బాధితుల సహాయార్థం అమెరికాలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు విరివిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. గురువారం నాటికి పలువురు ప్రకటించిన విరాళాల మొత్తం 170 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,100 కోట్లు)కు చేరింది.
భారతీయ విద్యార్థి అంత్యక్రియలు పూర్తి
సరస్సులో మునిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన భారతీయ విద్యార్థి నిఖిల్ భాటియా అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయి. నిఖిల్ తల్లి, మిత్రుల అశ్రునయనాల మధ్య హూస్టన్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. నిఖిల్ అస్థికలు తీసుకుని ఆమె తల్లి సోమవారం భారత్‌కు బయలుదేరనున్నారు. కాగా, నిఖిల్‌తోపాటు సరస్సులో మునిగిన షాలినీ సింగ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు.
‘హార్వీ’ నష్టం పూడ్చేందుకు 14 బిలియన్ డాలర్లు
Published Sun, Sep 3 2017 2:48 PM | Last Updated on Tue, Sep 12 2017 1:46 AM
Advertisement