Harvey hurricane
-
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గు!
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ధరల ప్రభావంతో ఇన్ని రోజులు వాహనదారుల జేబులకు భారీగా చిల్లులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు దేశీయంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు దేశీయంగా మళ్లీ భగ్గుమననున్నాయట. దీనికి గల కారణం త్వరలో అట్లాంటిక్ మహాసముద్రంలో హారికేన్లు ప్రారంభం కానున్నాయట. అట్లాంటికా బేసిన్లో కనుక హారికేన్లు ప్రారంభమైతే, దేశీయంగా ఇంధన ధరలు భారీగానే పెరిగే అవకాశం కనిపిస్తోంది. అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ నది, మెక్సికో గల్ఫ్ కలిగి ఉన్న ప్రాంతాన్ని అట్లాంటిక్ బేసిన్గా పేర్కొంటారు. ఈ బేసిన్లో జూన్ నుంచి నవంబర్ వరకు హారికేన్ సీజన్ ప్రారంభమవుతోంది. ఏ సమయంలోనైనా రాకాసి హారికేన్ల విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు మధ్యలో నుంచి అక్టోబర్ చివరి వరకు రాకాసి హారికేన్లకు పీక్ సీజన్. ఒకవేళ ఈ హారికేన్లు కనుక ఏర్పడితే, దేశీయంగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను చవిచూడాల్సి వస్తోంది. గతేడాది కూడా భారీ ఎత్తున్న హార్వే హారికేన్, ఇర్మా హారికేన్ ఏర్పడటంతో, అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్ పుట్ 13 శాతం మేర పడిపోయింది. దీంతో ఇంధన ధరలు భారీగా పైకి ఎగిశాయి. ఈ ఏడాది కూడా మరికొన్ని రోజుల్లో అట్లాంటిక్ బేసిన్ ప్రాంతంలో ఏర్పడబోయే హారికేన్లు, ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో హారికేన్లకు, భారత్‌లో ఇంధన ధరలకు సంబంధం : గతేడాది సంభవించిన హార్వే, ఇర్మా హారికేన్లు, గల్ఫ్ కోస్ట్‌లోని అమెరికా రిఫైనరీ సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. దీంతో సరఫరా తగ్గిపోయింది. అవుట్‌పుట్ పడిపోవడంతో, అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. నైమెక్స్‌లో కూడా ఇంధన ధరల ఫ్యూచర్స్ పెరిగాయి. భారత్ ఇంధనాన్ని ఎక్కువగా గ్లోబల్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగానూ ధరలు పెరిగాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం రేటు పడిపోయింది. వీటన్నింటి పలితంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరలు మారేలా.. మన చమురు సంస్థలు రోజువారీ ధరల సమీక్షను చేపట్టాయి. ఈ రోజువారీ ధరల సమీక్షతో, తగ్గడం కంటే ఇంధర ధరలు పెరగడమే ఎక్కువగా ఉంది. -
‘హార్వీ’ ఎఫెక్ట్ : రూ.90 వేల కోట్లు విడుదల
-
‘హార్వీ’ నష్టం పూడ్చేందుకు 14 బిలియన్ డాలర్లు
వాషింగ్టన్/హూస్టన్: అమెరికాలోని టెక్సాస్, లూసియానా రాష్ట్రాల్లో హార్వీ తుపాను వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు 14 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.90 వేల కోట్లు) విడుదల చేయాల్సిందిగా శ్వేతసౌధం వర్గాలు అమెరికా కాంగ్రెస్‌ను కోరాయి. హార్వీ వల్ల కనీవినీ ఎరుగని వరద అనేక ప్రాంతాలను ముంచెత్తిందనీ, ప్రజల జీవితాలు తలకిందులయ్యాయనీ, లక్షకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని తెలుపుతూ శ్వేతసౌధం బడ్జెట్ చీఫ్ మిక్ ముల్వనీ కాంగ్రెస్‌కు ఓ లేఖ రాశారు. 43,500 మంది వరద బాధితులు ఇంకా శిబిరాల్లోనే ఉన్నారనీ, లక్షలాది మంది ఇంటి మరమ్మతులకు సహాయం కోరుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, హార్వీ తుపాను ప్రభావితులకు మద్దతుగా ఈ ఆదివారాన్ని (సెప్టెంబరు 3) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ ప్రార్థనా దినంగా ప్రకటించారు. హార్వీ తుపాను కారణంగా దాదాపు 50 మంది మృతి చెందారు. వేల కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. కార్పొరేట్ల విరాళం 170 మిలియన్ డాలర్లు వరద బాధితుల సహాయార్థం అమెరికాలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు విరివిగా విరాళాలు ప్రకటిస్తున్నారు. గురువారం నాటికి పలువురు ప్రకటించిన విరాళాల మొత్తం 170 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,100 కోట్లు)కు చేరింది. భారతీయ విద్యార్థి అంత్యక్రియలు పూర్తి సరస్సులో మునిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన భారతీయ విద్యార్థి నిఖిల్ భాటియా అంత్యక్రియలు శుక్రవారం పూర్తయ్యాయి. నిఖిల్ తల్లి, మిత్రుల అశ్రునయనాల మధ్య హూస్టన్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. నిఖిల్ అస్థికలు తీసుకుని ఆమె తల్లి సోమవారం భారత్‌కు బయలుదేరనున్నారు. కాగా, నిఖిల్‌తోపాటు సరస్సులో మునిగిన షాలినీ సింగ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు. -
వరదల్లో కొట్టుకొచ్చిన భారీ మొసలి.. పట్టేశారు
-
వరదల్లో కొట్టుకొచ్చిన భారీ మొసలి.. పట్టేశారు
సాక్షి, టెక్సాస్: అమెరికాను హర్వే తుఫాన్ అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అత్యంత ఖరీదైన తుఫాన్‌గా అభివర్ణించబడ్డ హర్వే ధాటికి నాశనం అయిన ప్రాంతాల్లో టెక్సాస్ నగరం కూడా ఉంది. వర్షాలు తెరిపినివ్వటంతోపాటు వరద తగ్గుముఖం పట్టడంతో బ్రెయిన్ ఫోస్టర్ అనే వ్యక్తి హర్రీస్ కంట్రీలోని తన ఇంటికి బయలేదేరాడు. జరిగిన నష్టాన్ని తల్చుకుని బాధపడుతూనే పని వాళ్లతో ఇంటిని శుభ్రం చేయిస్తున్నాడు. ఇంతలో డైనింగ్ టేబుల్ కింద దృశ్యాన్ని చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయ్యింది. 9 అడుగుల ఓ భారీ మొసలి తాపీగా విశ్రాంతి తీసుకుంటుంది. ఆ షాక్ నుంచి తేరుకున్న ఫోస్టర్ వెంటనే అత్యవసర సిబ్బందికి కాల్ చేశాడు. తమకు అందిన సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు 20 నిమిషాలపాటు శ్రమించి ఆ భారీ మకరాన్ని బంధించేశారు. సమీపంలో కొలను ప్రాంతంలో మొసలిని విడిచిపెడతామని అధికారులు తెలిపారు. గత వారం టెక్సాస్ లోనే ఓ మహిళ రెండు మొసళ్లు వదరల్లో ఈదుకుంటూ రావటం చిత్రీకరించి ఆ భయానక దృశ్యాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. కాగా, హర్వే హరికేన్ మూలంగా వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తగా.. వరద నీటితోపాటు జంతువులు కూడా కొట్టుకుని వస్తున్నాయి. ఒక్క హుస్టన్ నగరంలోని జలప్రాణి సంరక్షణ కేంద్రం నుంచే 350 జంతువులు తప్పిపోయినట్లు అధికారులు వెల్లడించారు. -
హార్వీ నష్టం రూ.లక్ష కోట్లు
అమెరికాలో తుపాను దెబ్బకు మొత్తం 38 మంది మృతి హూస్టన్: టెక్సాస్‌ను వణికించిన హార్వీ హరికేన్ అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రకృతి వైపరీత్యంగా మిగిలి పోయింది. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసి 38 మందిని బలితీసుకున్న ఈ పెనుతుపాను బీభత్సానికి భారీగా రూ.1,02,500 కోట్ల (160 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లింది. బుధవారం రెండోసారి లూసియానా తీరాన్ని దాటిన క్రమంలో భారీ వర్షాలతో టెక్సాస్ సరిహద్దు ప్రాంతాలను వరదతో ముంచెత్తింది. హూస్టన్ రాష్ట్రంలో 32 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని, పునరావాస కేంద్రంలో 30 వేల మందికి మందికి సరిపోయే ఏర్పాట్లు చేశామని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ చెప్పారు. హూస్టన్ సమీపంలోని ఓ రసాయన పరిశ్రమలో రెండు పేలుళ్లు సంభవించాయి. అట్లాంటిక్ సముద్రంలో ఇర్మా హరికేన్ హార్వీ హరికేన్ సృష్టించిన విధ్వంసాన్ని మరచిపోకముందే తూర్పు అట్లాంటిక్ సముద్రంలో ఇర్మా హరికేన్ ఏర్పడినట్లు మియామీలోని నేషనల్ హరికేన్ సెంటర్ అధికారులు తెలిపారు. -
పదివేల కుటుంబాలకు హార్వీ పరేషాన్
హౌస్టన్: అమెరికాలోని హూస్టన్‌ను అతలాకుతలం చేసిన హరికేన్ హార్వీ అక్కడి తెలుగు వారికీ తీరని విషాదం మిగిల్చింది. హూస్టన్ ప్రాంతంలో పలు తెలుగు కుటుంబాలు నివసిస్తుండగా, వారి ఇళ్లు దెబ్బతినడం ఇతరత్రా పెద్దమొత్తంలో ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రేటర్ హూస్టన్ పరిథిలో తెలుగు కుటుంబాలకు హార్వీతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ తరహా ప్రకృతి వైపరీత్యాలకు బీమా కవరేజ్ వర్తించకపోవడం వారిలో ఆందోళన రేకెత్తిస్తున్నది. హరికేన్ ప్రభావానికి గురైన బాధిత కుటుంబానికి రూ 30 లక్షల వరకూ ఆస్తి నష్టం వాటిల్లివచయ్చని భావిస్తున్నారు.మరోవైపు పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలో వారంతా బిక్కుబిక్కుమంటున్నారు. భారీ విలయం సంభవించిన క్రమంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే అవకాశం ఉన్నా ఇతమిద్దంగా దానిపై ఎవరూ హామీ ఇచ్చే పరిస్థితి లేదు.హార్వీ ఎఫెక్ట్ ఉన్న గ్రేటర్ హౌస్టన్ పరిథిలోని కాటీ, సుగర్ ల్యాండ్, సైప్రస్, బెలైరె ప్రాంతాల్లో 50,000 జనాభాతో పదివేల తెలుగు కుటుంబాలున్నాయి. వీరిలో చాలావరకూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వైద్య వృత్తిలో ఉన్నవారే అధికం. వీరు తమ ఇళ్లు పునర్నిర్మించుకోవాలంటే రుణాలపై ఆధారపడాల్సిందే. ఇక ఉన్నత విద్య ముగించి ఉద్యోగాల కోసం అన్వేషించేవారి పరిస్థితి మరింత దయనీయం. విద్యార్థులూ ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తుపాన్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లోని తెలుగువారు షెల్టర్ హోమ్స్‌లో తలదాచుకున్నారు. హార్వీ ప్రకంపనలతో అక్కడ తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారి కుటుంబీకులు ఇక్కడ వారి గురించి ఆందోళన చెందుతున్నారు. -
టెక్సాస్‌లో హెరికేన్ బీభత్సం.. ట్రంప్ పర్యటన
- ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం పర్యటించనున్న దేశాధ్యక్షుడు - 9 మంది మృతి.. చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు - ఇంకా నీటిలోనే అమెరికా నాలుగో అతిపెద్ద నగరం హూస్టన్ - ఉత్తర దిశగా కదులుతోన్న హెరికేన్.. లూసియానాలో ఎమెర్జెన్సీ - సహాయ కార్యక్రమాల్లో వేలాది సిబ్బంది.. అయినా సేవలు ఆలస్యం హూస్టన్: గడిచిన 50 ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో చుట్టుముట్టిన హార్వే హెరికేన్ ధాటికి టెక్సాస్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. అమెరికాలోనే నాలుగో అతిపెద్ద నగరం హూస్టన్ ఇంకా నీటిలోనే నానుతోంది. శుక్రవారం తుపాను తీరం దాటగా, ఇప్పటికీ వర్షం విరామం లేకుండా కురుస్తూనేఉంది. దీంతో హూస్టన్ సహా పటు పట్టణాలు, కంట్రీల్లో జనజీవనం దాదాపుగా స్థంభించింది. వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. మూడు అడుగుల మేర ముంచేసిన నీళ్లగుండా లక్షల మంది ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఇప్పటివరకు వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం హెరికేన్ ధాటికి కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. హూస్టన్, హారిస్‌కౌంటీ తదితర ప్రాంతాల్లో 76 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ట్రంప్ పర్యటన: హార్వే హెరికేన్ ధాటికి దాదాపు కకావికలమైన టెక్సాస్ రాష్ట్రంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పర్యటించనున్నారు. వాషింగ్టన్ నుంచి బయలుదేరే ట్రంప్ నేరుగా గల్ఫ్ఆఫ్ మెక్సికో తీరంలోని కార్పస్ క్రిస్టికి చేరుకుంటారు. అక్కడి నుంచి టెక్సాస్ రాజధాని అస్టిన్‌కు వెళ్లి, అధికారులతో సమావేశమై, హెరికేన్ సహాయక చర్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటన చేసింది. కట్రినా కంటే ఘోరవిపత్తు!: టెక్సాస్‌ను ముంచెత్తిన హార్వే హెరికేన్.. అక్కడి విద్యుత్ వ్యవస్థను సమూలంగా కుప్పకూల్చింది. రవాణా, కమ్యూనికేషన్ తదిరత వ్యవస్థలూ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వేలాది ఇండ్లు, కట్టడాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నష్టం.. 2005నాటి కట్రినా హెరికేన్ విపత్తుకు సమానంగా ఉండొచ్చని భావిస్తున్నారు. నాటి విపత్తులో 1800 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి రిపబ్లికన్ ప్రెసిడెంట్ జార్జిబుష్ బాధ్యతారాహిత్యం వల్లే ప్రాణనష్టం పెరిగిందనే విమర్శలూ వచ్చాయి. అయితే, ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నప్పటికీ, బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సేవలు జాప్యం అవుతోన్నాయి. చిక్కుకున్న 200మంది భారత విద్యార్థులు: టెక్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్‌లోకి వరద నీరు చొచ్చుకురావడంతో దాదాపు 200 మంది భారతీయ విద్యార్థులు క్యాంపస్‌లో చిక్కుకున్నట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీటర్లో తెలిపారు. షాలిని, నిఖిల్ భాటియా అనే విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. అక్కడి భారత కాన్సుల్ జనరల్ అనుపమ్ రే సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలకు బోట్లు అవసరం కావడంతో, విద్యార్థులకు బోట్ల ద్వారా ఆహారం అందించాలన్న తమ ప్రతిపాదనను అమెరికా తీరరక్షక దళం తిరస్కరించిందని, అయితే స్థానిక భారతీయ అమెరికన్లు బాధితులకు ఆహారం, ఇతర వస్తువులు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. లూసియానాలో హై అలర్ట్: టెక్సాస్‌లో బీభత్సం సృష్టించిన హార్వే హెరికేన్ ప్రస్తుతం ఉత్తరదిశగా కదులుతూ లూసియానా వైపునకు పయనిస్తోంది. దీంతో లూసియానా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టెక్సాస్‌లో మాదిరే లూసియానాలోనూ లక్షల మందిని ఇళ్లు ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేలాది నేషనల్ సెక్యూరిటీ గార్డు బృందాలు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, సాధారణ పౌరులు, స్వచ్ఛంద కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు. వరదల్లో చిక్కుకుపోయినవారిని కాపాడేందుకు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లు, బోట్లు, హై వాటర్ ట్రక్కులను వినియోగిస్తున్నారు.