
పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ధరల ప్రభావంతో ఇన్ని రోజులు వాహనదారుల జేబులకు భారీగా చిల్లులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు దేశీయంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు దేశీయంగా మళ్లీ భగ్గుమననున్నాయట. దీనికి గల కారణం త్వరలో అట్లాంటిక్ మహాసముద్రంలో హారికేన్‌లు ప్రారంభం కానున్నాయట. అట్లాంటికా బేసిన్‌లో కనుక హారికేన్‌లు ప్రారంభమైతే, దేశీయంగా ఇంధన ధరలు భారీగానే పెరిగే అవకాశం కనిపిస్తోంది.
అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ నది, మెక్సికో గల్ఫ్ కలిగి ఉన్న ప్రాంతాన్ని అట్లాంటిక్ బేసిన్‌గా పేర్కొంటారు. ఈ బేసిన్‌లో జూన్ నుంచి నవంబర్ వరకు హారికేన్ సీజన్ ప్రారంభమవుతోంది. ఏ సమయంలోనైనా రాకాసి హారికేన్‌ల విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు మధ్యలో నుంచి అక్టోబర్ చివరి వరకు రాకాసి హారికేన్‌లకు పీక్ సీజన్. ఒకవేళ ఈ హారికేన్‌లు కనుక ఏర్పడితే, దేశీయంగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలను చవిచూడాల్సి వస్తోంది. గతేడాది కూడా భారీ ఎత్తున్న హార్వే హారికేన్, ఇర్మా హారికేన్ ఏర్పడటంతో, అంతర్జాతీయంగా రిఫైనరీ అవుట్ పుట్ 13 శాతం మేర పడిపోయింది. దీంతో ఇంధన ధరలు భారీగా పైకి ఎగిశాయి. ఈ ఏడాది కూడా మరికొన్ని రోజుల్లో అట్లాంటిక్ బేసిన్ ప్రాంతంలో ఏర్పడబోయే హారికేన్‌లు, ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో హారికేన్‌లకు, భారత్‌లో ఇంధన ధరలకు సంబంధం :
గతేడాది సంభవించిన హార్వే, ఇర్మా హారికేన్లు, గల్ఫ్ కోస్ట్‌లోని అమెరికా రిఫైనరీ సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. దీంతో సరఫరా తగ్గిపోయింది. అవుట్‌పుట్ పడిపోవడంతో, అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. నైమెక్స్‌లో కూడా ఇంధన ధరల ఫ్యూచర్స్ పెరిగాయి. భారత్ ఇంధనాన్ని ఎక్కువగా గ్లోబల్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, దేశీయంగానూ ధరలు పెరిగాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం రేటు పడిపోయింది. వీటన్నింటి పలితంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరలు మారేలా.. మన చమురు సంస్థలు రోజువారీ ధరల సమీక్షను చేపట్టాయి. ఈ రోజువారీ ధరల సమీక్షతో, తగ్గడం కంటే ఇంధర ధరలు పెరగడమే ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment