- ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం పర్యటించనున్న దేశాధ్యక్షుడు
- 9 మంది మృతి.. చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు
- ఇంకా నీటిలోనే అమెరికా నాలుగో అతిపెద్ద నగరం హూస్టన్
- ఉత్తర దిశగా కదులుతోన్న హెరికేన్.. లూసియానాలో ఎమెర్జెన్సీ
- సహాయ కార్యక్రమాల్లో వేలాది సిబ్బంది.. అయినా సేవలు ఆలస్యం
హూస్టన్: గడిచిన 50 ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో చుట్టుముట్టిన హార్వే హెరికేన్ ధాటికి టెక్సాస్ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. అమెరికాలోనే నాలుగో అతిపెద్ద నగరం హూస్టన్ ఇంకా నీటిలోనే నానుతోంది. శుక్రవారం తుపాను తీరం దాటగా, ఇప్పటికీ వర్షం విరామం లేకుండా కురుస్తూనేఉంది.
దీంతో హూస్టన్ సహా పటు పట్టణాలు, కంట్రీల్లో జనజీవనం దాదాపుగా స్థంభించింది. వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. మూడు అడుగుల మేర ముంచేసిన నీళ్లగుండా లక్షల మంది ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఇప్పటివరకు వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం హెరికేన్ ధాటికి కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. హూస్టన్, హారిస్‌కౌంటీ తదితర ప్రాంతాల్లో 76 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ట్రంప్ పర్యటన: హార్వే హెరికేన్ ధాటికి దాదాపు కకావికలమైన టెక్సాస్ రాష్ట్రంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పర్యటించనున్నారు. వాషింగ్టన్ నుంచి బయలుదేరే ట్రంప్ నేరుగా గల్ఫ్‌ఆఫ్ మెక్సికో తీరంలోని కార్పస్ క్రిస్టికి చేరుకుంటారు. అక్కడి నుంచి టెక్సాస్ రాజధాని అస్టిన్‌కు వెళ్లి, అధికారులతో సమావేశమై, హెరికేన్ సహాయక చర్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఒక ప్రకటన చేసింది.
కట్రినా కంటే ఘోరవిపత్తు!: టెక్సాస్‌ను ముంచెత్తిన హార్వే హెరికేన్.. అక్కడి విద్యుత్ వ్యవస్థను సమూలంగా కుప్పకూల్చింది. రవాణా, కమ్యూనికేషన్ తదిరత వ్యవస్థలూ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వేలాది ఇండ్లు, కట్టడాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నష్టం.. 2005నాటి కట్రినా హెరికేన్ విపత్తుకు సమానంగా ఉండొచ్చని భావిస్తున్నారు. నాటి విపత్తులో 1800 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి రిపబ్లికన్ ప్రెసిడెంట్ జార్జిబుష్ బాధ్యతారాహిత్యం వల్లే ప్రాణనష్టం పెరిగిందనే విమర్శలూ వచ్చాయి. అయితే, ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నప్పటికీ, బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సేవలు జాప్యం అవుతోన్నాయి.
చిక్కుకున్న 200మంది భారత విద్యార్థులు: టెక్సాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్‌లోకి వరద నీరు చొచ్చుకురావడంతో దాదాపు 200 మంది భారతీయ విద్యార్థులు క్యాంపస్‌లో చిక్కుకున్నట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీటర్‌లో తెలిపారు. షాలిని, నిఖిల్ భాటియా అనే విద్యార్థులను ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. అక్కడి భారత కాన్సుల్ జనరల్ అనుపమ్ రే సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలకు బోట్లు అవసరం కావడంతో, విద్యార్థులకు బోట్ల ద్వారా ఆహారం అందించాలన్న తమ ప్రతిపాదనను అమెరికా తీరరక్షక దళం తిరస్కరించిందని, అయితే స్థానిక భారతీయ అమెరికన్లు బాధితులకు ఆహారం, ఇతర వస్తువులు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు.
లూసియానాలో హై అలర్ట్: టెక్సాస్‌లో బీభత్సం సృష్టించిన హార్వే హెరికేన్ ప్రస్తుతం ఉత్తరదిశగా కదులుతూ లూసియానా వైపునకు పయనిస్తోంది. దీంతో లూసియానా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టెక్సాస్‌లో మాదిరే లూసియానాలోనూ లక్షల మందిని ఇళ్లు ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేలాది నేషనల్ సెక్యూరిటీ గార్డు బృందాలు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, సాధారణ పౌరులు, స్వచ్ఛంద కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు. వరదల్లో చిక్కుకుపోయినవారిని కాపాడేందుకు పెద్ద సంఖ్యలో హెలికాప్టర్లు, బోట్లు, హై వాటర్ ట్రక్కులను వినియోగిస్తున్నారు.