హూస్టన్(టెక్సాస్): భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్ని వినేందుకు ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి వేలాది మంది భారతీయులు తరలివచ్చారు. కిక్కిరిసిపోయిన జన సందోహంతో ఆదివారం ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో పండుగ వాతావరణం కనిపించింది. భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డోళ్ల మోతలు, మోదీ, మోదీ అనే నినాదాలు, కేకలతో ఎన్‌ఆర్‌జీ స్టేడియం హోరెత్తిపోయింది. చాలామంది తమ ముఖాలపై భారత్, అమెరికా జాతీయ పతాకాలను ముద్రించుకుని వచ్చారు. 400 మంది కళాకారులు ప్రదర్శించిన భారతీయ సంప్రదాయ, జానపద నృత్యాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి.
భాంగ్రా, మోహినీఅట్టం, భరతనాట్యం, గార్భా వంటి నృత్యాలను ఆసాంతం ఆస్వాదించారు. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ దాదాపు వెయ్యి మంది గుజరాతీలు సంప్రదాయ దాండీయా నృత్యం ప్రదర్శించారు. ఎన్‌ఆర్‌జీ స్టేడియం అమెరికాలోనే అతిపెద్ద స్టేడియంగా పేరుగాంచింది. టెక్సాస్ ఇండియా ఫోరమ్(టీఐఎఫ్) నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమానికి కొన్ని వారాల క్రితమే టిక్కెట్లు విక్రయించారు. 50 వేల మంది భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు అంచనా. చరిత్రాత్మకమైన ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు అమెరికాలోని అన్ని ప్రాంతాల నుంచి భారతీయులు తరలివచ్చినట్లు ‘హౌదీ మోడీ’ నిర్వాహకుల్లో ఒకరైన ప్రణవ్ దేశాయ్ చెప్పారు. ఇలాంటి కార్యక్రమం జరగడం అమెరికాలో ఇదే మొదటిసారి అని టెక్సాస్ ఇండియా ఫోరమ్ ప్రతినిధి గీతేశ్ దేశాయ్ చెప్పారు.
అవీ.. ఇవీ..!
► భారత కాలమానం ప్రకారం రాత్రి 9.40 గంటలకు ప్రధాని మోదీ ఎన్‌ఆర్‌జీ స్టేడియంలోకి ప్రవేశించారు.
► స్టేడియంలోని దాదాపు 50 వేల మంది భారతీయ అమెరికన్లు మోదీకి అపూర్వ స్వాగతం పలికారు. ఆయన వేదికపైకి రాగానే.. కొన్ని నిమిషాల పాటు మోదీ, మోదీ నినాదాలతో హోరెత్తించారు.
► మోదీకి హ్యూస్టన్ మేయర్, టెక్సాస్ గవర్నర్ సహా టెక్సస్ చట్ట ప్రతినిధులు, భారతీయ–అమెరికన్ చట్ట ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
► అంతకుముందు గంటన్నరకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. భారతీయ అమెరికన్ బృందాలు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆహూతులను ఉర్రూతలూగించారు.
► భారత దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, ప్రాంతాల కళా ప్రదర్శనలకు కార్యక్రమంలో చోటు కల్పించారు.
► ఓ ప్రదర్శనలో ’నేను పక్కా లోకల్(జనతా గ్యారెజ్ సినిమా)’ అనే తెలుగు పాట పల్లవిని ఉపయోగించుకున్నారు.
► మోదీ స్టేడియంలోకి రావడం కొంత ఆలస్యమైనా.. భారతీయ అమెరికన్లు ఓపిగ్గా వేచి చూశారు.
► మోదీకి స్వాగతం పలికిన తరువాత అమెరికా అధ్యక్షుడు వచ్చేవరకు మళ్లీ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. గాంధీజీ 150వ జయంతి వేడుకల గుర్తుగా ’వైష్ణవ జనతో’ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment