హార్వీ నష్టం రూ.లక్ష కోట్లు
అమెరికాలో తుపాను దెబ్బకు మొత్తం 38 మంది మృతి
హూస్టన్: టెక్సాస్‌ను వణికించిన హార్వీ హరికేన్ అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రకృతి వైపరీత్యంగా మిగిలి పోయింది. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసి 38 మందిని బలితీసుకున్న ఈ పెనుతుపాను బీభత్సానికి భారీగా రూ.1,02,500 కోట్ల (160 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లింది.
బుధవారం రెండోసారి లూసియానా తీరాన్ని దాటిన క్రమంలో భారీ వర్షాలతో టెక్సాస్ సరిహద్దు ప్రాంతాలను వరదతో ముంచెత్తింది. హూస్టన్ రాష్ట్రంలో 32 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని, పునరావాస కేంద్రంలో 30 వేల మందికి మందికి సరిపోయే ఏర్పాట్లు చేశామని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ చెప్పారు. హూస్టన్ సమీపంలోని ఓ రసాయన పరిశ్రమలో రెండు పేలుళ్లు సంభవించాయి.
అట్లాంటిక్ సముద్రంలో ఇర్మా హరికేన్
హార్వీ హరికేన్ సృష్టించిన విధ్వంసాన్ని మరచిపోకముందే తూర్పు అట్లాంటిక్ సముద్రంలో ఇర్మా హరికేన్ ఏర్పడినట్లు మియామీలోని నేషనల్ హరికేన్ సెంటర్ అధికారులు తెలిపారు.