
కుక్కను కట్టేసినట్టు యువతిని కట్టి..
కరోలినా:
గత అగస్టు నుంచి కనిపించకుండా పోయిన కాలా బ్రౌన్(30) అనే యువతి అత్యంత ధీన స్థితిలో పోలీసులకు కనిపించింది. ఓ కుక్కను కట్టేసినట్టు యువతిని చైన్తో, తాళం వేసి ఉన్న షిప్పింగ్ మెటల్ కంటైనర్లో కట్టేసి ఉంది. ఈ సంఘటన దక్షిణ కరోలినాలో ఉడ్రఫ్ నగరంలోని ఓ మారు మూల ప్రాంతంలో చోటు చేసుకుంది. కంటైనర్ నుంచి శబ్ధం వస్తుందన్న సమాచారం అందుకున్న పోలీసులు సెర్చ్ వారంట్తో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
తాము ఆ కంటైనర్ తాళం తెరిచేసరికి కాలా బ్రౌన్ మెడ చుట్టూ కుక్కలను కట్టేసే చైన్తో కట్టేసి కిందపడి అత్యంత దారుణమైన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. తాము అక్కడికి చేరుకునే వరకు కాలా బ్రౌన్ బతికే ఉండటం నిజంగా అదృష్టమే అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాలా బ్రౌన్పై అత్యాచారం జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రేప్ కేసులో పాత నేరస్తుడు టాడ్ కోహ్లీప్(45)కు సంబంధించిన ప్రాంగణంలో ఈ ఘటన వెలుగు చూసింది. టాడ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత రెండు నెలలుగా అదే కంటైనర్లో ఉంటున్నట్టు కాలా బ్రౌన్ పోలీసులకు తెలిపింది. అదే ప్రాంతంలో నలుగురి మృతదేహాలు లభించే అవకాశం ఉందని కాలా బ్రౌన్ తమతో చెప్పిందని పోలీసులు తెలిపారు.
బ్రౌన్ బోయ్ ఫ్రెండ్ చార్లెస్ కార్వర్(32) కూడా రెండు నెలల నుంచి కనిపించకుండా అదృశ్యమయ్యాడు. అతను క్షేమంగానే ఉండాలని భావిస్తున్నామని పోలీసులు ఉన్నతాధికారి అన్నారు. కాలా బ్రౌన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బ్రౌన్ని విచారించి మరింత సమాచారం తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు. టాడ్ కోహ్లీప్ సీరియల్ కిల్లరా అనే కోణంలో కూడా విచారణ ప్రారంభించినట్టు తెలిపారు.