కొలంబియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన కీలకమైన సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీలోనూ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోయారు. ప్రత్యర్థి నిక్కీ హాలేపై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలో ట్రంప్‌నకు 63 శాతం ఓట్లు రాగా హాలేకు 36.8 ఓట్లు మాత్రమే వచ్చాయి. హాలేకు ఇది అవమానకరమైన ఓటమిగా అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది.
రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి నామినేషన్‌కు పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన హాలే గతంలో సౌత్ కరోలినా గవర్నర్‌గా రెండుసార్లు పనిచేశారు. హాలేకు సౌత్ కరోలినా కంచుకోటగా విశ్లేషకులు చెప్తారు. ఇక్కడ కూడా ట్రంప్ ఘన విజయం సాధించడంతో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష పదవి పోటీకి ట్రంప్ అభ్యర్థిత్వం ఖాయమైపోయినట్లేనన్న ప్రచారం జరుగుతోంది.
రిపబ్లికన్ పార్టీ ప్రస్తుతం చాలా ఐక్యంగా ఉందని సౌత్ కరోలినా ప్రైమరీ పోలింగ్ ముగిసిన తర్వాత సౌత్ కరోలినా రాజధాని కొలంబియాలో ట్రంప్ వ్యాఖ్యానించారు. సౌత్ కరోలినాలో ఓటమి తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ నుంచి నిక్కీ హాలే తప్పుకోవాలని ట్రంప్ వర్గం డిమాండ్ చేస్తోంది. అయితే తాను రేస్ నుంచి తప్పుకోనని హాలే ప్రకటించారు.
మార్చి5 మంగళవారం(సూపర్ ట్యూస్‌డే)నాడు జరిగే పలు స్టేట్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు. కాగా, ట్రంప్ ఇప్పటివరకు 5 ప్రైమరీల్లో విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఎవరూ అందుకోలేనంత ముందంజలోకి వెళ్లారు. ప్రైమరీలు ముగిసిన తర్వాత ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అటు డెమొక్రాట్ల ప్రైమరీల్లో ప్రస్తుత దేశ అధ్యక్షకుడు జో బైడెన్ రేసులో ముందున్నారు.
ఇదీ చదవండి.. న్యూయార్క్ అపార్ట్‌మెంట్‌లో మంటలు.. భారత యువకుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment